Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

రామలింగేశ్వర శతకము -అడిదము సూర కవి




                             రామలింగేశ్వర శతకము
                                                        -అడిదము సూర కవి



అతి సమర్థునకు సేయగ రాని పని లేదు -విద్యాధికుల కెందు వింత లేదు
పరుషోక్తునకు నోటఁ బలుక రానిది లేదు -సత్య సంధునకు పక్షంబు లేదు
హనన కారికి నితడాత డన్నది లేదు -దురితాత్మునకు వావి వరుస లేదు
భాగ్యశాలికి లభింపని శోభనము లేదు -చెడ్డ వానికి రాని చేటు లేదు |సీ|
నేర్చి తిరిగిన వానికి నింద లేదు
కష్టమోర్వక యున్న సౌఖ్యంబు లేదు
జ్ఞాన నిధి కాకయున్న మోక్షంబు లేదు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



కన్నంబు ద్రవ్వు తస్కరుఁ డింటి వారికి -వాడ లేదని ముంత వైచి చనునె?
తెరవాఁ టు కాఁ డు చింతించునే కట్టిన -బట్ట డుల్చిన మాన భంగమనుచు?
వలబడ్డ మెకము చూల్వహియించె ననుచును -విడువంగఁ జూచునే వేఁ టకాఁ డు?
జారుండు పరకాంత శయ్యకుఁ దారిచి -వావి గాదని పల్కి వదలి చనునె? |సీ|
ఆత్మ జను గుత్త రూకల కమ్ము నాతఁ
డరణము లొసంగఁ జూచునే యల్లునకును
ఎఱుఁ గ రింతియ కాక పరేంగితంబు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



తల్లి సేవించిన దైవతార్చన మేల -తండ్రి గల్గినఁ బెన్నిధాన మేల
దీన రక్షణమున్నఁ దీర్థాటనంబేల -విద్యాధికతయున్న వేష మేల
పరమ మిత్రుండున్న బంధు వర్గంబేల -పతిభక్తి గల్గిన వ్రతములేల
రసికత్వమున్నను రత్న భూషణమేల -ఘన వాహనంబున్నఁ గవచమేల |సీ|
ఇష్ట సంసిద్ధిఁ గన దంతి నెక్క నేల
కవిత గలిగిన రాజ్యాధికారమేల
తగు వినయమున్న వశ్యౌషధంబులేల
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పదుగురు కోఁ తి వెంబడి సంచరింపరే -వాహకు ల్లేరె శవంబులకును
గంగిరెద్దుకు లేవె ఘన తూర్యరావముల్ -కలిమి గల్గదె వార కామినులకుఁ
బులి గోవుఁ జంపి నక్కలను బోషింపదే -స్థూల కాయము లేదె దున్నలకును
పుప్పి పంటికి లేదె పుట్టంబు గట్టుట -వేణుధరుం డెద్దు వెంట రాఁ డె |సీ|
న్యాయ పద్ధతి నడువని యవని పతికి
నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొఱకు
అంతమునఁ జూడవలయు నా యయ్య సుఖము
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



పసరంబు ఱాగైనఁ బసుల కాపరి తప్పు -ప్రజలు దుర్నయులైన ప్రభువు తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణ నాథుని తప్పు -తనయుండు ధూర్తైనఁ దండ్రి తప్పు
అశ్వంబు ఱాంగైన నారోహకుని తప్పు -దంతి దుష్టైన మావంతు తప్పు
సైన్యంబు చెదిరి సైన్య నాథుని తప్పు -కూతురు చెడుగైన మాత తప్పు |సీ|
ఇట్తి తప్పు లెరుంగక యిచ్చ వచ్చి
నట్లు చరియించు వానికి హాని వచ్చు
నాడికలు గల్గు నది నిక్కమరసి చూడ
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పాపాత్మునకుఁ బారుపత్తె మియ్యగరాదు -చాలని పనికి గాల్చాచ రాదు
తప్పు సేయని వాని దండింపఁ బోరాదు -చేసిన సుకృతంబుఁ చెప్పరాదు
పలుగాకి వానితో భాషింపగారాదు -చెడ్డవానికి మేలు సేయ రాదు
ఆదాయ మెరుగని యప్పు సేయగ రాదు -పలువుర ద్వేషము పడగ రాదు |సీ|
పరుల ధన సంపద కసూయ పడగ రాదు
తనదు లేమికి ఖేద మందగ రాదు
సాధు వర్తన లివిగదా చర్చ సేయ
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పెట్టి పోసిన నాడె చుట్టాల చేరిక -కలిమి గల నాడె కాంత వలపు
సేవఁ జేసిన నాడె క్షితినాథు మన్నన, -వయసుఁ గల్గిన నాడె వనిత రక్తి
విభవంబు గల నాడె వెనువెంట దిరుగుట -వడియున్న నాడె మావారలనుట
పోరిమి గల నాడె పొరుగింట పోరట -మగుడింపఁ గల వాడె తగవు సూటి |సీ|
ఆత్మ శక్తిఁ దొలంగిన యవసరమునఁ
దనకు నెవ్వరుఁ గానిది తథ్యమరయ
బలిమి వో నవయవములె పనికి రావు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|

శ్రీమంతు నాజ్ఞప్తి సేయఁ డొకండును -బడుగు నేరము లెన్నఁ బరుగులెత్తుఁ
దోఁ టలు నఱికిన దోస మెన్నఁ డొకండు -నడవి గొట్టకు మని యాజ్ఞ వెట్టు
సరది గోర్ముంచినఁ జాటి చెప్పఁ డొకండు -తుప్పఁ గంటిన వాని దొసమెన్ను
నమ్మగొల్చిన వాని న్యాయ మెన్నఁ డొకండు -తప్పఁ గొల్చినవాని తప్పు జెప్పు |సీ|
నిట్టి పెద్దల కధికారమిచ్చి నట్టి
రాజు ననవలెఁ గాక దుర్ణయుల ననఁ గ
నేమి పనియున్నయది సత్కవీంద్రులకును,
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



సారమేయం బుట్టి చేరు ద్రెంపును గాని -పడకుండఁ బట్టునే పాలకుండ?
కోతి కొబ్బరి కాయ కొన కెక్కి పడద్రోయు -దాని జలంబులు త్రావఁ గలదె?
ముదుసలి పెండ్లాడి ముదిత యౌవనము వ్య -ర్థము జేయుఁ గా కేమి దానఁ గాంచు?
కాకి ముంగఱ నోరఁ గఱచి డొంకల పాలు -గావించుఁ గా కేమి గాంచు దానఁ ? |సీ|
జెడుగు నరుఁ డొరుసంపద జెఱచుఁ గాని
తనకు ఫలమేమి గలుగును తథ్య మరయ
నింద మాత్రంబు వానికి నిల్చు జగతి
రామ లింగేశ! రామచంద్ర పుర నివాస! ||

1 కామెంట్‌:

  1. ఆర్యా అడిదము సూరకవి శ్రీరామలింగేశ్వర శతకము తమరి వద్ద పూర్తిగా ఉన్నదా! దయజేసి తెలుప ప్రార్థన. నావద్ద మొదటి 16 పద్యములు లేని పిడిఎఫ్ మాత్రమే ఉన్నది. నమస్సులతో

    రిప్లయితొలగించండి