Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుమారీ శతకము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2013, సోమవారం

కుమారీ శతకం - 40

ఇక్కడి దక్కడఁ నక్కడి
దిక్కడ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్
పొక్కినఁ గల చేడియ ల
మ్మక్కా!యిడుముళ్ళమారి యండ్రు కుమారీ! 

భావం:-
ఓ కుమారీ!అక్కడ మాటలిక్కడ,ఇక్కడ మాటలక్కడ చెప్పి నలుగురిలో నవ్వులపాలుగాకు.కలహాలమారియని నిన్నాడిపోసుకుంటారు. 

7, జులై 2013, ఆదివారం

కుమారీ శతకం - 39

వేకువజామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాచి పని శీర్పవలెన్
లేకున్నఁ దెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనఁ గుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!తెల్లవాఱుజాముననే ఇంటి ముంగిట పాచిపనులు చేయుట మంచిది.బారెడు పొద్దెక్కిన తర్వాత నలుగురి ఎదుట పాచిపని చేసినచో నవ్వులపాలవుతావు. 

6, జులై 2013, శనివారం

కుమారీ శతకం - 46

నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగఁ బడెడి జాడ గుమారీ! 

 భావం:-
ఓ చినదానా!ఇంటి ఇల్లాలు అనసరంగా ఇకిలించరాదు.(నవ్వరాదు).చిరునవ్వు చింతలను బారద్రోలును.పండ్లు కనుబడునట్లు పకపకా నవ్వరాదు.నవ్వు నాలుగు విదాల చేటుయని మరువకుము. 

కుమారీ శతకం - 38

ఇంటఁ గల గుట్టు నీ పొరు
గింట రవంతైనఁ దెలుప నేఁగకు దానం
గంటనపడి నీవారలు
గెంటించెద రిల్లు వెడలఁ గినుక గుమారీ! 

  భావం:-
ఓ కుమారీ! నీ ఇంటి రహస్యాలను పొరుగింటికి తెల్పినచో పలు అనర్థములు వచ్చును.సొంతవారే ఏవగించుకుంటారు.విరోధములు వస్తాయి.కోపముతో నీవారే నిన్ను ఇంటి నుండి వెడలగొట్టెదరు.కావున గుట్టును రట్టు జేయకుము. 

5, జులై 2013, శుక్రవారం

కుమారీ శతకం - 37

బద్దకము సంజనిద్దుర
వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్
గద్దింతురింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!

   భావం:-
ఓ యవ్వనవతీ!బద్దకముతో సాయంకాలము నిద్రించినచో మొద్దుపని నిందింతురు.ఇంటివారు తూలనాడెదరు. 

కుమారీ శతకం - 45

నడకలలో నడుగుల చ
ప్పుడు వినబడకుండవలయును భువి గుంటలు క
న్పడరాదు మడమనొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!నీ అడుగుల చప్పుడు వినబడకుండునట్లు నడువవలెను.నీ కాలి మడముల గుర్తులు పడకుండా నడవవలెను.స్త్రీల సద్గుణములు తెలుసుకొని జీవింపుమమ్మా! 

4, జులై 2013, గురువారం

కుమారీ శతకం - 36

కులదేవతలకు బెట్టిన
పొలుపునఁ దనయింటియాఁడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసఁగకుండిన
గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!ప్రేమతో నీ ఇష్టదేవతలకు బెట్టినట్లు దన ఇంటి ఆడపడుచులకు ఉన్నంతలో బెట్టక పోయినచో,కలహము వచ్చి,వారి శాపానుగ్రహములకు పాత్రురాలవుతావు.వారిని నీ కుల దేవతల వలె నెరుంగుము. 

3, జులై 2013, బుధవారం

కుమారీ శతకం - 35

తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవచ్చి మెలంగరాదు జగతి గుమారీ! 

భావం:-
ఓ కుమారీ!నీ యింటి పనివారు (దాసీలు)నీకెంత మేలు జేసిననూ,నీమెప్పుపొందాలని నీకెంత ఇష్టమైన పనులు చేసి పెట్టిననూ వారితో ఒకింత జాగరూకతతో మెలుగుము.వారితో అత్యంతస్నేహము జేసి అమితముగా మోసపోవద్దు. 

2, జులై 2013, మంగళవారం

కుమారీ శతకం - 34

పుట్టింటివారి నీచతఁ
బెట్టకు మత్తింటివారు పెట్టెడి భాదల్
పుట్టింట దెలియనీయకు
రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ! 


  భావం:-
ఓ కుమారీ! పుట్టింటి వారిని నీచముగా జూడకు.అత్తింటి కష్టమును పుట్టింట వెల్లడించరాదు.ఈ విదమైన అల్లరి చేయుటవలన అలుసైపోవుదువు.  

1, జులై 2013, సోమవారం

కుమారీ శతకం - 33

కడుఁబెద్దమూట దెచ్చినఁ
జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం
బడుదురు తల్లిదండ్రులు తోఁ
బడుచులు సోదరులు నిందఁ బడుచు గుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!అత్తవారింటికి నీవెంత పెద్ద మూటతో వచ్చిననూ,దుష్టురాలై ప్రవర్తించినచో నీ తల్లిదండ్రుల,అన్నదమ్ముల నిందాశాపములతో నిరంతరము నశించిపొవుదువు.  

30, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 32

కడు బుద్దిగలిగి మెలఁగినఁ
బడఁతుక పుట్టింటివారు పదివేల వరా
లిడుకంటె గీర్తియగు ద
మ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!మిక్కిలి చాతుర్యముతో మెలిగిన ఆడదానికి పుట్టింటి వారు పదివేల వరాలనిచ్చుట కంటెను మిక్కిలి గొప్పది.కీర్తిగలదగును.ఆడువారు భోగభాగ్యములున్నను,లేకున్నను ఈ సూక్ష్మమునెరింగి నడుచుకొనవలెను. 

29, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 31

జీవములు భర్తపద రా
జీవములని చిత్తమందుఁ జింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమ్మిఁ జేయు గుమారీ! 


 భావం:-
ఓ కుమారీ!భర్త పాదముల వద్దే తన జీవితమని తలంచిన పతివ్రతలకు,తన పాద సేవాభాగ్యములను ఆ విష్ణుమూర్తి ప్రేమతో కలుగజేయును. 

28, జూన్ 2013, శుక్రవారం

కుమారీ శతకం - 30

30.మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారి దిగఁద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పు మాట కుమారీ! 

  భావం:-
ఓ కుమారీ!తన భర్త తన మాట జవదాటడని తలంచి,గర్వముతో,తన యింటివారిని నీచముగా చూచుట మగువకు తగదు.అటువంటి స్త్రీ తోటి స్త్రీలయందు అవమానములపాలగును. 

27, జూన్ 2013, గురువారం

కుమారీ శతకం - 29

29 .  మృతియైనను బ్రతుకైనం
బతితోడనె నతికి జెల్లుఁ బతిబాసిన యా
బ్రతు కొక బ్రతుకా? జీవ
స్మృతి గాక వదూటి కెన్న నిదియుఁ గుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!పతివ్రతయైన పడతికి తన పడతితోనే జీవితమని తెలుసుకొమ్ము! చావైననూ,బ్రతుకైననూ తన భర్తతోనే.భర్త విడిచిన ఆడుదాని బ్రతుకొక బ్రతుకేనా!ఆ బ్రతుకు బ్రతికిననూ చచ్చినదానితో సమానమే.

26, జూన్ 2013, బుధవారం

కుమారీ శతకం - 28

28. అత్తపయిన్ మఱఁదలిపయి
నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినఁ దనకే కీడగుఁ
జిత్తములో దీనిఁజింత సేయు కుమారీ! 

 భావం:-
ఓ కుమారీ!అత్త,మరదళ్ళపై వచ్చిన కోపమును బిడ్డలపై జూపించినచో నష్టపోయేది తానేయని మరువకము.మనస్సునందొక్కసారి దీనిని గురించి ఆలోచింపుము. 

25, జూన్ 2013, మంగళవారం

కుమారీ శతకం - 27

27.  పోకిళ్ళు పోక పొందిక
నాకులలో బిందెరీతి నడఁకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ! 

 భావం:-
 ఓ కుమారీ! వ్యర్థ ప్రసంగములకు పోవద్దు. అతిగా వాగకూడదు.ఆకుల మద్య నుండే పిందె వలె ఒదిగి యుండి వినయముతో కలిసి మెలిసి నడుచుకొనవలెను. అప్పుడే ఆ స్త్రీకి సమాజములో పేరు ప్రఖ్యాతులు, గౌరవమర్యాదులు లభిస్తాయి.

24, జూన్ 2013, సోమవారం

కుమారీ శతకం - 26

26.  పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొక వంక లేక పరఁగు గుమారీ! 

 భావం:-
 ఓ కుమారి!భర్తకు,అత్తమామలకు ఇష్టము లేని పనిని చేయుకుము. వారి కిష్టమైన మంచి పనులు చేసి మెప్పుబడవలయును.నీ జీవితంలో మచ్చలేకుండా మసులుకొనుము.

23, జూన్ 2013, ఆదివారం

కుమారీ శతకం - 25

25.  పిల్లలఁ గనుగొనఁ దలఁచిన
యిల్లాలు గతాగతంబు లెఱుగక ఱాఁగై
యల్లరిఁ బెట్టినఁ జెడుఁ దా
నుల్లసములఁబడును,గీడు నొందుఁ గుమారీ! 

 భావం:-
 ఓ కుమారీ!బిడ్డలను కలవవలెననె ఆడుది,మంచి చెడ్డలు దెలుసుకొనక, మర్యాదదప్పి అల్లరి బెట్టినచో దానే జెడిపోవును. అవమానముల పాలై కష్టములు పొందును.

22, జూన్ 2013, శనివారం

కుమారీ శతకం - 24

24.  కడుపారఁ గూడుఁ గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁ బాసి చరింపఁ గూడ దెపుడు కుమారీ!
భావం:-
ఓ కుమారీ! మగని వద్ద దన కోరికలు దీరవని,అతని వద్ద పంచభక్ష్య పరమాన్నములతో కడుపు నిండదని,కావలసిన రంగురంగుల వస్త్రములు లభింపవని, గూడుదొరకదని అనుకొని తొందరపడి యాతనిని వదలివేసి జీవించుట మగువకు మర్యాద కాదు. సమాజంలో చిన్న చూపుతో చూడబడుతారు.

21, జూన్ 2013, శుక్రవారం

కుమారీ శతకం - 23

23. తల్లిదండ్రు లన్న దమ్ములు
తులఁ దూగఁగ నిమ్ము పసిడిఁ తోనైనను వా
రలయింట సతత ముండుట
వెలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ!

భావం:-
ఓ కుమారీ!తల్లిదండ్రులుగానీ,అన్నదమ్ములు గాని ఎంతటి భాగ్యవంతులైననూ వారి ఇంట ఎల్లపుడు ఉండుట ఆడువారికి మార్యాద గాదు.