Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

మనుచరిత్ర



                                    మనుచరిత్ర -అల్లసాని పెద్దన 

వరూథినీ ప్రవర వృత్తాంతం


మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసారసాంద్ర వీటీ గంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు దెలుపుఁ నొక్క మారుత మొలసెన్



అతఁ డావాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁ బోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్,
శతపత్రేక్షణఁ, జంచరీక చికురం, జంద్రాస్యఁ, జక్ర స్తనిన్,
నతనాభిన్, నవలా, నొకానొక మరున్నారీ శిరోరత్నమున్



అమల మణిమయ నిజ మందిరాంగణస్థ
తరుణ సహకార మూల వితర్ది మీఁద
శీతలానిల మొలయ నాసీనయైన
యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున



తతనితంబాభోగ ధవళాంశుకము లోని -యంగ దట్టపుఁ గావి రంగు వలన
శశికాంతమణిపీఠి జాజువాఱఁగఁ గాయ -లుత్తుంగ కుచ పాళి నత్త మిల్లఁ
దరుణాంగుళీ ధూత తంత్రీ స్వనంబుతో -జిలిబిలి పాట ముద్దులు నటింప
నాలాపగతిఁ జొక్కి యరమోడ్పుఁ గనుదోయి -రతి పారవశ్య విభ్రమముఁ దెలుపఁ

బ్రౌఢిఁ బలికించు గీత ప్రబంధములకుఁ
గమ్రకర పంకరుహ రత్న కటక ఝణ ఝ
ణధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప
నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి,



అబ్బురపాటు తోడ నయనాంబుజముల్ వికసింపఁ, గాంతి పె
ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గ్రుమ్మరింపఁగా
గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్, మదిలోనఁ గోరికల్
గుబ్బటిలంగఁ జూచె నలకూబర సన్నిభు నద్ధరామరున్



చూచి, ఝళంఝళత్కటక సూచిత వేగ పదారవిందయై
లేచి, కుచంబులుం దురుము లేనడు మల్లల నాడ నయ్యెడం
బూచిన యొక్క పోఁకనునుబోదియఁ జేరి, విలోకన ప్రభా
వీచికలం దదీయ పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్



మునుమున్ బుట్టెడు కొంకు లౌల్యమునిడన్, మోదంబు విస్తీర్ణతం
జొనుపం, గోర్కులు గ్రేళ్ళు ద్రిప్ప, మదిమెచ్చుల్ ఱెప్పలల్లార్ప, న
త్యనుషంగస్థితి రిచ్చపాటొసఁగ, నొయ్యారంబునం జంద్రికల్
దనుకంజూచె లతాంగి భూసురుఁ బ్రఫుల్ల న్నేత్ర పద్మంబులన్



తొంగలి ఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ బైపయి విస్తరిల్లు క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖ చంద్రు నటంచుఁ బోవనీ
కంగజుఁ డాన వెట్టి కదియన్ గుఱి వ్రాసె ననంగ జాఱి సా
రంగ మదంబు లేఁజెమటఁ గ్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్



ఇట్లతని రూప రేఖా విలాసంబులకుం జొక్కి ..... యాత్మగతంబున,



ఎక్కడి వాఁడొ ! యక్ష తనయేందు జయంత వసంత కంతులం
జక్కఁ దనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం
బెక్కడ? ఈ తనూవిభవమెక్కడ? ఏలని బంటుగా మరుం
డక్కఁ గొనంగ రాదె, యకటా ! నను వీఁడు పరిగ్రహించినన్



వదన ప్రభూత లావణ్యాంబు సంభూత -కమలంబు లన వీని కన్నులమరు
నిక్కి వీనుల తోడ నెక్కసక్కెములాడు -కరణి నున్నవి వీని ఘన భుజములు
సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె -వెడఁదయై కనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్ఱవాఱిన -రీతి నున్నవి వీని మృదు పదములు

నేరెటేటి యసల్ తెచ్చి నీరజాప్తు
సానఁ బట్టిన రాపొడి చల్లి, మెదిపి,
పదను సుధ నిడి చేసెనో పద్మ భవుఁడు
వీనిఁ, గాకున్నఁ గలదె యీ మేని కాంతి !



అని చింతించుచు మీన కేతన ధనుర్జ్యాముక్త నారా చదు
ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై దీపించు పెందత్తఱం
బునఁ బేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్ మ్రోయ, నడ్డంబు ని
ల్చిన నయ్యచ్చరఁ జూచి చేరఁ జని పల్కెన్ వాఁడు విభ్రాంతుడై



"ఎవ్వతె వీవు భీతహరితేక్షణ ! యొంటి జరించె దోడులే
కివ్వనభూమి ? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితిం
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ, దెల్పఁ గదవే తెరువెద్ది శుభం నీ కగున్"



అని తన కథ నెఱిఁగించినఁ
దన కనుఁగవ మెఱుఁగు లుబ్బఁ దాటంకములుం
జనుఁగవయు నడుము వడఁకఁగ
వనిత సెలవివాఱ నవ్వి వానికి ననియెన్



"ఇంతలు కన్నులుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర ! యే
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక, నీ వెఱుఁగవే మునువచ్చిన త్రోవచొప్పు ? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్



చిన్ని వెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్దిఁ -బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
రహి పుట్ట జంత్ర గాత్రముల రాల్ గరఁగించు -విమల గాంధర్వంబు విద్య మాకు
ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు -పని వెన్నతోడఁ బెట్టినది మాకు
హయమేధ రాజసూయము లనఁ బేర్పడ్డ -సవన తంత్రంబు లుంకువలు మాకుఁ

గనకనగసీమఁ, గల్పవృక్షముల నీడఁ
బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ
బద్మసంభవ, వైకుంఠ, భర్గ సభలు
సాము గరిడీలు మాకు గోత్రామరేంద్ర !



పేరు వరూథిని, విప్రకు
మార ! ఘృతాచీ, తిలోత్తమా, హరిణీ, హే
మా, రంభా, శశిరేఖ లు
దార గుణాఢ్యలు మదీయలగు ప్రాణ సఖుల్



భూసుర ! కైతవ కుసుమ శ
రాసన ! మాయింటి వింద వైతివి, గైకొ
మ్మా ! సముదంచన్మణిభవ
నాసీనత సేద దేఱి యాతిథ్యంబున్



కుందనము వంటి మేను మధ్యందినాత
పోష్మహతిఁ గందె, వడ దాఁకె నొప్పులొలుకు
వదన, మస్మద్గృహంబు పావనము సేసి
బడలికలు వాసి చను" మన్న బ్రాహ్మణుండు



"అండజయాన ! నీవొసఁగునట్టి సపర్యలు మాకు నచ్చె, నిం
దుండగ రాదు పోవలయు నూరికి, నింటికి నిప్పుడేను రా
కుండ నొకండు వచ్చి మఱి యొండునె ? భక్తియ చాలు, సత్క్రియా
కాండముఁ దీర్ప వేగ చనఁగావలయుం గరుణింపు నాపయిన్



యేనిఁక నిల్లు సేరుటకు నెద్ది యుపాయము ? మీ మహత్వముల్
మానిని ! దివ్యముల్, మదిఁ దలంచిన నెందును మీకసాధ్యముల్
గానము గానఁ దల్లి, ప్రజలన్ ననుఁ గూర్పు" మటన్న లేఁతన
వ్వా ననసీమఁ దోఁప ధవళాయత లోచన వాని కిట్లనున్



"ఎక్కడి యూరు కాల్ నిలువ కింటికిఁ బోయెద నంచుఁ బల్కె దీ
వక్కట! మీకుటీర నిలయంబులకున్ సరిరాక పోయెనే
యిక్కడి రత్న కందరము, లిక్కడి నందన చందనోత్కరం
బిక్కడి గాంగ సైకతము, లిక్కడి యీలవలీనికుంజముల్



నిక్కము దాఁపనేల ధరణీసురనందన ! యింక నీ పయిం
జిక్కె మనంబు నాకు, నను జిత్తజు బారికి నప్పగించెదో,
చొక్కి మరంద మద్యముల చూఱలఁ బాటలపాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవుఁ బొదరిండ్లను గౌఁగిట గారవించెదో ?"



అనుటయుఁ బ్రవరుండిట్లను
"వనజేక్షణ ! యిట్లు వలుక వరుసయె ? వ్రతులై
దినములు గడపెడు విప్రులఁ
జనునే కామింప ? మది విచారము వలదే !



వేలిమియున్ సురార్చనయు విప్ర సపర్యయుఁ జిక్కె, భుక్తికిన్
వేళ యతిక్రమించె, జననీజనకుల్ కడు వృద్ధు లాఁకటన్
సోలుచుఁ జింతతో నెదురు సూచుచు నుండుదు, రాహితాగ్ని నేఁ
దూలు సమస్త ధర్మములుఁ దొయ్యలి నేఁడిలు సేరకుండినన్"



నావుడు విన్నఁ బాటు వదనంబున నించుక దోఁపఁ బల్కె "నో
భావజరూప ! యిట్టి యెలప్రాయము వైదిక కర్మ నిష్ఠలం
బోవఁగ, నింక భోగములఁ బొందుట యెన్నఁడు ? యజ్ఞకోటులం
బావను లౌటకున్ ఫలము మా కవుఁగిళ్ళ సుఖించుటే కదా !



సద్యోవినిర్భిన్న సారంగ నాభికా -హృతమై పిసాళించు మృగమదంబు
కసటువో బీఱెండఁ గరఁగి కఱ్ఱలనంటి -గమగమ వలచు చొక్కపు జవాజి
పొరలెత్తి ఘనసారతరువులఁ దనుఁ దాన -తొరఁగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూఁబొదల్ గురియంగఁ బటికంపు -దొనల నిండినయట్టి తుహిన జలము

వివిధ కుసుమ కదంబంబు, దివిజ తరుజ
మృదుల వసన ఫలాసవామేయ రత్న
భూషణంబులు గల విందు, భోగపరుఁడ
వయి రమింపుము, ననుఁ గూడి యనుదినంబు



ఎన్ని భవంబులంగలుగు నిక్షుశరాసనసాయక వ్యథా
ఖిన్నత వాడి వత్తలయి, కేలఁ గపోలములూఁది, చూపులన్
విన్న్ఁఅదనంబు తోఁపఁ గనువేఁదుఱునం బయి గాలి సోఁకినన్
వెన్న వలెం గరంగు నలివేణులఁ గౌఁగిటఁ జేర్చు భాగ్యముల్



కుశలతయే వ్రతముల నగు
నశనాయాసమున నింద్రియ నిరోధమునం
గృశుఁడవయి యాత్మ నలచుట
సశరీర స్వర్గ సుఖము సమకొనియుండన్ ?"



అనినఁ బ్రవరుండు "నీ వన్న యర్థమెల్ల
నిజము కాముకుఁడైన వానికి, నకాముఁ
డిది గణించునె జలజాక్షి ! యెఱిగి తేని
నగర మార్గంబుఁ జూపి పుణ్యమునఁ బొమ్ము"



అనిన నత్తెఱవ యక్కఱకఱి పలుకుల కులికి, చంచల దృగంచల ప్రభ లతని ముఖాంబుజంబునం బొలయ, వలయ మణిగణచ్ఛాయా కలాపంబు లుప్పరం బెగయఁ గొప్పు చక్కం జెక్కుచు, గబ్బి గుబ్బలం జొబ్బిల్లు కుంకుమరసంబునం బంకిలంబగు హార ముక్తా తారకంబుల నఖ కోరకంబులన్ గీరి తీరువడం జేయుచుఁ, బతిత వన తరు కుసుమ కేసరంబులు రాల్చు నెపంబునం బయ్యెద విదల్చి చక్క సవరించుచు.... నిట్లనియె



"ఎందే డెందము గందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వృతిం
జెందుం గుంభగత ప్రదీపకళికాశ్రీ దోఁప, నెందెందుఁ బో
కెందే నింద్రియముల్ సుఖంబుఁగను నాయింపే పరబ్రహ్మ 'మా
నందో బ్రహ్మ ' యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా"



అనుచుఁ దన్నొడఁ బఱచు నయ్యమరకాంత
తత్తఱముఁ జూచి, యాత్మ నతండు దనకు
సిగ్గు, వెగటును బొడమ, నిస్పృహతఁ దెలుపు
నొక్క చిఱునవ్వు నవ్వి యయ్యువిద కనియె



"ఈ పాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయినినా వచించెదవు మేలోహో ! త్రయీధర్మముల్
పాపంబుల్, రతిపుణ్యమంచు నిఁక నేలా తర్కముల్ ? మోక్షల
క్ష్మీ పథ్యాగమసూత్ర పంక్తి కివె పో మీ సంప్రదాయార్థముల్



తరుణీ ! రేపును మాపు హవ్యముల చేతం దృప్తుఁడౌ వహ్ని స
త్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు ? నా
కరణుల్ దర్భలు నగ్నులుం బ్రియములైన ట్లన్యముల్గా, వొడల్
తిరమే ? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్"



అనుటయు, మాట లేక హృదయాబ్జము జల్లన, మోము వెల్లనై
కనలుచు, నీరు దేఱు తెలిగన్నుల నాతనిఁ బుల్కు పుల్కు నం
గనుఁగొని, మాటలం బొదవు గద్గదికం దలయూఁచి "యక్కటా
వనిత తనంతఁ దా వలచి వచ్చినఁ జుల్కన గాదె యేరికిన్



వెతలం బెట్టకు మింక న" న్ననుచు నీవీబంధ మూడన్, రయో
ద్ధతి నూర్పుల్ నిగుడన్, వడిన్ విరులు చిందం, గొప్పు వీడం, దనూ
లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతి దీనాస్యయై
రతి సంరంభము మీఱ నిర్జరవధూరత్నంబు పైపాటునన్



ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్ మోవఁగఁ గౌఁగిలించి యధరంబాసింప "హా ! శ్రీహరీ"
యంచున్ బ్రాహ్మణుఁడోరమోమిడి, తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచుం ద్రోచెఁ, గలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్ ?



త్రోపువడి నిలిచి ఘనల
జ్జాపరవశ యగుచుఁ గొప్పు సవరించి, యొడల్
దీపింప నతనిఁ జుఱచుఱఁ
గోపమునం జూచి క్రేఁటు కొనుచుం బలికెన్



"పాటున కింతులోర్తురె కృపారహితాత్మక ! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను" మంచుఁ జూపి, య
ప్పాటల గంధి వేదన నెపం బిడి యేడ్చెఁ గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువందఁగన్



ఈ విధమున నతి కరుణము
గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్
కావిగొన నేడ్చి వెండియు
నా విప్ర కుమారుఁ జూచి యలమటఁ బల్కెన్



"చేసితి జన్నముల్, దపము చేసితి నంటి, దయావిహీనతం
జేసిన పుణ్యముల్ ఫలము సెందునె ? పుణ్యములెన్నియేనియుం
జేసిన వాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి కో
భూసురవర్య ! యింత దలపోయవు నీ చదువేల చెప్పుమా !



వెలివెట్టిరే బాడబులు పరాశరుఁ బట్టి -దాశకన్యా కేళి తప్పుఁ జేసి,
కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి -పట్టికి మేనక చుట్టరికము,
ననుపుకాఁడై వేల్పునాగవాసముఁ గూడి -మహిమ గోల్పడియెనే మాందకర్ణి,
స్వారాజ్య మేలంగనీరైరె సుర లహ-ల్యా జారుఁడైన జంభాసురారి,

వారి కంటెను నీ మహత్వంబు ఘనమె
పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప
కచ్చడాల్ గట్టుకొను ముని మృచ్చులెల్లఁ
దామరసనేత్రలిండ్ల బందాలుగారె !"



అనిన నేమియు ననక యవ్వనజ గంధి
మేన జవ్వాది పస గందంబించు నొడలు
గడిగికొని, వార్చి, ప్రవరుండు గార్హపత్య
వహ్ని నిట్లని పొగడె భావమునఁ దలఁచి



"దాన జపాగ్నిహోత్రపరతంత్రుఁడనేని, భవత్పదాంబుజ
ధ్యానరతుండనేనిఁ, బరదారధనాదులఁ గోరనేని, స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు, మినుండు పశ్చిమాం
బోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా !"



అని స్తుతించిన నగ్ని దేవుండంమహీ దేవు దేహంబున సన్నిహితుండగుటయు నంమహాభాగుండు పావకప్రసాదలబ్ధంబగు పవన జవంబున నిజ మందిరంబున కరిగె.




మను చరిత్ర లోని పద్యాలు

అంకము జేరి శైల తనయా స్తన దుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్‌గబళించ బోయి యా
వంక కుచంబు గాన కహి వల్లభు హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్చెదభీష్ట సిద్ధికై !!

నటా విట గాయక గణికా
చటుల వచోశ్శీధు రసము గ్రోలెడు చెవికిన్
కటువీ శాస్త్రము పొమ్మి
చ్చట నిను చదివింపకున్న జరుగదె మాకున్ !

తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు ప్రార్ధించినన్
గాండ్రల్ గా నటు పల్కి హుంకృతుల బోకాల్మంటి వోహో మదిన్
తీండ్రల్ గల్గిన వారి కెక్కరణినేనిన్ విద్య రాకుండునే
గుండ్రా డాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ కష్ట ముష్టింపచా !!

అట జని కాంచె భూమి సురుడంబర చుంబి శిరశ్శరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
కటక చరత్ కరేణు కర కంపిత సాలము శీత శైలమున్ !!

మృగ మద సౌరభ విభవ
ద్విగుణిత ఘన సార సాంద్ర సార వీటీ గంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుతి వెలసెన్ !!

ఎక్కడి వాడొ! యక్ష తనయేందు జయంత వసంత కంతులన్
జక్క దనంబునన్ గెలువ జాలిన వాడు, మహీసురాన్వయం (!)
బెక్కడ? ఈ తనూవిహవమెక్కడ? ఏలని బంటుగా మరుం
డక్క గొనంగ రాడె, యకటా, నను వీడు పరిగ్రహించినన్

అతడా వాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనా
న్విత మిచ్చోటని చేర బోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్య చక్ర స్తనిన్
నత నాభిన్ నవలా నొకా నొక మరున్నారీ శిరో రత్నమున్ !!

ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ యొంటి జరించెదోట లే
కివ్వన భూమి? భూసురుడ నే ప్రవరాఖ్యుడ ద్రోవ తప్పితిన్
క్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబు జేర నిం
కెవ్విధి గాంతు తెల్ప గదవే తెరువెద్ది శుభంబ నీకగున్ !!

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భుసురేంద్ర యే
కాంతమునన్ జరించు జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
కింత భయంబు లేకడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్ !!

ప్రాంచద్భూషణ బాహు మూల రుచితో పాలిండ్లు పొంగార పై
యంచుల్ మ్రోవగ కౌగలించి యధరం బాసింప హా శ్రీ హరీ
యంచుం బ్రాహ్మణుడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్ ద్రోచె ! కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్ !!

పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక నీవు ద్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొను మంచు చూపి య
ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చె కల స్వనంబునన్
మీటిన గబ్బి గుబ్బ చను మిట్టల నశ్రులు చిందు వొందగాన్ !!

దాన జపాగ్ని హోత్ర పర తంత్రుడ నేని భవత్పదాంబుజ
ధ్యాన రతుండనేని పర దార ధనాదుల గోరనేని స
న్మానము తోడ నన్ను సదనంబున జేర్పుమినుండు పశ్చిమాం
భోనిధి యందు గ్రుంకకయ మున్న రయమ్మున హవ్య వాహనా !!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి