Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, జులై 2012, సోమవారం

గుర్రంజాషువా - ఆంధ్ర మాత , భరత మాత



ఆంధ్ర మాత

ఆంధ్రాళి మోదంబు నాశించి పోయిన
    తిక్కనార్యుని వాణి తౄప్తినంద
గజ్జెలందెల కాలు గదలించి మన్నె బొ
    బ్బిలి కోట దొలికోడి పలికి కులుక
నడువీధులందు రత్నము లమ్ముకొన్నట్టి
    తెలుగుల సంపత్తి తలపుకెక్క
ఖండాంతరముల బంగారు పూజలు గొన్న
    కలికి పోగరమేను పులకరింప

మూడు కొండల శివలింగములు రహింప
నాలసింపక రాష్ట్ర సింహాసనమున
నధివసింపుము జయము నీయందుగలదు
దివ్యదాశయ సుమవల్లి ! తెలుగు తల్లి !

ఘన గాంధేయ శక ప్రకాశలన మింకన్ సోక కత్యంత ప్రా
క్తనపుంజీకటి చిందులాడెడు విముగ్ధ ప్రాంతముల్ నిద్ర మే
ల్కొన శంఖారవ మాచరింపు మిక నుగ్గుంబాలలో ఘంటమం
దిన విద్వాంసులగన్న వీర జనయిత్రీ ! ఆంధ్రరత్న క్షితీ!

కులముల్ కొమ్ములతోడ గుమ్ముకొని చిక్కుల్ పెక్కు సౄష్టించు పె
ద్దల కాలాలు గతించి పోయినవి స్వాతంత్ర్యంబు సిధ్ధించె రా
జుల సింహాసన మెక్కినారు ప్రజ లెచ్చుందగ్గులం బాపుజీ
హలిక శ్రేష్టుడు దున్నినా డిపుడు లేవంతస్థు లాంధ్రక్షితీ !

పెను స్వార్ధంబు మహా పిశాచమువలెన్ బీడింప దేశంబు చి
క్కిన శల్యంబయి తూలిపోయినది ఈ కీడుం దొలంగించు చ
క్కని మార్గం బుపదేశ మిచ్చుకొని ముక్తాస్వచ్ఛ భావంబు నీ
యనుగుం బిడ్డలలో సౄజింపుము త్రిలింగాద్రిక్షమాభూషణీ !

ఆలాపించిన సత్కవీశ్వరుల దివ్యాశీర్వచశ్శక్తిచే
నాలాభించిరి భారతీయులు స్వరాజ్య స్వర్ణ దండంబులే
దాలాలంబు కవి ప్రపంచమున కమ్మా ! వాఙ్మయోద్యానమున్
బాలింపంగల దాతలం గని రసజ్ఞత్వంబు చాటింపుమీ !

కృతులందుటకు పల్లకీ మోయ దొర కొన్న
    కృష్ణరాయడు రాజ్యమేలునాడు
మనుమసిద్ధియును దిక్కన గన్న కావ్యంబు
    కోరచూపులు జూచుకొన్ననాడు
తెలుగురాయని యొప్పులొలుకు గుప్పిటిలోన
    లేత కస్తురి గుబాళించునాడు
ముత్యాల మందిరంబుల సత్కవులమీద
    బంగార మేరులై పారునాడు

కవుల పల్కులు వేదవాక్యంబు లగుచు
క్షితితలంచును గంపింప జేయునాడు
గారవంబుననన్నేల గాంచవైతి
తెలుపగదవమ్మ ! ననుగన్న తెలుగు తల్లి !

అలసానికులజు డూయలమంచములనుండి
    పసిడిలేఖిని బూని వ్రాయునాడు
పోతనార్యుని గేహమున భారతీదేవి
    చిగురుజేతుల వంట జేయునాడు
భువన భీకరుడు వేములవాడ భీమన్న
    గంగ్రాజునకు జోలె గట్టునాడు
శ్రీనాధకవి పాండితీ వైభవము మీఱ
    డిండిమభట్టు నోడించునాడు

కనుల జూచెడు భాగ్యంబు గలిగి యున్న
నేడు నా కవిత్వంబు రాణించియుండు
గారవంబున నన్నేల గాంచవైతి !
తెలుపగదవమ్మ ! ననుగన్న తెలుగు తల్లి !

జననం బందె నపూర్వవైఖరులతో, సంగీత సాహిత్య మం
డన!  నీ తెల్గుమిటారి చెన్నపురి వీటన్ గజ్జెమ్రోయించుచున్
దనువుప్పొంగ బురాత నాంధ్ర విభవోద్యానంబురేకెత్త, మో
హన గానంబుల నాలపింపగదవయ్యా ! ఆంధ్ర యోధాగ్రణీ !

ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విస్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ మా
రక పోనీక సముద్ధరింపు కొను మాంధ్రా !  వీర యోధాగ్రణీ !

బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళా మర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్ర ప్రపంచంబులో
మేనెల్లన్ గబళించినారు పరభూమీశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్.


తలికోట యుద్ధాన నళియ రాముని వల్ల
    ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
    శమియించె నీ బాలచంద్రరేఖ
బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతనమున
    వితమయ్యె నీ కొండవీటి పటిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
    ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు.
 
పరువు దూలిన నీ యనాదరణ కతన
మేటి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యొత్తుము నీ వీర కాహళంబు

చీనా పెగోడాల సిగమీది పుష్పమై
    పొడమె నీరాతి చెక్కడపు చెణుకు
అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి
    కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవదిరులదాక జౄంభించి పగవాని
    తరిమి వెన్నాడె నీ కరకుటలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
    నీ జగన్నాధ పండితుని పలుకు
 
ఎందు జూచిన నీ యశస్వందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తటంబుల యలర నెత్తింపవోయి
తెలుగు మన్నీల పసువు నిగ్గుల పతాక.
 
తెలుగుం గేసరులున్ మహర్షులును గాంధీ శాంతి సేనాపతుల్
గలరాంధ్రప్రముఖుల్ త్వదీయులు భుజస్కంధంబు నందింత్రు నీ
అలఘ శ్రేయములీనమోచినవి రాష్ట్రార్ధంబు యత్నించి నీ
బలముంగొంచియ మాకళించుకొనరా ! ప్రఖ్యాత వీరాంధ్రుడా !


        భరత మాత

సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల
    యంకసీమల నిల్చినట్టి సాధ్వి
కమలనాభుని వేణుగానసుధాంబుధి
    మునిగి తేలిన పరిపూతదేహ
కాళిదాసాది సత్కవికుమారుల గాంచి
    కీర్తి గాంచిన పెద్దగేస్తురాలు
బుధ్ధాది మునిజనంబుల తపంబున మోద
    బాష్పముల్విడిచిన భక్తురాలు

సింధు గంగానదీజలక్షీరమెపుడు
గురిసి బిడ్డల బోషించుకొనుచునున్న
పచ్చి బాలెంతరలు మా భరతమాత
మాతలకు మాత సకలసంపత్సమేత.