Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2016, శుక్రవారం

37

 రామాయణం -37 వ భాగం  అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి " నేను ఇందాకటినుంచి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని అయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దెగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని, ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులోనుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమి ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నార. వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి. వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మము అంటావేంటి. అసలు ఇవన్నీ ఎందుకోచ్చాయో నేను చెప్పనా రామ, ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దెగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు, అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే, వాడి ఆకలి తీరదు కాని, చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా, ఎవడు చెప్పాడు ఇవన్నీ. హాయిగా ఉన్న దానిని అనుభవించు " అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో " జాబాలి! నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే, అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్ని సత్యాలు కావు, మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహా పురుషులు, 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్థలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే, సూక్ష్మ శరీరంతో మూడు తరాల వరకు పితృ లోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని( దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు, నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు), ప్రవర్తన తెలియనివాడిని, సత్యం ఎవ ఈష్వరొ లొకె సత్యం పద్మా సమాష్రితా | సత్య మూలాని సర్వాణి సత్యాన్ న అస్తి పరం పదం || ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో, అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీవంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్య దశరథ మహారాజు. నాకు ఇవ్వాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది " అన్నాడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజ ఒణికిపోతూ " నేను వేదాన్ని తిరస్కరించినవాడిని, నమ్మని వాడిని కాదు రామ, భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను " అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి, బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి " ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు, తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో, తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్ళి ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యమునుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు, అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో " అన్నాడు. అప్పుడు రాముడు " మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామ! నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు, నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని, నేను ఇచ్చిన వరం ఎందుకూ పనికిరాకుండా పోయందని నా తండ్రిగారు బాధ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనే వాడు బయటకి వచ్చేది, ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనే వాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు, అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించాలేను " అన్నాడు. అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి " దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి, నేను ముఖం మీద బట్ట వేసుకొని, ఏది చూడకుండా, రాముడికి ఎదురుగా కూర్చుంటాను " అన్నాడు (పూర్వకాలంలో రాజు తప్పుచేస్తే, ధర్మం తప్పితే, బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియచెయ్యడం కోసమని). అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు, వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు. " నువ్వు నన్ను ఇలా నిర్బందించచ్చా భరతా, నేను ఏ తప్పు చేసానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు. ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి, అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో " అన్నాడు రాముడు. అప్పుడు భరతుడు లేచి, ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి " రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను, లేకపోతే నా బదులు రాముడు రాజ్య పాలనం చేస్తాడు, నేను అరణ్యాలలో ఉంటాను " అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు నవ్వి " భరతా! అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్య పాలన చేస్తాను. అప్పటివరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు " అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దెగ్గరికి వచ్చి, రాముడు చెప్పిన్నట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు. " చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు కాని, నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను " అని రాముడన్నాడు. ఈ సమయంలో వశిష్ఠుడు లేచి " అయితే రామ, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు " అని చెప్పి, తాను తీసోకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి " భరతా! ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి " అన్నాడు.(వశిష్ఠుడు త్రికాలవేది, ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు). భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి, వాటిని రాముడి పాదాల దెగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీద ఎక్కి దిగాడు. తతహ్ షిరసి కృ్ఇత్వా తు పాదుకె భరతహ్ తదా | ఆరురొహ రథం హృ్ఇష్టహ్ షత్రుఘ్నెన సమన్వితహ్ || అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి, తాను ఏ పని చేసినా, ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు. తరువాత రాముడి దెగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి " ఇక్కడ దెగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి, నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు, అందుకని మేము ఇక్కడ ఉండకుండా, దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా " అని అడిగారు. ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు, ఇక్కడే ఉంటె నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం సౌచాన్ని కోల్పోయింది, అని రాముడు తన మనస్సులో అనుకొని, సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి " నా భార్య పేరు అనసూయ( కర్దమ ప్రజాపతి - దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది, దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది, ప్రజలందరికి అన్నం పెట్టింది, ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది, కనుక ఆమె దెగ్గరికి ఒకసారి పంపించు " అని అన్నాడు. తన దెగ్గరికి వచ్చిన సీతమ్మని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అనింది " సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు " అని అడిగింది. అప్పుడు సీతమ్మ " నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ " అనింది. సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ " సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు, ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు " అనింది. అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దెగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి " సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు " అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు. తరువాత అనసూయ సీతమ్మని తన దెగ్గర కూర్చోపెట్టుకొని " నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది, నాకు నీ కళ్యాణం గురించి చెప్పు" అనింది. అప్పుడు సీతమ్మ " జనక మహారాజు భూమిని దున్నుతుంటే, నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీతా అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక, శివ ధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివ ధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి, నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి, నీళ్ళు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివ ధనుస్సుని విరిచాను, నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే, మీరు కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో, నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్థాంగిని అయ్యాను " అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది. తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటువెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడుగగా, ఆయన " ఇక్కడ రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలోవెళ్ళండి " అని, ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దెగ్గర, అనసూయ దెగ్గర ఆశీర్వాదం తీసుకొని, సీతారామలక్ష్మణులు ఆ దారిలొ తమ ప్రయాణాన్ని సాగించారు. మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో, అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు. 

36

 రామాయణం -36 వ భాగం  భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రముల పద ఘట్టనలని విన్న రాముడు " ఇంతకముందు ఎన్నడూ ఇలా లేదు, ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులుతీస్తున్నాయి. ఎవరో ఒక రాజో, లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది " అని లక్ష్మణుడిని పిలిచి, ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దెగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమి కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి, కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో.... అగ్నిం సమ్షమయతు ఆర్యహ్ సీతా చ భజతాం గుహాం | సజ్యం కురుష్వ చాపం చ షరామ్హ్ చ కవచం తథా || " అన్నయ్యా! వెంటనే మన దెగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటిని తగ్గించేసెయ్యి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూణీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే, నీకు రాజ్యం దక్కకుండా చేసి, అరణ్యాలకి పంపించడమే కాకుండా, శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయ తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక, వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే, చూసి నేను సంతోషిస్తాను " అన్నాడు. లక్ష్మణుడి మాటలను విన్న రాముడు " లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాల? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా? ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ | ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె || ధర్మము కాని, అర్థము కాని, కామము(కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటె, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడ? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము " అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి " నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని " అని రాముడు అన్నాడు. ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు " అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు " అన్నాడు. అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి " నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో పీడని సంకిస్తుంది " అన్నాడు. ఇంతలో భరతుడు " ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు " అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తం తు కృ్ఇష్ణ అజిన ధరం చీర వల్కల వాససం | దదర్ష రామం ఆసీనం అభితహ్ పావక ఉపమం || సిమ్హ స్కంధం మహా బాహుం పుణ్డరీక నిభ ఈక్షణం | పృ్ఇథివ్యాహ్ సగర అంతాయా భర్తారం ధర్మ చారిణం || గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్ధత కలిగినవాడైన రాముడు, ఈనాడు నార చీర కట్టుకొని, ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని, వీరాసనం వేసుకొని కూర్చునేసరికి, చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని, పరిగెత్తుకుంటూ వస్తూ, "రామా" అని ఒకసారి పిలిచి, శోకభారంతో నేల మీద పడిపోయాడు. అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి " ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా " అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి " నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా. పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దెగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దెగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా. మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటె రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటె, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దెగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా " అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు. రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ | కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి || రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు. ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు. సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ | భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం || సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ | అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా || వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు " అన్నాడు. (రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.) అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు ( తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి). అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు " అన్నాడు. " మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు " అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ( రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది. అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి " అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంతమాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు " అన్నాడు. అప్పుడు రాముడు " ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి " అన్నాడు. అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దెగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు " అన్నాడు. రామభరతుల మధ్య జెరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. ఈ మాటలు విన్న రాముడు " దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటె నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. త్వం రాజా భవ భరత స్వయం నరాణాం | వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం || నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో " అన్నాడు. 

35

 రామాయణం -35 వ భాగం  అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి " భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముంది నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడె ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దెగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటె, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటె, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను " అన్నాడు. అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దెగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో " భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి " అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి | సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి || లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి "నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి " అని అడిగాడు. అప్పుడు భరతుడు " నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దెగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను " అన్నాడు. " సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది " అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో " ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక " అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు " ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దెగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు " అని అన్నాడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు " రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ' నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దెగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ' అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటె, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు " అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దెగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా | తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః || అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు. తరువాత భరతుడు " ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను " అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలేదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దెగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు, అలా బ్రహ్మగారిచె ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు). ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. ( భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు) అప్పుడు భారద్వాజుడు " మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది " అని అన్నాడు. హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె | మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి || ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ " మహానుభావ! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావ అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి " అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భారద్వాజుడు " నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక " అని ఆశీర్వదించిన పిమ్మట " నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు " అన్నాడు. అప్పుడు భరతుడు " మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమి వద్దు అన్నాడు ". మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు. అప్పుడు భారద్వాజుడు " అంత దూరంగా ఎందుకు పెట్టావయ్య, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను " అన్నాడు. ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ | ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం || ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్ | తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ || ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం | భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు || తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ | భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ || అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి " ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక." ( రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు) విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు . తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి " కుబేరా! నీ దెగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవ!, నీ దెగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి . వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు( powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం( ఉసిరికాయలతో చేసిన ముద్ద ), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి. అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి " అని ప్రార్ధించాడు. అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు. అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటె బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు . అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికిలు " మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము " అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దెగ్గరికి పిలిచి " వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావ " అన్నాడు. అప్పుడు భరతుడు " సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య. వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి " అని అన్నాడు. న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా | రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి || దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం | హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ || అప్పుడు భారద్వాజుడు " ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జెరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు " అన్నాడు. భారద్వాజుడి మాటలు విన్న భరతుడు " సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి" అన్నాడు. " అయితే నువ్వు ఇలా దక్షినాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గురాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు " అని భారద్వాజ మహర్షి చెప్పారు. అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దెగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ " సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది " అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు. 

34

 రామాయణం -34 వ భాగం  అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా, భరతుడు ఇలా చెప్పాడు " నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుంచి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు, తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలొ చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలొ ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది, దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జెరిగిందని నాకు అనిపిస్తుంది " అని అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు..... ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ | అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః || " సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా. ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ | అరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచ హ || మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది, అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదుకదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా " అని అడిగాడు. అప్పుడా దూతలు " నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని " చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు( ఆయన అసలు పేరు ఆశ్వపతి) దెగ్గరికి వెళ్ళి, తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్, ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానలన్నిటిని వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితొ కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక, ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడినుంచి శల్య కర్తన నగరాన్ని, చైత్ర రథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు, కులింగ నదిని దాటాడు, తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడినుంచి భాగీరథీ నదిని దాటాడు, తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు, అక్కడినుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూథి అనే గ్రామాలు దాటాడు, తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు, తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు, అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు, అక్కడినుంచి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు, తరువాత కపివతీ అనే పట్టణానికి చేరుకున్నాడు, అక్కడినుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత స్థాణుమతీ అనే ఊరిని దాటాడు, తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దెగ్గరినుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్ళు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు. అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు, అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని, గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని " చాలా సంతోషంగా గడిపావ, అందరూ ఆనందంగా ఉన్నారా, అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు " అని అనింది. అప్పుడు భరతుడు " అమ్మ! నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని, నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది, నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా! తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా " అని అడిగాడు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః | రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః || " చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో, మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు " అనింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే, ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు. అప్పుడా కైకేయ " ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా, గొప్ప గొప్ప సభలలో కుర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి, పైకి లేచి కూర్చో " అనింది. అప్పుడు భరతుడు " అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా, రాముడికి పట్టభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మ, నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మ. అసలు దశరథ మారాజు ఎలా చనిపోయారు, చిట్టచివర చనిపోయేముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా " అన్నాడు. " మీ నాన్న వెళ్ళిపోయేముందు, 'హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా' అంటూ చనిపోయాడురా, చినిపోతూ చనిపోతూ, ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా " అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటె, మీ నాన్న పంపించేసాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు " నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని, రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడ, పరస్త్రీని దోష బుద్ధితో చూశాడ, పరకాంతని అనుభవించాడ, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడ, అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడ. ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదె, రాముడిని అడవులకు ఎందుకు పంపించారు, రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏమి జెరిగిందో నాకు యధాతధంగా చెప్పు " అన్నాడు. అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ " నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయ, పరకాంతని అనుభవించడం ఏమిటిరా, రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీతండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి, చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది " అనింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి " అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు, నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జెరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి " నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను " అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం " అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలేదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఎడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి " రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు, ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దెగ్గర దిగబెట్టు " అని అనింది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని " అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావ. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహా పాపములు చేసిన వాడినవుదునుగాక " అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే " గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా, ఆ భార్యతో క్రిడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి, రుతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా, అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషం, లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటివాడికి, ఋషుల, పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానం కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దెగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది " అని అన్నాడు. అప్పుడు కౌసల్య " నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడను " అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి " నీ తండ్రి శరీరం తైల ద్రోణిలొ ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు " అన్నారు. అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దెగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దెగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి, రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః | అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ || " నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి " అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు " అసలు ఇంత జెరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు, మూర్ఖురాలై మా అమ్మా కైకేయ రెండు వరాలు అడిగి ఉండవచ్చు, సత్యపాశములచేత బందింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు, కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు " అని వారు మాట్లాడుకుంటుండగా, అటువైపు నుంచి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దెగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కత్తే అని, అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీసారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా, అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్ట చారిణీం | యది మాం ధార్మికో రామః న అసూయేన్ మాతృ ఘాతకం || అప్పుడు భరతుడు " అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి. ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది, కాని ఎందుకు చంపడంలేదో తెలుసా, ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలెయ్యడం పెద్ద లెక్కా. దీన్ని చంపినా, స్త్రీని చంపిన వాళ్ళు అని, రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలెయ్యి " అన్నాడు. భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః | న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరాం || అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు, భరతుడి మాట విని, తన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంత రాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు " నాయనా! నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో, అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము, కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో " అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి " నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు " అని, ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. తరువాత భరతుడు వశిష్ఠుడితో " నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ. నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టానయ్య, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవ్వాళ, ఈ రాజ్యం రాముడిది, నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు " అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు. ఈ మాట విన్నవాళ్ళందరూ సంతోషపడిపోయి " సంతోషం భరతా, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం " అన్నారు. అప్పుడు భరతుడు " నేను నిన్ననే ఆదేశించాను, కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి, రాముడి దర్శనం చేసుకోని, ఆయనని వెనక్కి తీసుకువద్దాము " అన్నాడు. 

33

 రామాయణం -33 వ భాగం  సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు " రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు " అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు...... " లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు " అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా " సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది " అన్నాడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు " ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ " అని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు కౌసల్య " ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దెగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దెగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దెగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దెగ్గర ఉండను " అని అనింది. కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు " నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దెగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను " అని రెండు చేతులతో నమస్కారం చేశాడు. న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా | ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే || కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని " మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దెగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు " అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు " నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి 'హా! కుమారా, హా! కుమారా' అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ 'హా! కుమారా' అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, 'హా! కుమారా' అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా......రామా........." అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీఅంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలొ(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జెరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు. మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః | కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః || ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ | వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం || ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యయనుడు, గౌతముడు, జాబాలిమొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు " మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలొ కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జెరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి. రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం | రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం || రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది " అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు " ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము " అని అన్నడు. తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచిపాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి,నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలముఅనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షముఅనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. 

32

 రామాయణం -32 వ భాగం  అప్పుడు దశరథుడు " కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది " అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు. రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని " సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు " అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది " అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడె ". అప్పుడు సీతమ్మ " మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః | న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా || వీణలొ ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దెగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు " అనింది. తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది " నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం | అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం || లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో " అనింది. రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు ' రామా! రామా! ' అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. " నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు " అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది. అప్పుడు రాముడు " సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు " అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది. మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీతీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు. రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు " ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకొలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా " అన్నాడు. " అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా " అని కౌసల్య అనింది. అప్పుడు దశరథుడు " పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దెగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావ కౌసల్య " అని మళ్ళి మూర్చపోయాడు. అటుపక్క తెలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి " వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడక పోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు " అన్నాడు. అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి " ఏడి రాముడు ఏడి రాముడు " అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు.... ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే | దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ || " ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు " అని వేడుకున్నాడు. తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒకఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా | నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః || రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో( ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన( తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు...... " రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా " అన్నాడు. గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ | అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం | పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ || అప్పుడు రాముడు " గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు " అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా.... కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా | శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా || యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి | తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా || " నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను " అన్నాడు లక్ష్మణుడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, ' నేను ఏమి చెయ్యను ' అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు " నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు " అన్నాడు. అప్పుడు సుమంత్రుడు " రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను " అన్నాడు. " నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి " అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు. తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ | లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః || అప్పుడు రాముడు గుహుడిని పిలిచి " గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా " అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు " నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను " అన్నాడు. తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి " ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు " అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి " లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో " అన్నాడు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు " అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు. న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ | ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ || నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా " అన్నాడు. " లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు " అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకోని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. అప్పుడు రాముడు " మీ ఆశ్రమం మా రాజ్యానికి దెగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటె జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దెగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము " అన్నాడు. భారద్వాజుడు ఇలా అన్నాడు " ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూటపర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చెరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షిఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి " అని అన్నాడు. భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలోవాస్తు హొమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు. 

31

 రామాయణం -31 వ భాగం  రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలికా పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా, నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటె ఇదే కదా, నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చెయ్యవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు. " రాముడు, సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రిగారికి నివేదించండి, నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకోని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను " అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా, దశరథుడు ఇలా అన్నాడు.... " సుమంత్రా, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు, రాముడికంటే ముందు, నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను " అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక, సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణులని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దెగ్గరికి వెళ్ళబోయి, మధ్యలోనే నేల మీద కళ్ళుతిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు..... " తండ్రీ! మీరు కోరినట్టు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది, నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వికి ప్రభువులు, మాకు తండ్రి, అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి " అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముడిని పైకి లేపి " నన్ను కైక వంచించి నిగ్రహించి, ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలులేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో, అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామ " అని అన్నాడు. " మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు, కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకి వెళతాను " అని రాముడన్నాడు. అప్పుడు దశరథుడు " సరే రామ, నువ్వు అలాగే వెళ్ళిపో, కాని ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు, నీకు కావలసిన, కోరుకున్న భోగములన్నిటిని అనుభవించు, నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము " అన్నాడు. అప్పుడు రాముడు " ఇవ్వాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు, కాని 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు, 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు. మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటె దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేనేమి ఆక్రోశంతో వెళ్ళడంలేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి, ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు " అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్తితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కాని కైకేయ మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడినుంచి తొందరగా పంపించెయ్యి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో...... " ఛి, దుష్టురాల! మహా పాపి! పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింప పడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు, అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు, ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది, అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది. నీ తల్లిగురించి మాకు తెలుసు. నీ తండ్రిగారికి సర్వప్రాణుల మనస్సులలోని విషయాలని, వాటి భాషనీ అర్ధం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది, దాని పేరు జ్రుంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల బాష అర్ధం అవుతుంది కనుక, ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు, అసలు ఆ చీమ ఏమందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు, దానిప్రకారం నేను నాకు అర్ధమైన విషయాలని బయటకు చెపితే, నా తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడావిడ, నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి, నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడా కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్నా విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్ధమవుతుంది, ఆమె మళ్ళి పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి అన్నాడు. అంత మంక్కుపట్టు పట్టిన స్త్రీ, నీ తల్లి. అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది " అని అన్నాడు. అప్పుడు దశరథుడు " ఆ కైకేయకి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్రా. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి, 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధన రాశులని పంపండి, పట్టుచీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చెయ్యడానికి డేరాలు పంపండి, ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి, ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను " అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది.... " పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవ్వాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు. రాజ్యం గత జనం సాధో పీత మణ్డాం సురాం ఇవ | నిరాస్వాద్యతమం శూన్యం భరతః న అభిపత్స్యతే || నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు, మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరంలేదు " అని అనింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి " అసమంజసుడు పిల్లలని సరయు నదిలో తోసేసి, వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా, తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలికా? రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము " అని చెప్పాడు. కైకేయ ఏమి మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు " ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా. కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు కాని, రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడుగలేదు, నేను నీకు అలా వరమూ ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి " అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు " నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు. నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను " అన్నాడు. ఈ మాటలు వినగానే, కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో, అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ, పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు " పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం | ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం || ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి. నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు, దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు, కాని రాముని వెనకాల సీతమ్మ పత్నిధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి | పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి || నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడినుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి, కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు, అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది " అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక, కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు, సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూలేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు. అప్పుడు దశరథుడు " కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది " అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు. రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని " సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు " అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది " అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడె ". అప్పుడు సీతమ్మ " మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః | న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా || వీణలొ ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దెగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు " అనింది. తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది " నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం | అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం || లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో " అింది. 

౩౦

 రామాయణం -30 వ భాగం  కౌసల్య దెగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దెగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దెగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దెగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి " ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జెరగలేదు " అని రాముడిని అడిగింది. అప్పుడు రాముడు తలదించుకొని " సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు " అని అన్నాడు అప్పుడు సీతమ్మ " మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి....... ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను. న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః | ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా || తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను " అని సీతమ్మ అనింది. అప్పుడు రాముడు " సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను " అన్నాడు. యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి | గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ || అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటె మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు " అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు రాముడు " సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి " అన్నాడు. కోశాధికారిని పిలిచి తన దెగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని " నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటె నాకు పరమ ఆనందంగా ఉంటుంది " అన్నాడు. అప్పుడు రాముడు " నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు. " నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను " అన్నాడు లక్ష్మణుడు. నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు. 

౨౯

 రామాయణం -29 వ భాగం  అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దెగ్గరికి వెళ్ళి " నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలొ పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు " అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో " అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను " అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది. తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది " రామ, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరె బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామ, నీకొక నిజం చెప్తాను, న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే | అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా || నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులొ పట్టాభిషేకం జెరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను " అని కౌసల్య అనింది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో " అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు " అని అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది " రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటె నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు " అని కౌసల్య అనింది. అప్పుడు రాముడు " అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు.పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి " అన్నాడు. తరువాత లక్ష్మణుడితో, తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం | విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం | మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ | అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ || " లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దెగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బంగిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది. ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం | ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం || ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా | పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః || అమ్మ, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము. ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు | తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా || లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది. ( అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[ శాస్త్రం ప్రకారం అర్థం అంటె ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటె కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జెరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ( కైకెయ) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా...... సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ | యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ || సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు. రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు. అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. " సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది. భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః | స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః || అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది. భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ | భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం | అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ || ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ" అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి " నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితినుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది.