Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, మార్చి 2016, శుక్రవారం

రామాయణం -24

 రామాయణం -24 వ భాగం  ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి.......... " మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతొ కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, వేశ్యలు అలంకరించుకొని రావాలి, వాళ్ళు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి, అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడువైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి " అని అన్నాడు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది. అప్పుడు దశరథుడు......." రామ! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను......నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనన్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దెగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియుక్రోధము. (కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములని వేరొకరి దెగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది, అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళి తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు " నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటె అది నీ పట్టాభిషేకమె, మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసేయ్యని. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయినా యుధాజిత్ దెగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి, నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి, దర్భల(గడ్డి) మీద పడుకో " అని చెప్పి పంపించాడు. దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు( ఉపవాసం అంటె, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాధ్విక ఆహరం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు). అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి