Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

నరసిమ్హ శతకం - ధర్మపురి శేషప్ప కవి



                                     నరసిమ్హ శతకం
                                                       - ధర్మపురి శేషప్ప కవి



తల్లిగర్భమునుండి ధనము తేఁడెవ్వఁడు - వెళ్ళిపోయెడి నాఁడు వెంట రాదు;
లక్షాధికారైన లవణమన్నమెగాని - మెఱుఁగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జనం జేసి విఱ్ఱవీగుటేగాని - కూడఁబెట్టిన సొమ్ము గుడువఁబోడు;
పొందుగ మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దాన ధర్మము లేక దాఁచి దాఁచి |సీ|
తుదకు దొంగల కిత్తురో, దొరలకగునో?
తేనె జుంటీఁగలియ్యవా తెరువరులకు?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! |తే|



కర్ణయుగ్మమున నీకథలు సోఁకినఁ జాలు - పెద్దపోగుల జోళ్ళు పెట్టినట్లు;
చేతులెత్తుచుఁ బూజసేయఁ గల్గినఁ జాలు - తోరంపు కడియాలు దొడిగినట్లు;
మొనసి మస్తకముతో మ్రొక్కఁగలిగినఁ జాలు - చెలువమైన తుఱాయి చెక్కినట్లు;
గళము నొవ్వఁగ నామస్మరణ గల్గినఁ జాలు - వింతగా గంఠీలు వేసినట్లు; |సీ|
పూని నినుఁ గొల్చుటే సర్వభూషణంబు,
లితర భూషణముల నిచ్చగింపనేల?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! |తే|



అడవి పక్షులకెవ్వాఁడాహారమిచ్చెను - మృగజాతికెవ్వఁడు మేఁతఁ బెట్టె?
వనచరాదులకు భోజనమెవ్వడిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్ళు చేది పోసె?
స్త్రీలగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణులకెవ్వఁడు పోసెఁ బరఁగపాలు?
మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించెఁ - బసులకెవ్వఁడొసంగెఁ బచ్చిపూరి? |సీ|
జీవ కోట్లనుఁ బోషింప నీవెగాని,
వేఱెయొక దాత లేఁడయ్య వెదకిచూడ!
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! |తే|



ప్రహ్లాదుఁడేపాటి పైడి కానుక లిచ్చె - మదగజంబెన్నిచ్చె మౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబు ల-హల్య నీకే యగ్రహారమిచ్చె?
నుడుత నీకేపాటి యూడిగంబులు చేసె - ఘన విభీషణుఁడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు - ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె? |సీ|
నీకు వీరందరయినట్లు నేను గాన!
యెందుకని నన్ను రక్షింపవిందువదన?
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! |తే|



హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ - సకల గ్రంథమ్ములు చదివినట్లు;
భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ - జేముట్టి దానంబు చేసినట్లు;
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ - నింపుగా బహుమానమిచ్చినట్లు;
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలుఁ - గనక కంబపు గుళ్ళు గట్టినట్లు; |సీ|
ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు!
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర! |తే|






1 కామెంట్‌:

  1. ధర్మపురికి చెందిన శ్రీ గుండి రాజన్న శాస్త్రి గారి విశేషాలు, వారి రచనలు ప్రచురించవలసిందిగా కోరుచున్నాను.

    రిప్లయితొలగించండి