Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

10, జులై 2012, మంగళవారం

పారిజాతాపహరణం లోని పద్యాలు

పారిజాతాపహరణం లోని పద్యాలు

మాసిన చీర కట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై
వాసెన కట్టు కట్టి నిడువాలిక కస్తురి పట్టు పెట్టి లో
గాఁసిలి చీకటింట కడ కంకటి పై జలదంత చంద్ర రే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్

ఈ పగిదిన్ సాత్రాజితి
కోపోద్వేగమున వగల కుందుచు ఘన సం
తాపంబు పేర్మి నితర
వ్యాపారము మాని యుండె హరియును యచటన్

ముని నాకిచ్చిన పూవు చందమును నే మున్నాడి యా భోజ నం
దనకర్పించిన జాడయున్ దెలియ చెంతన్నిల్చి వీక్షించి పో
యిన సాత్రాజితి బోటి నా వలన తా నేమేమి కల్పించెనో
యని ప్రద్యుమ్నుని మౌని దండ నిడి చింతాయత్త చిత్తంబుతోన్

అరదము నెక్కి కేతన పటాంచల చంచల మైన తాల్మితోన్
తురగ జవంబు ముంగడవ త్రోచి కడంగెడు తత్తరంబుతోన్
తిరిగెడు బండి కండ్ల పగిదిన్ భ్రమియించు మనంబు తోడ శ్రీ
హరి సనుదెంచె సత్య సముదంచిత కాంచన సౌధ వీధికిన్

వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వార సీమ
దారకుని నియమించి __ తాన యొకడు
కమలనాభుండు కక్ష్యాంతరములు కడచి
యలబలము లేని నగరెల్ల యరసి చూచి

అని యనుమానించుచు నొ
య్యన కోప గృహంబు జేరి యా సాత్రాజిత్
తనయ ముసుంగిడి యుండగ
అనువు మెరయ జొచ్చి మాయ యచ్చు పడంగన్

కొందర మంతనంబులను కొందర జంకెన వాడి చూపులన్
కొందర చేతి సన్నల దగుల్బడ జేయుచు మీర బోయి మ
ధ్యందిన భాను మండల కరావళి హావళి వాడి యున్న తీ
గందలపించు నమ్ముగువ కన్గొని యెంతయు విస్మితాత్ముడై

ఈ లలితాంగి చంద మొక యించుక జూచెద నంచు ధూర్త గో
పాలుడు తాలవృంత __ భామిని సత్య పిరుంద నుండి మం
దాలస లీలమై విసర నాదట గైకొని వీచె తద్వపుః
కీలిత పంచశాయక శిఖిన్ దరి కొట్టుచు నున్న కైవడిన్

అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్య వాసనల్
వింతలు సేయ తావి యిది విస్మయమంచు ముసుంగు త్రోచి య
క్కాంత గృహంబు నల్గడలు కన్గొని సంభృత తాలవృంతునిన్
కాంతుని జూచి బాష్ప కణికా తరళీకృత లోచనాంతయై

తలవంచి మగుడ ముసిగిడి
కొలకుల డిగజార జాలుకొను బాష్పంబుల్
పలుచని చెక్కుల లవలీ
దళ పతిత మరంద బిందు తతి పురుడింపన్

మానవతి ఇట్లు మానని
మాన క్రోధములచే కుమారిలి చింతా
ధీన గతి నుండ మదిలో
నూనిన ప్రేమమున నంబుజోదరుడనియెన్

ఇందునిభాస్య మైతొడవులేల ధరింపవు నున్న కావులీ
వెందును మాన లేవు తెలుపేటికి కట్టితి వీటికా రుచుల్
కెందలిరాకు మోవి తులకింపగ జేయక నున్కి యేమి నీ
చందము వింత యయ్యెడు నిజంబుగ నాకు నెఱుంగ జెప్పుమా

మనమరయం దలంచి యొక మార్గము పన్నితొ నవ్వులాటకున్
నను వెరపించెదో యకట నా యెడ నిక్కము తప్పు గల్గెనో
వనజ దళాయతాక్షి పగ వాడనె నన్నిటు యేల జూడ వొ
క్క నిమిషమైన నీవు దయ కన్గొన కుండిన నిల్వ నేర్తునే

మనమున మాటలం గ్రియల ____________________ నెట్టి కా
మినులకు నొక్క నాడు మెరమెచ్చులకై పచరింతు గాని పా
యని యనురక్తి నీ యెడనె యగ్గలమై కను పట్టు నాకు నీ
పనిచిన పంపు చేయుటయ ప్రాభవమౌటది నీవెరుంగవే ?

పడతీ నీ మధురాధరామృతము నీ బాహా పరీరంభమున్
పడయన్ ధన్యుడ కాక యుండిన ననున్ పాటించి యొక్కింత నీ
నిడువాలున్ కడ కంట చూడుమనుచున్ నిల్వోపమిన్ పైచెరం
గొడియం జేవిరి దమ్మి వేయుటకునై యుంకించి జంకించినన్

పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటును పాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్టఁ నా జగ
న్నాటక సూత్ర ధారి యదు నందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్,

జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్
తొలగన్ ద్రోచె లతాంగి ! యట్ల యగు నాధుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే !!

కోపన పద హతి కుహనా
గోపాలుడు కాంచి మెయి గగుర్పొడవగ ను
ద్దీపిత మన్మధ రాజ్య
ప్రాపితుడై పలికె కూర్మి బయట పడంగన్ !

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా !!

అన విని మానినీ తిలక మప్పుడు మెయ్యర తోప నిక్కి వీ
డిన కచ పంక్తి పల్మరు ముడిన్ పెడ త్రోపుచు పై చెరంగు గ్ర
క్కన చను దోయి చేర్చుచు మొగంబున లేఁజెమటంకురింప జం
కెన నెఱ జూపు జూచి పలికెం జలితాధర పల్లవాగ్రయై

ఈ నయగారపుం బ్రియములీ పస లీ మెర మెచ్చు మాటలే
లా నిను నమ్మి యుండిన ఫలంబిదె తోడన నాకు గల్గె నీ
యాన జుమా ననుంజెనకి యారడి బెట్టిన నవ్వు వారలన్
గానవెరుంగునే పసుల కాపరి భావజ మర్మ కర్మముల్

ఇంకిటు నిన్ను నమ్మ నను యేమిటికిన్ కెరలించెదెంతయుం
బొంకము కాని ఈ వలని బొంకులు మా చవి గావు రుక్మిణీ
పంకజ పత్ర నేత్రకవి ప్రాణ పదంబులు గాని వల్లకీ 
కింకర చాలుజాలు యుడికింపకు నింపకు లేని కూరుముల్

గట్టివ చేతలున్ పసలు కల్ల తనంబులు నీవు పుట్టగా
పుట్టినవెందు లేని పలు పోకల మాయలు నీకు వెన్నతో
పెట్టినవౌ టెరింగియును బేల తనంబున నిన్ను నమ్మి నా
గుట్టును తేజమున్ మిగుల కోల్పడి పోయితినేమి జేయుదున్

మునిపతి వచ్చి పూవొసగి మోదము తోడ భవత్ప్రియాంగనన్
వినుతి యొనర్పగా వినిన వీనులు మా చవిగాని మాటలన్
విన వలసెంగదా యిపుడు నీవిట వచ్చుట పారిజాత వా
సన ప్రకటించి నాకు నెకసక్కెము చేయన కాదె జెప్పుమా ?

మానంబె తొడవు సతులకు
మానమె ప్రాణాధికంబు మానమఖిల స
మ్మానములకు మూలంబగు
మాన రహితమైన బ్రతుకు మానిని కేలా ?

నను యెవ్వెత గాఁ జూచితి
వని యంతర్బాష్ప యగుచు యవనత ముఖియై
ఘనతర గద్గదికా ని
స్వనమున మరి మాటలాడ శక్యము కామిన్

ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయి చేల చెరంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కల కంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ !!

ఆ రమణీ లలామ మదినంటిన కోపభరంబు నిల్పగా
నేరక నెవ్వగన్ బొగుల నీరజ నాభుడు నిండు కౌగిటన్
జేరిచి బుజ్జగించి నును జెక్కుల జాలుకొనంగ జారు క
న్నీరు కరంబునం దుడిచి నెయ్యము తియ్యము దోప యిట్లనెన్

వామలోచన నీ కేలి వనములోన
చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన
సరస కర్పూర కదళికా తరుల నడుమ
పెరటి జెట్టుగ నాటింతు పెంపు గనుమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి