అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
Showing posts with label శ్రీ శ్రీ. Show all posts
Showing posts with label శ్రీ శ్రీ. Show all posts

Friday, June 22, 2012

ఖడ్గసృష్టిసామాన్యుని కామన

సామాన్యుని వాస్తవికత

ఈ రోజున సామాన్యుడు
ఏమీ లేనట్టివాడు
కూడూ గూడూ గుడ్డా
ఏమి లేనట్టివాడు
చదువూ సామూ శాస్త్రం
ఏమీ ఎరుగని వాడు

ఈ రోజున సామాన్యుడు
సగం దేవతాంశ, సగం
రాక్షసాంశ, సగటున ఈ
సామాన్యుడు మానవుడు

అంటే నీవూ నేనూ
ఆమె ఈమె వీడు వాడు
అంతా సామాన్యులమే
సగం వెలుగు సగం నీడ
సగం ఋతం సగం మనృతం
సగం ఆడ సగం ఈడ
సగం పశువు సగం నిసువు
ఈ వెల్తురు ఈ చీకటి

ఈ ఇరులూ ఈ వెలుగూ

వేరు వేరు గదులు కావు
ఒకటి రెండూ కూడా
ఇపుడు నిప్పు ఇపుడె పువ్వు
ఇప్పుడు దూసిన ఖడ్గం
ఇంతట్లో కౌగిలింత
ఒక నేత్రం కళారం
మరో కన్ను కర్పూరం

మూడో కంటి వాడంటూ
లేడంటే నమ్ముతావ్
చూడవోయ్ నీలోకి నీవు
ఒకటి రెండు వెరసి మూడు

నరకం స్వర్గం అన్నవి
ఒక స్థితికే రెండు పేర్లు
ఫోకస్ భేదం అంతే
లోకస్ రెండిటి కొకటే

శ్రీ అనగా లక్ష్మి, సరే
శ్రీ అంటే విషంకూడా
శ్రీశ్రీ సిరి చేదు లేక
సిరీ సిరి, చేదు చేదు

మీ ఇష్టం శ్రీకారం
గుణకారం చేసుకోండి
మీకే అర్ధం తోస్తే
ఆ కీ నే వాడుకోండి

ఒకటే శ్రీ అదే రెండు
అదే చేదు సిరీ అదే
అమరత్వం అసురత్వం
శ్రీశ్రీ ఒక మానవుడు

నేపధ్యంలో:

ఆ దాచిన పళ్ళెంలో
ఏం తెచ్చావ్ సుకవీ
ఆ మూలని సంచీలో
ఏమున్నది కవీకవీ
నీ మూసిన గుండెల్లో
ఏం దాచావ్ సుకవీ

నీ పాడని పాటలలో
రాపాడే దేదికవీ
ఆ కొసలో నీడలలో
ఏ సత్యం సుకవీ

ఏ సత్యం ఏ స్వప్నం
ఏ స్వర్గం సుకవీ
మాకోసం నీ కోసిన
వే కాన్కల పూలు కవీ

సామాన్యుని కామన

సైన్స్ వల్ల ఈ రోజున
సామాన్యుని బ్రతుకుకూడ
సౌందర్యమయం కాగల
సదుపాయం లభించింది

జన్మం చర్మం వెనకటి
సంప్రదాయమూ ఇప్పటి
సంఘస్థితులూ నెరపే
అసమానత పనికిరాదు

ఐశ్వర్యం అందరిదీ
అందుచేత అందులోన
సామాన్యుడు తన వాటా
తనకిమ్మని కోరుతాడు

బతకడమే సమస్యగా
పరిణమింప జేసినట్టి
అన్యాయాలన్నీటినీ
హతమార్చాలంటాడు

ఇదేం పెద్ద గగనమా? మ
రిదేం గొప్ప కోరికా? ఇ
కేం? ఇదొక్క విప్లవమా?
ప్రశ్నిస్తే పాపమా?

యుగసంధిది, సామాన్యుని
శకం దీన్ని కాదనరా
దిది రేపొచ్చే వ్యవస్థ
కివాళనించీ, పునాది
ఇప్పటినించీ నాంది

అంతే, ఇంతే స్వప్నం:
అన్నీ ఒక్కడికి బదులు
అంత మందికీ అన్నీ:
అదే స్వర్గమంటాను

ఆ స్వర్గం వేరే కడు
దూరంలో లేదు లేదు
ఈడే నేడే వున్నది
నీలో నాలో వున్నది

మీ ఇష్టం ఈ ధాత్రిని
చేయవచ్చు స్వర్గంగా
చీల్చవచ్చు నరకంగా
ఏంచేస్తారో మరి ఇక మీ ఇష్టం

నగరంలో వృషభం

నగరంలో నడి వీధిలో
వృషభం తీరుబాటుగా
గత జన్మ సంస్కృతులు కాబోలు
కనులరమోడ్చి నెమరేస్తూ
కదలకుండా మెదలకుండా
నగరం హృదయంలో వృషభం
దారికి హక్కుదారు తానే ఐనట్టు
పరిత్యజించి కాలానికి బాధ్యత
పరిహసించి నాగరికత పరుగు
నిలబడింది నేనే రాజునని

ఎవరు పొమ్మనగల రీ ఎద్దుని
ఎలా చూస్తుందో చూడు
ఏయ్ ఏయ్ మోటారుకారూ
ఏవిటేవిటి నీ తొందర
భాయ్ భాయ్ సైక్లిస్ట్
భద్రంసుమీ ఎద్దు నిన్ను తప్పుకోదు
యంత్రవిరోధి అహింసావాది శాకాహారి
మద్యనిషేధ ప్రజ్ఞాశాలి
నగరంలో నడివీధిలో
నాగరికత గమనాన్ని నిరోధిస్తూ
ఇలా ఎంతసేపైనా సరే
ఈ ఎద్దు నిలబడగలదు

ఎద్దుకి లేకపోతే బుద్ధి
మనిషికేనా ఉండొద్దా?

హేమంతం

ఎవరా వస్తున్నది చెట్లమీంచి గాలికాదు
మైదానం మీద దూకు సెలయేళ్ళవి కావు కావు
తన మిహికా సామ్రాజ్యం తనిఖీ చేసేటందుకు
అదిగో హేమంతరాజు కోటవెడలి కదలినాడు
అడవిదార్లు మూసుకుపోయాయా లేదా?  హిమాని
కడు శ్రద్ధగ తన పని చేస్తున్నదా లేదా? ఈ
ధరణీతలమంతా ఏ యెగుడుదిగుడు లేకుండా
మంచు కప్పి ఉందా అని మరీమరీ చూస్తాడు.
టేకుచెట్లు, తురాయీలు, ఓకుచెట్లు రంగవల్లి
సవరించాయా లేదా? సెలయేళ్ళూ పెద్ద నదులు
గడ్డకట్టి సమత్వాన్ని సాధించాయా లేదా?
వస్తున్నా డతడు వృక్షవాటికలం దూగులాడి!
మంచుమీద అతని పదధ్వనులు మీరు వినలేదా?
అతని తెల్లని గడ్డం అదిగో కనబడలేదా?

     (మూలం: నికొలాయ్ నెక్రసోవ్)

Thursday, June 21, 2012

శ్రీశ్రీ అధివాస్తవికుల ప్రవేశంఅధివాస్తవికుల ప్రవేశం

కాసరమా వికారములు కార్చకు పూసరమా మసారపున్
రాసులలో కపాలములు రాల్చకు తావళమా విషాదపున్
వేసములో కుశాసనము పేర్చకు రాసభమా సమాధిలో
మీసము పెంచి మా తొడల మీద నటించకు పుణ్యమయ్యెడున్.

నిచ్చెన పచ్చి నెత్తురులు నింపి నిలింపుల దుంపత్రెంపి కా
ర్చిచ్చులు త్రచ్చుకొన్నది శచీపతి పీచుమిఠాయి వేటలో
పచ్చిక మచ్చికైనది క్షపాకర భీకర సూకరాకృతుల్
పిచ్చిదనాలుపోయిరి కబీరును త్రాగిన రోషనారులై.

ప్రాతది సూదికన్ను పొరపాటున తా తెరచాటు చేసి ఘో
షా తిలకించబోయి వెదజల్లును గుమ్మడి పూదుమారముల్
లేతది రావికొమ్మ పడలేదు భయానక దందశూక ని
ర్ఘాత పతాక దాని కొరకై యిరుకైనవి సందులెందుకో.

గంధముగా మెడన్ పులుమగా తలపోయదు వంధకారపున్
బంధకి యూర్చు జాలి (బల?)బాలను గాలము వేసి లాగుచున్
సింధువు పిల్చెనా పరిహసించెడు సైగల? సుప్తశోణ పా
ణింధమ ఖడ్గధార హవణించకుమీ తిలకాష్ఠ వహ్నిలోన్

మ్రింగి తిమింగలాంగల తమిస్రగుహాంతర మీనమేష పా
రంగతులైన బొంగరములార యెరింగిన తెల్పుడా పరి
ష్వంగము పాడుటెందుకు?  విపంచికి కంచికి దూరమెంత? వ
డ్రంగుల రంగులా గులకరాళ్ళు(ను?) మా గుడిలోని లింగముల్?

ఉద్యమ నాయకా చదువుకో వినిపించని కంచుకాగడా
వాద్యములన్ నిశానిశిత వల్లరి అల్లరి యల్లికన్ సము
త్పాద్య సుధావృధావ్యధలు భాషకులొంగని భావశాకలో
చోద్యమ లూహలో మలుపు చూడ్కులు నీతలమున్క కాన్కలై

కైకొని కాకికన్ను కలకాలపు చూపులు రెక్క రిక్కపై
పైకొని మేకుతాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై
డాకయికై కడాని పగడాల గుడారములో విడాకులై
రోకలి రోదనాకులత రోదసినిండిన రోగభోగమై

మౌనము శంఖమై చెరగుమాయగ నేత్రపతంగ బింబ ని
ధ్వానము కొంగనెత్తురులు త్రాగెడు నల్లతురాయి పూవుగా
వేనలిపై అవే అయిదువేల కుళీర కుఠార దారుణ
ప్రాణ శిలీంధ్రముల్ తిరుగుబాటు తుపాకి తుపాను కానుపుల్

వచ్చెడువాడు ఫల్గుణుడు వార్ధితరంగ మృదంగ ఘోషలో
విచ్చెడు మచ్చునుందు పలవించెడు కించి దుషస్తుషారముల్
పచ్చిక మచ్చికైనది ప్రపంచపు నెత్తురు మంటపాటలన్
మెచ్చనివాడ నీ మెడల మీద నివే ఉదయాద్రి రౌద్రముల్.

     --   శ్రీశ్రీ

Wednesday, June 20, 2012

శ్రీ శ్రీ మరికొన్నీ కవితలు


వెంపటి సత్యం
వెంపటం
అదో ఊరు కావచ్చు
ఇంటిపేరు కావచ్చు
ఐనా అదో కార్చిచ్చు
ఆపక్కనే సత్యం
అదో మనిషి పేరు కావచ్చు
అందుకే అదో వర్చస్సు
వెంపటం
కాదు సంచులు నింపటం
సొంతాస్తులు పెంచటం
వెంపటం
ఔను అన్యాయాన్ని గుండుపేల్చి చంపటం
అధర్మాన్ని గద్దెమీంచి దించడం.

    (శ్రీ శ్రీ, 1/2/73)
కూలీ ల గురించి

ఓరోరి కూలీ
ఔరా హమాలీ
పల్లెటూరు వదిలావు
పట్నానికి కదిలావు
పస్తుల్లో నలిగావు
రెండుకాళ్ళ పసువులాగ
యెండల్లో తిరిగావు
కానీలే ఇంతే నా
కరమమనీ పనికిరాని
జలమమనీ యెందుకిలా
కళ్ళుతేల వేస్తావు
కాళ్ళు జారవేస్తావు
బతికుండే చస్తావు
ఇప్లవ మేమంటున్నదో
ఇప్పుడైన తెలుసుకో
మనిసిలాగ మసలుకో
పీడించే కామందు
ఆడే ఒక రాబందు - అలాంటోడికి
సుత్తిపోటే
మత్తుదించే ఒక మందు - అప్పుడే
ఆడి మాయ సాగదు ఇకముందు

    (శ్రీ శ్రీ, 1974)విద్యార్థుల గురించి

ఓహో ఓ విద్యార్ధీ
ఓహోహో ఓ మేధావీ
పొట్టకూడు మీకియ్యక
చట్టుబండలాయె చదువు
మేటవేసిపోయె మెదడు
భ్రష్టుపట్టిపోయె బ్రదుకు
మెదడైనా ఒడలైనా
శ్రమచేస్తేనే సంపద
కలవారల కొమ్ముకాసి
పడుచుకునే వృత్తిరోసి
కర్షక కార్మిక జన సం
ఘాతంతో కలియండి
బూర్జువాల రాజ్యాంగపు
బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు ని
ర్మాతలుగా నిలవండి - ఆదిక్కుగా
మీకు దారిచూపించే
మేటితరం విరిసింది - అలాంటివాళ్ళలో
కొందరు మరణించారు
ఎందరో బతికున్నారు
అందరిదీ ఒక లక్ష్యం
ఒక గమ్యం ఒక ధేయం
అదే మనకుపాధేయం
విప్లవం వెలిగించరా!

    (శ్రీ శ్రీ, 1974)
చండ్ర పుల్లారెడ్డి
తరింఎల నాగిరెడ్డి
వేసిన పొలికేక
సత్యమూర్తి పెను ఢాక
చారుమజుందార్ పవర్
మనవేనోయ్ డియర్ బ్రదర్
కొల్లిపరా, పంచాదీ
అల్లిపురం, సిమ్మాద్రీ
చాగంటీ, కైలాసం
ఈళ్ళంతా ఈరాది
ఈరులురా సోదరా
ఈళ్ళదారి నీదిరా
ఇమక బయం నేదురా
యెర్రెర్రని రగతాల
యేరుల్లో ఈదరా
సోదరా సహోదరా
జనభారత వృకోదరా
పతితుడివో భ్రష్టుడివో
బాధాస్పర దష్టుడివో
దగాపడిన తమ్ముడివో
శ్రీశ్రీప్రియ శిష్యుడివో
చూస్తావేం నీ నిప్పులు
దాస్తావేం నీవిప్పుడు
చెయ్యి మరోప్రస్థానం
తియ్యి బృహత్ ప్రాగ్ద్వారం
విప్పు మరో అధ్యాయం
తిప్పు మహత్ కౌక్షేయం

    (శ్రీ శ్రీ, 1974)ఎవరిది అహింస

తలకాయలు దొర్లా
లన్నాడు బిర్లా
ఔను సత్యం తలకాయ దొర్లింది
భాస్కరుడి తలకాయ దొర్లింది - ఇదే హింస

బోర్లా
పడుకున్న సంపాదకా విను
నక్సలైట్లు భేధిస్తున్నారు గాంధీ
విగ్రహాల శిరస్సులను - అదే అహింస
సత్యానికి చావు లేదు
భాస్కరుడు బతికే వుంటాడు

ఈ లోగా
పురాణాలు పుక్కిలించిన
కిరాణా కవులంతా
నక్సలైట్ నరకాసురుణ్ణెదిరించి
సినీమాతార సత్యభామ
ధనస్వామ్య దామోదరుణ్ణి రక్షిస్తుందని
అమాయకంగా నమ్ముతారు.

    (శ్రీ శ్రీ, 1971)
అంతం కాదిది ఆరంభం

భూమికోసం, భుక్తి కోసం
సాగే రైతుల పోరాటం
అనంత జీవిత సంగ్రామం


రాజులు మారీ
రోజులు మారీ
పాలన చేసే పధ్ధతిమారి-
మారనిదొకటేరా-అది
దున్నేరైతుల బతుకేరా-

సంపద పెంచే తీరులుమారి
పంపకాలలో రీతులుమారి-
మారనిదొకటేరా - అది
పేదల ఆకలి మంటేరా

తూరుపుదిక్కున వీచేగాలి
పడమటి కడలిని పిలిచేగాలి
తూరుపు పడమర లేకంచేసే
తుఫానులా చెలరేగేదాకా

భూమికోసం
భుక్తికోసం
సాగే రైతుల పోరాటం
అంతం కాదిది
ఆరంభం...........

    (శ్రీ శ్రీ, 1973)యుద్ధ రంగం

కుళ్ళిపోయిన ప్రపంచంతో విసుగెత్తిపోయింది నీకు
కుతుబ్ మినార్ ఈ ఉదయం గోల చేస్తూ అరవబోకు
నీ వంతెనల గొంతుకలతో నీ గొర్రెల మందలతో
వేదాల పురాణాలనాటి వెర్రి కలల వందలతో

ప్రాచీన రధాల బార్లు
ఇచ్చటి మోటారు కార్లు
ఇక్కడ మతం ఒక్కటే నవీనం తత్తిమా సమస్తం దగా
మతం ఒక్కటే ౠతం, శాశ్వతం, విశాలమైన విమా
నాశ్రయంలా అమాయకం

భారతదేశంలో బుద్ధుడొకడే బతికున్నాడింకా
ఈనాటి అతి నవీన కవి ఒక్క శ్రీ శంకరా
చార్యుడే, కంచి కామాక్షి గోపుర ద్వారాలు
తెరుచుకున్నాయి పీల్చివెయ్యాలని నీ పాపాలు
నువ్వు మాత్రం ఒప్పుకోవు నీ దోషాలు
నువ్వు మాత్రం చదువుతావు గోడమీద సమాసాలు
జీవితభీమా కరపత్రాలు షేరు మార్కెట్ తమాషాలుTuesday, June 19, 2012

శ్రీశ్రీ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ
పొలాలనన్నీ
హలాలదున్నీ
ఇలాతలం_లో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మ జలానికి,
ఘర్మ జలానికి,
ధర్మ జలానికి,
ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్!

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే,
యంత్ర భూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే,
గల గల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్!

నిరపరాధులై దురదృష్టం_చే
చెరసాలల్లో చిక్కేవాళ్ళూ
లోహ రాక్షసుల పదఘట్టనచే
కొనప్రాణంతో కనలేవాళ్ళూ
కష్టం చాలక కడుపు మంటలే
తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ
శ్రమ నిష్ఫలమై,
జని నిష్ఠురమై,
నూతిని గోతిని వెదకేవాళ్ళూ
అనేకులింకా అభాగ్యులంతా,
అనాథులంతా,
అశాంతులంతా
దీర్ఘశృతిలో, తీవ్రధ్వనితో
విప్లవశంఖం వినిపిస్తారోయ్!

కావున లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ,
పాటలు వ్రాస్తూ,
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి,
శ్రామిక లోకపు సౌభాగ్యానికి,
సమర్పణంగా
సమర్చనంగా
త్రిలోకాలలో
త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్టజీవులకు,
కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సం_రావిస్తూ
వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్!

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం,
సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింప జేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం!
భాగ్యం!
ప్రానం!
ప్రణవం.


Sunday, June 17, 2012

శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వలుశ్రీ శ్రీ - సిరిసిరిమువ్వలు

అందంగా, మధురస ని 
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా 
కందాలొక వంద రచిం 
చిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా 

పెదబాలశిక్ష చదివీ 
చదవడమే తడవుగాగ సాహిత్య విశా 
రదులయినట్లుగ భావిం
చెదరు గదా కొంతమంది ................ 

బండెడు చెత్తను ఛంద 
శ్చండముగా పోగుచేసి స్వారస్యము చూ 
డండని కోతలు కోస్తే
చెండాడెద నట్టి వారి ............... 

పూర్వుల వలె వ్రాస్తేనే
సర్వత్రా మంచిదనుచు స్వాతంత్ర్య శిఖిన్
ఖర్వమొనరింప గుండెయొ
చెర్వో నే చెప్పలేను .................... 

శుష్కచ్చాందస కవిజన
ముష్కరులకు సొంటిపిక్క, మూర్థమ్మున కా
యుష్కర్మము, తదుపరి శో
చిష్కేశున కప్పగింత ................. 

గొర్రెల మందగ వేలం 
వెర్రిగ ఉద్రిక్త భావ వివశులయి జనుల్ 
కిర్రెక్కి పోయినప్పుడు 
చిర్రెత్తుకు వచ్చు నాకు ................. 

హిప్పోపొటామసొక్క బి
షప్పునుగని యడిగె నిట్టు, "స్వామీ! మీరె 
ల్లప్పుడు చెప్పిందాన్నే 
చెప్పడమెంచేత?" ననుచు ................ 

భాషకొక స్థాయి నిచ్చే 
ప్రాసలు యతు లలంకృతులు వ్యాకృతులయ్యో 
పై సొగసు పూతకైతే 
చేసేదేమున్నదింక ...................... 

విప్రుల వాక్యం ముందట
అప్రాచ్యుల ధిక్కరింపు లాగవనుచు వే
దప్రామణ్యము గా రా 
యప్రోలు వచించు మాట సార్ధకమ జరూ! 

వెళ్ళిరి దొరలనుకుంటే 
కోళ్ళుతినే వళ్ళ బదులు గొర్రెల్నితినే 
వాళ్ళోచ్చినట్లు కాంగ్రెస్ 
కుళ్ళాయిల వాళ్ళ వల్ల ఘోరాలు జరూ!  

Tuesday, May 22, 2012

శ్రీశ్రీ కవితలు

శ్రీశ్రీ కవితలు శ్రీశ్రీ కవితలు

Wednesday, May 2, 2012

మహాప్రస్థానం - శ్రీ శ్రీ                                         మహాప్రస్థానం
                                                           -   శ్రీ శ్రీ

Mahaprasthanam in Telugu
1

ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.చెలం చూశాడు. మాట్లాడాడు. కాని శ్రీ శ్రీని ఎరగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి-

"ఇదేమిటి. ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీ శ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా వూడ్చుకు పోతోవుంటే!

హృదయాలమీది పెంకులు పగిలి పోతున్నాయి. బైట వినబడుతున్నాయి. యిట్లా రండి, రోడ్డు మీదికి," అన్నాడు.అంతవరకు శ్రీ శ్రీ కవిత్వాన్ని ఎరక్క పోవడం చెలంలో క్షమించతగిన విషయం కాదు. కాని చెలవాటికి క్షమించాలి చెలాన్ని.కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చెలానికి impatience, అనుమానం. శబ్ద సౌందర్యంలో తృప్తిపడి సంతోషించవలసిందే కాని, చెప్పే దానికి అర్థం వెదకటం అవివేకం అని. కాని నీరసపు కళాచతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించీ, విచారించీ, తప్పుకోవడం చెలానికి చాతకాదు. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కి. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు. కవులూ చెయ్యరు -ఎంకీ, శ్రీ శ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవ లనిపిస్తుంది.ఎందుకంటే-కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీ శ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ.

2

శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగ వేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపచేస్తారు. బుద్ధి వున్న వాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి. కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటో అగచాట్లు పడి కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల వెనక అణగి చచ్చి, కొనవూపిరితో ఆరిపోలేక మిణుకు మిణుకు మంటో వుంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త అర్థంలేని న్యూసెన్సుగా తోస్తాయి శ్రీ శ్రీ పద్యాలు. సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి ఈ వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!అదీ సాధారణంగా కల్చెర్డు రీడర్సు సంగతి.కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని వెయ్యికన్నులతో కనిపెడుతూ వుంటారు. కనపడ్డదా, ఆనాటినుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించీ, కవిని గురించీ, ప్రచారం మొదలు. సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆకొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తీ, కాల పరిస్థితులను బట్టి చప్పరించడమూ- తమ కావ్యాలనించో, ఇతర కావ్యాలనించో, సంగ్రహించబడిన దనడమూ -విప్లవ కారణ మనడమూ, నిర్జీవమనడమూ -కవిని గురించి చాలా righteous indignation తోనో, జాలిపడుతోనో, చాలా సానుభూతి దయా వున్నట్లు ప్రస్తావించడమూ వీళ టెక్నిక్."శ్రీ శ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని కవిని అడిగారా, అతను "దానికేం చాలా బావుంటుంది. ఓ బాగా వ్రాస్తాడు. నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-" అన్నాడా, అతను చాలా సన్నిహిత ప్రియమిత్రు డన్నమాట కవికి. చిరునవ్వుతో శ్రీ శ్రీ విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి పోతున్నాడు జాగ్రత్త!శ్రీ శ్రీ కవిత్వానికి Motive springs చూపుతాడు ఆ మిత్రుడు. తప్పదు."ఆకలి పాట ---కటిక దరిద్రుడు అతను -తిండిలేక వీథులు తిరిగాడు--- పాపం" అంటో ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని explain చేస్తాడు.నిజమా? నిజమైతే శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు."ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్య ఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీదపడి బతుకుతున్న యీ Parasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.ప్రపంచంలో ఈనాడు ప్రతిదేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మ యుద్ధం చేసే ధీరులు ఈ నాడూ పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే, అనాదిగా తనకోసం ప్రయత్నించే dreamers మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన rotten channels ఈ నాటి సారస్వత సభాపతులు.తాము బతికివున్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికివున్న శవాలు ఈ నాటికీ తాము ముప్ఫైయేళ్ళక్రింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు మీద కాఫీ యిడ్డెన్ల ముందు Inspire ఐ ప్రగల్భాలు పలికే ఈ రసికులు, తాము తెచ్చిన సంస్కారమే యింక సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి, ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చెయ్యడానికి మీదికి ఉరికే భగీరథ ప్రవాహాల్ని ఊరి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు.మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి "శ్రీ శ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్త తనాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే, ఇంకా యీ సర్రియలిజం తెస్తే అసలు గాభరా పడి చదవడమే మానేస్తారేమో!" అన్నాడు చెలం. Man of little faith.శ్రీ శ్రీ ఏం జవాబు చెపితేనేం! మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవైయేళ్ళ తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొనివున్న చెలం మానవత్వం మీద శ్రీ శ్రీ కి వున్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవొంచాడు.శ్రీ శ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా!శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా -ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం. Pass it on.పదేళ్ళు ఆగండి. ఈలోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా influence చేసినవి వుంటే -మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీ శ్రీ పద్యాల్ని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో.

స్వయంగా చదవండి. చదివిం తరువాత శ్రీ శ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి. ఎవరి అభిప్రాయమూ అడగకండి. ముఖ్యం, కవి అనేవాణ్ణి -చెప్పినా వినకండి.

3

కవిత్వపు కాలం అంతమయింది. నగలూ, అపురూపపు కళలూ, సూర్య కిరణాల్ని ఎరగని అందాలూ గతిస్తున్నట్టే కవిత్వమూ గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. "ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?" అని దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీ శ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వొస్తుంది.చెప్పుకో తగిన ఒక్క కవీ, మన కృష్ణ శాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన, తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు లేపి ఆకాశ మార్గాన విహరింప జేసి, రక్షించాడు శ్రీశ్రీ.ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.కృష్ణశాస్త్రి పద్యాలు చదివి, అర్థం విడదీసి, "ఏది గొప్పతనం చూప" మంటే చూపలేక పోయినాను పూర్వం. శ్రీ శ్రీ అగ్గిపుల్లలోనూ, కుక్కపిల్లలోనూ, కవిత్వం చూపలేను ఈనాడూ.అగ్గిపుల్లవంక -ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను.కుక్కపిల్లని -ముఖ్యం తల్లిచచ్చిన దిక్కులేని గజ్జికుక్కపిల్లని పెంచమంటాను.మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, "ఈ పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా ఈ పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను."ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"

"సంధ్య కేసి"

"ఎవరు ఆమె?"

అంటే ఏం మాట్లాడగలిగాను?పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక మళ్ళేఏ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీ శ్రీ."ధ్వంసం చేసి రోడ్డు వేశాడు-""పదండి ముందుకు

పదండి తోసుకు-" అంటున్నాడుతాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారో, ఆ నిరంకుశాధికారుల నెత్తిమీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీదచూపే అభిమానం చాలదు శ్రీ శ్రీ కి. తామూ యింకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని.శ్రీ శ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సులోంచి పాత మూలుగులూ, serenadings, మూర్చలూ, వేదాంతాలూ, మత్తులూ పోయి- దేశాలకి, ఉత్సాహాలకి, కదిలిపోయే యువక సైన్యాలకి, నూతన యుగ నిర్మాతలకి background music కింద marching band కింద, కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినపడ్డంలేదా, శ్రీ శ్రీ గీతాల్లో: వినపడకపోతే-"ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన

సోమరులారా చావండి!"

ప్రపంచం ఎట్లాపోతేనేం? మీకెందుకు లెండి.

"అదృష్టవంతులు మీరు ---

వడ్డించిన విస్తరి మీ జీవితం"ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు, యుద్ధాలనించి, ముష్టివాళ్ళనించి, విప్లవాల నించి, అనాథల నించి, అశాంతినించి, సత్యాన్నించి, మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు.వీళ్ళందరి అధ్యక్షుడూ మీదేవుడు. మీ డబ్బుకి దాసుడు. మీ నంగిపూజలకీ స్వార్థ ప్రార్థనలకీ వశ్యుడు. దొంగభక్త పరాధీనుడు.ఇన్ని బాంబులు కురుస్తున్నా, ఇన్ని మర ఫిరంగులు మోగుతున్నా, ఇన్ని చెరసాలలు నిండుతున్నా, ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు -పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని! ఇంక లాభం లేదని మీ ఆటలు సాగవని!ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచం నిర్మాణ కర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీ శ్రీ.ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, scandals లేవో ఆలోకాన్ని dream చేస్తున్నాడు యీ కవి.మీ ఆనందంకన్న ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు, నరకమంటే అట్లాంటి లోకం.శ్రీ శ్రీ ఎందుకు నచ్చుతాడు?ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీ శ్రీ!దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్థంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, ఇవన్నీ అర్థంకాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాల్ని ఏకంచేసి పలుకుతున్నాడు శ్రీ శ్రీ.మీ కెందుకు లెండి. పట్టు దిళ్ళలో తలలు దూర్చి, భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతో- "All is well with the world" అనుకుంటో నిద్రపొండి.నిర్భాగ్యులం కొందరం మాకు---

"అన్నీ సమస్యలే, సందేహాలే."

"ఏవో,

ఏవేవో, ఏవేవో

ఘోషలు వినబడుతున్నాయ్!గుండెలు విడిపోతున్నాయ్!"మీకు కవిత్వం కావాలా?అరుగో ఆ మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి"కి నైవేద్యంగా.వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి."రాబందుల రెక్కల చప్పుడు

పయోధర ప్రచండ ఘోషం

ఝంఝానిల షడ్జధ్వానం"

విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి.
     

బెజవాడ
17-7-40
   

చెలం

మహాప్రస్థానం కవితలు

జగన్నాథుని రథచక్రాలు

పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడులేని,
గూడులేని
పక్షులార! భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు-
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి.
మీ రక్తం కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి,
ఓ వ్యథానివిష్టులార!
ఓ కథావశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!వస్తున్నాయొస్తున్నాయి....
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్!
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!


పతితులార!
భ్రష్టులార!
మెయిల్దారిని
బయల్దేరిన
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!


సింహాచలం కదిలింది,
హిమాచలం కరిగింది,
వింధ్యాచలం పగిలింది-
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం....
మహానగా లెగురుతున్నాయి!
మహారథం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ-
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం పటునిరాశ-
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును....
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీగాథలు
అవగాహన నాకవుతాయి!
పతితులార!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీకోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట,
అడావుడిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్ర ప్రళయ ఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!
అరె ఝాఁ! ఝాఁ!
ఝటక్, ఫటక్ ….
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంస నచణ
హింస రచన!
విషవాయువు, మరఫిరంగి
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది!సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది!
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!
మీ రాజ్యం మీరేలండి!

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...