Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, మార్చి 2016, శుక్రవారం

రామాయణం -25

 రామాయణం -25 వ భాగం  ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందని ఆనందంగా ఉన్నారు, అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దెగ్గరకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర(పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో " ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి " అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి " కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జెరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా " అనింది. వెంటనే మంథర కైకేయి దెగ్గరకి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది............. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం | రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి || " నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జెరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలొ ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా " అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది...... " అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో " అని ఒక బహుమతిని ఇచ్చింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి