కొన్ని ఇతర వచన కవితలు
కనిపించని చావులు సముద్రాల్ని లేపవు స్మైల్
ఎక్కడా జండాలు కిందకి దిగి రెపరెపా ఏడ్వలేదు
సంగీతాలు విషాదాల దీర్ఘాలై విశ్వాంతరాళం నిండలేదు
ఎవరని మీరు
మాకు దగ్గరగా లేని మీరెవరూ మాకేమీ కారు, ఎవరని మీరు
వార్తల పేపర్లంత పలచని వాళ్ళు
చావు మీ నెత్తుట్లో ఖూనీరాగాలు తీస్తున్నా తెలీని అమాయకులు
మీకేం తక్కువని
గాలి మీది, నేల మీది, సందుగొందుల సమీకృతాహారం మీది
డాలర్ తలొంచుకుంటుంది. రూపాయి తలొంచుకుంటుంది
అవును మరి - గాలి మీది, నేల మీది, ఆకాశం మీది
అనేకానేక ఆవేదనల బరువు మీది
మీరేమీ అరవొద్దు, పలుకే పలకొద్దు, ఏవీ అడగొద్దు
ఆకలీ గీకలీ అనొద్దు
ఏ బానపొట్టలైనా చిట్లుతాయి, శాసనాలు తడిసిన మంచాలౌతాయి
తుపాకులు శిలువల్ని కురుస్తాయి, ప్రభుత్వాలు కటకటాల్ని పూస్తాయి
వొద్దు వొద్దు, ఎవర్నీ మీరిబ్బంది పెట్టొద్దు, ఎవరికీ మీరిబ్బంది కావొద్దు
పొండి వెళ్ళి పొండి
ఆటలొద్దు పాటలొద్దు మీ బాల్యం అడవిపూవై వికసించ వొద్దు
వెళ్ళిపొండి, చడీ చప్పుళ్ళేకుండా నీడల్లా నిష్క్రమించండి
మా నిద్రలు చెడతాయి, మా నిషాలు వొదుల్తాయి
మా చట్రాలు పేలి విడతాయి
మా ఫ్రిజ్లు, ఫోం పరుపులు, బ్రాలు, అణ్డర్వేర్లు, బ్లేడ్లు, సబ్బులు
సెంట్లూ తిరగబడతాయి
బాబ్బాబూ, మాకు పీడ కలలొద్దు
మాకు మా ఆలోచనలు తప్ప వేరే ఇంకేమీ వొద్దు
మాకు మా పిల్ల పాపల చదువూ క్షేమం అభివృధ్ధి తప్ప
ఇంకేమీ తెలీదు
ఎందుకిలాగ ఏమిటి చేద్దాం అన్న ప్రశ్నలే వొద్దు
చంద్రుడికో శుక్రుడికో వాటిని పంపించేద్దాంలెద్దురూ
వెళ్ళిపొండి వెళ్ళిపొండి మాకు కంపించని మీరు
ఎవరైతే యేం, మీరేమైతే యేం
చిన్న చిన్న పిచ్చి పిచ్చి కలలు జిల్లేడు పూలుగా ఎటో ఎగిరిపోతున్నాయి
చిన్న చిన్న కోరికలు గాలిలో గోరీలై తేలిపోతున్నాయి
అయినా రోడ్ల పక్క చెట్ల కింద వీర్యాలు మొలుస్తూనే వున్నాయి
అవునవును మీరు మాకు కావలసిన వాళ్ళే
కాని మీరు మావాళ్ళే అనడానికి
మేం మా టెర్లిన్ల కింద తప్ప నగ్నంగా లేం కదా మరి
మేం మా రాతల్లో వూహల్లో తప్ప మీ కోసం సిగ్గు పడం కదా మరి.
వెళ్ళి పోతున్న వరదల్ని వెనక్కి లాగాలని.... వాడ్రేవు చిన వీర భద్రుడు
వెళ్ళి పోతున్న వరదల్ని వెనక్కి లాగాలని
ఎందుకో ఇంకా ఈ వెర్రి కోర్కె నాకు
వరదలు ప్రవహించి పోయిన
జేగురు రంగు పంట పొలాల్లో
సాయం సంధ్య వుసురుమని కూలబడే వేళ
మలిన పక్షాల కొంగలు మిడతల్ని వేటాడే చోట
పొర్లిపోయిన భీభత్సపు బాధా పరిష్వంగ సుఖాన్ని
పదే పదే స్మరించుకొంటూ
దాటిపోతున్న వరదల్ని వెనక్కి లాగాలని
ఎందుకో ఇంకా ఈ పాడు కోర్కె నాకు
నిర్మల శారదాకాశం కింద
రెల్లు బయళ్ళని మెత్తగా తాకుతో
సెలయేళ్ళు ప్రవహించాలని కలలు గన్న నా పై
వరదలు వరదలు వరదలు
అప్పటికీ,
నిలవ నీయకుండా కుదిపే ఈ మురికి వరదల్ని
వెనక్కి లాగాలని కావిలించు కోవాలని
ఎందుకో ఇంకా అర్థం లేకుండా నాకు!
అంతా ఒకే శబ్దం అజంతా
చెప్పలేదా నేను చెప్పలేదా అంతా ఒకే శబ్దం అని
సర్వవ్యాప్తమైన శబ్దవలయంలో
ఖండితహస్తాలు ఆవిష్కరిస్తున్న జననాంతర గ్రహణ దృశ్యాలను తలచుకొని
నీ కన్నులు జలార్ద్రమైనపుడు
చెప్పలేదా నేను చెప్పలేదా
మృత్యువు ఒక హెచ్చరిక మాత్రమే అని
ఆకురాలుతున్న శబ్దం ఒక ఆహ్వానం మాత్రమే అని
చెప్పలేదా నేను, చెప్పలేదా
భయకంపితమైన శబ్దం మీద
ఒక గవాక్షం తెరుచుకోగా
నేను, నా శరీరం ఒకేసారి నిలువునా బ్రద్దలై రెండు ముఖాలతో నేను
మరో గవాక్షంలో అడుగుపెడుతున్నప్పుడు
చెప్పలేదా నేను చెప్పలేదా
అంతా ఒక కదలిక మాత్రమే అని
మరణానంతరం కూడా మనిషి మాట్లాడుతూనే వుంటాడని
చెప్పలేదా నేను చెప్పలేదా
నిగూఢమైన ఒక శబ్దం వెనుక
అగాధం లోలోతులలో ఈదుతున్న నా పద్యాలు
ఎక్కడో ఒకచోట ఒడ్డు చేరుకొని త్రికాల నాట్యం చేస్తున్నప్పుడు
చెప్పలేదా నేను చెప్పలేదా
అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహతం అని
చెప్పలేదా నేను చెప్పలేదా
అంతా ఒకే శబ్దం
ఒకే కదలిక
ఒకే ప్రవళిక
శరీరాన్ని జయించిన ఒక జీవితం అట్టడుగున
శబ్దపేటికలో ఒక అస్థిక వికసిస్తున్న శబ్దం నేనే
అంతా ఒక చిత్కళ.
అపస్వరాలు నారా
ఆకలేస్తోందా నీకు?
ఆంధ్ర సంస్కృతి మహోజ్వల మైనది
తినడానికి తిండిలేదా నీకు?
తెలుగు భాష 'italian of the east'
పోలీసులు నిన్ను చితగ్గొడుతున్నారా?
మనకి అంతర్జాతీయ ఖ్యాతి అవసరం
నన్నయ్య గొప్పవాడు
నాకు ఆకలేస్తోంది
కృష్ణదేవరాయల రోజుల్లో --
ఒరేయ్! నాకు ఆకలేస్తోంది
ఏ దేశమేగినా ఎందు కాలిడినా....
నీయమ్మ! నాకాకలేస్తోందిరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి