Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

28, ఫిబ్రవరి 2015, శనివారం

తెలుగు కవులు - సుద్దాల హన్మంతు



సుద్దాల హనుమంతు

  కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. కవిగా, కళాకారుడుగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908, డిసెంబర్‌ నెలలో పేద పద్మశాలి కుటుంబంలో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నివసించడంతో ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు. హన్మంతు తండ్రి ఆయుర్వేద వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్థూ, తెలుగుభాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు.
కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వాలంటీర్‌గా పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో `సంఘం’ స్థాపించారు. ఈ `సంఘం’ ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనయ్‌. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేది. పాటే జనంలో చైతన్యాన్ని కలిగించేది. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ `వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని వీరావేశం ఆయన పాటకు బలాన్ని, బలగాన్ని సమకూర్చి పెట్టాయి.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా, ఉద్యమకారులుగా తయారు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
చరిత్రాత్మకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన 4 వేల మంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేస్తే ఇందులో సగం మంది నల్లగొండ జిల్లా వారేనంటే సాయుధపోరాటంలో ఆ జిల్లా పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రాణ త్యాగాల్లోనే కాకుండా సాయుధ పోరాటానికి ఇరుసుల్లా పనిచేసే గొప్ప నాయకత్వాన్ని, తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి ప్రజల్ని గెరిల్లా పోరాట వ్యూహాలకు కూడా సిద్ధం చేసింది.
ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు.జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు క్యాన్సర్‌ వ్యాధితో 1982, అక్టోబర్ 10 ‎ న అమరుడయ్యాడు.
మాభూమి సినిమాలో పల్లెటూరి పిల్లగాడ పాట రాశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి