Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

3, జులై 2012, మంగళవారం

బాపూజీ - గుర్రంజాషువా



బాపూజీ

ఎవడీ యర్ధదిగంబరేశ్వరుడు మా యిండ్లం బ్రవేశింప నం
చవమానంబుగ చర్చిలాడగ బకింఘాం సౌధమున్ ద్రొక్కి హైం
దవ జాతీయత లీను మేల్పిలక నాట్యంబాడ, శ్రీ జార్జి భూ
ధవు నింటన్ ఫలహారముల్ సలుపు తాతన్ గాంధి నర్చించెదన్.

భగ్గునమండు సీమ నరపాలుర తోడ నెదిర్చి వెన్కకున్
దగ్గక రక్తపుం జినుకు నష్టముగాని స్వరాజ్య యుద్ధమున్
నెగ్గినయట్టి భారతముని ప్రవరుండు, క్షమాప్రవాసి, యా
మగ్గిన పండు, భోనమయి పోయెనె నేడు తుపాకిగుండ్లకున్.

జగమొక్కుమ్మడి ఱొమ్ము గ్రుద్దుకొని మూర్ఛందేలి, తబ్బిబ్బు జెం
దగ, చేజిక్కిన మొన్న మొన్నటి స్వతంత్ర స్వర్గసౌధంబులో
పొగరేగన్, బగవాడు లేని భువనంబున్ గన్నబాబున్, భవత్
భగవంతున్, దయామాలి చంపుకొనినావా?  భారతాంబామణీ!

నీ యంకంబున లాలితంబగుచు శాంతిం గాలముం బుచ్చు న
మ్మాయిన్, జిట్టి స్వరాజ్య బాలికను సామ్రాజ్యేందిరన్, లేత లే
తాయుష్మంతులు తండ్రిలేని యల జవహర్లాలమాత్య ప్రభుల్
మోయం జాలుదురే?  జగజ్జనక!  బాబూ!  గాంధి మున్యగ్రణీ!

ఇదియే పోవడమా!  జగజ్జనక!  రానే రావుగా!  నూట ము
ప్పది యేడుల్, మనువాడనన్న నుడికిన్ భంగంబు వాటిల్లెనే?
ముదితాతా!  ప్రతి రక్త బిందువును మా పూర్ణ స్వరాజ్యార్ధమై
కొదలేకిచ్చిన నీ విషాద మరణాగ్నుల్ గాల్చె ముల్లోకమున్.

ఏ లేనవ్వులు లోకలోకముల మోహింపించి, నిర్జించి, స్వే
చ్ఛా లావణ్యవతీ కరగ్రహణ పూజల్ గాంచి, పుష్పించెనో,
ఆ లేనవ్వులరాశి!  ఆ యపరవిద్యావార్ధి!  ఆ పండుటా
కీలోకంబును వాసెనే!  భరతరాజ్ఞీ!  యెంత దౌర్భాగ్యవో!

ఆగిపోయెనె ప్రపంచానందదంబైన
       ఖదరురాటల ఝంకారరవళి
ఇంకెనే శాశ్వతాస్పృశ్యుల నోదార్చి
       నెనరూను వేడి కన్నీటిబుగ్గ
పడిపోయెనే నేటివర కింత లభియించు
       గండు పేదలనోటి కబళరాశి
విరిగిపోయెనె నేటి వరమంత్రికోటికి
       నవలంబనంబైన యమరతరువు.

గంట కొట్టిన మాదిరి మింటి యందు
మండుచున్నాడు చండ మార్తాండ మూర్తి
భారత జ్యోతి గప్పున నారి పోవ
ముజ్జగంబున జీకటి ముమ్మరించె.

కలికాలమ్మున కేసు క్రీస్తువని వక్కాణించె దిగ్దేశముల్
తులువల్ సల్పిన గాయముల్ మరల నీలో దోచి యేసుప్రభున్
దలపించెన్ ఋజువయ్యె నీదగు మహత్వశ్రీ, భవత్యాగశ
క్తులలో నెన్ని స్వరాజ్యముల్, భువన వైకుంఠంబు లింపారునో

భరత వర్షంబీను వజ్రాల ధనరాశి
    తూకంబునకు హెచ్చు దూగు వాడు
మూడు మూర్తుల దయా విభూతి ప్రత్యంగాన
    తాండవించెడు పవిత్ర స్వరూపి
పది వేల యేండ్ల లోపల ధరా దేవత
    కనియెఱుంగని జగన్మునివరుండు
అనుగు దమ్ములు కోరుకొను స్వరాజ్యార్ధమై
    పస్తుండి శుష్కించు పండు ముసలి.

గోచిపాత గట్టుకొని జాతి మానంబు
నిలిపినట్టి ఖదరు నేతగాడు
విశ్వ సామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత, గాంధితాత.

విమత భూపతుల దోపిడి గుందు జాతిలో
    దీపంబు బెట్టిన దినకరుండు 
మానవత్వమును భూమండలంబున నెల్ల
    చాటిన యాచార్య చక్రవర్తి 
సత్యాగ్రహంబును శస్త్రచాలన విద్య
    భువికి దెచ్చిన మహా పురుషమౌళి   
నిమ్న జాతుల కంటి నీరంబు దుడిచి యా
    శ్వాసించు నిఱుపేద బాంధవుండు     

కలముల్ కైతలు మూగవోయినవి, శోకధ్వాంత ముప్పొంగి క
న్నులువోయెన్, సకల ప్రపంచమునకున్ దోడ్తో భయభ్రాంతమై
బలహీనంబయి తూలె భారతము, విశ్వవ్యాపి బాపూజి, గుం
డెలలోనుండి పవిత్రరక్తము చితాగ్నిన్ గ్రాగి ఘోషింపగన్

వేయేడుల్ దలక్రిందులైన, భరతోర్వీచక్ర మీ వింత గో
సాయిన్ సామి దిగంబరేశ్వరు నహింసామూర్తి, శాంతి క్షమా
వ్యాయామ స్థిరు నెత్తి పెంచుకొను భాగ్యం బున్నదే?  మానదీ
గాయంబీ మతమత్త చిత్తుల తలల్ ఖండించి, కాల్పించినన్.

అవతారంబులు దాల్చినాడు పది మార్లబ్జాక్షుడం చూరకే
చవు లూరించు సమస్త శాస్త్రములు! సాక్షాదబ్జనాభుండవై
యవతారించిన నిన్నెఱుంగుదుము! బ్రహ్మాండం బెఱుంగన్ జగ
ద్భవమున్, చెండితివీవు కొండొక మరంద ప్రేమ హాసంబునన్.

అచ్చపు గ్రైస్తవుండనుచు నంజలి బట్టిరి క్రైస్తవోత్తముల్
పొచ్చెములేని బౌద్ధుడని పూజ లొనర్చిరి బౌద్ధ భిక్షకుల్
ముచ్చరకించి మా ముసలుమానని పల్కె దురుష్కలోకముల్
అచ్చ మహాత్ముడన్న నుడి కర్హుడు గాంధి ఫకీరు డెంతయున్.