Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, మార్చి 2016, శుక్రవారం

౨౯

 రామాయణం -29 వ భాగం  అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దెగ్గరికి వెళ్ళి " నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలొ పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు " అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో " అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను " అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది. తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది " రామ, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరె బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామ, నీకొక నిజం చెప్తాను, న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే | అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా || నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులొ పట్టాభిషేకం జెరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను " అని కౌసల్య అనింది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో " అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు " అని అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది " రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటె నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు " అని కౌసల్య అనింది. అప్పుడు రాముడు " అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు.పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి " అన్నాడు. తరువాత లక్ష్మణుడితో, తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం | విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం | మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ | అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ || " లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దెగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బంగిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది. ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం | ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం || ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా | పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః || అమ్మ, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము. ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు | తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా || లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది. ( అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[ శాస్త్రం ప్రకారం అర్థం అంటె ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటె కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జెరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ( కైకెయ) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా...... సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ | యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ || సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు. రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు. అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. " సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది. భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః | స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః || అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది. భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ | భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం | అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ || ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ" అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి " నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితినుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో, అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది. 

౨౮

 రామాయణం -28 వ భాగం  కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది " ఏమయ్యా! ఇక్ష్వాకువంశములొ జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు. నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దెగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దెగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా. దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అనింది. అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను " అన్నాడు. అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో...... " రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను " అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది............. త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః | మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి || " సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా " అని అడిగింది. అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలీనా కైకేయ ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన........ " ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగె ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగె ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో " అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు. మెల్లగా తెల్లవారుతోంది.......................... అప్పుడు కైకేయ " ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను " అని అనింది. అప్పుడు దశరథుడు............. యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః | తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా || " నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటె ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు " అన్నాడు. అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఎమిటని సుమంత్రుడు కైకేయని అడుగగా............. " ఏమిలేదయ్య సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా " అనింది కైకేయ. అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయ్యబోగా, " రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా " అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు. ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు......... " అమ్మ! నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఎమన్నా పొరపాటు జెరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లి " అన్నాడు. అప్పుడు కైకేయ " ఎంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళి సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామ, నీకు చెప్తాను " అనింది. ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు "ఛి" అని తలవంచుకున్నాడు. అప్పుడు రాముడు..... తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం | కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే || " అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను " అన్నాడు. అప్పుడు కైకేయ " ఏమిలేదు రామ, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు " అనింది. అప్పుడు రాముడు " నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా, అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ | హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః || భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను " అన్నాడు. అప్పుడు కైకేయ " రామ! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి " అనింది. అప్పుడు రాముడు.... న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే | విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం || " అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకుపితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావ అమ్మ, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను " అన్నాడు. ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జెరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్తత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు....... 

రామాయణం -27

 రామాయణం -27 వ భాగం  అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానె ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలొ కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు.......... " కైకేయ, నీకు ఎమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటె నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటె చెప్పు, తప్పక తీరుస్తాను. అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం | దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః || ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైక. నీ కోరికెంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను " అన్నాడు. నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది. అప్పుడు దశరథుడు " ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను " అన్నాడు. అప్పుడా కైక.............. " రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా!, పగటి దేవతలారా!, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులార, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని...... అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః | అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం | నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః | చీరాజినజటాధారీ రామో భవతు తాపసః | భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం || " ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి " అని అనింది. (త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమనింది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.) అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు.................. " ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దెగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జెటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైక, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు. రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దెగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, నాన్న! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జెరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు. 

రామాయణం -26

 రామాయణం -26 వ భాగం  కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది......... " మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జెరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు." అనింది. "చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు " అని కైకేయ అనింది. అప్పుడు మంథర " పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దెగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దెగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జెరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం | ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః || ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దెగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి " అని మంథర కైకేయతో అనింది. మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో......" నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు " అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే.................. అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే || " ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు " అని చెప్పింది. "మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది " అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర............. " ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలోతిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు." అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో " ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి " అనింది. అప్పుడా మంథర..............నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది. 

రామాయణం -25

 రామాయణం -25 వ భాగం  ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందని ఆనందంగా ఉన్నారు, అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దెగ్గరకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర(పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో " ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి " అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి " కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జెరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా " అనింది. వెంటనే మంథర కైకేయి దెగ్గరకి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది............. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం | రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి || " నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జెరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలొ ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా " అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది...... " అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో " అని ఒక బహుమతిని ఇచ్చింది.