రామాయణం -23 వ భాగం  ఒకనాడు దశరథుడు,..........నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు(తోకచుక్కలు, గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు.......... ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం | పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా || ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా " దశరథ మహారాజా! మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని, ఏనుగు మీద ఎక్కి, తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి." అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నటుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి, వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేంటంటే.........." కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చుసుకుంటూ, ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవ్వాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే, మీలో ఒక్కరు కూడా.......దశరథా! ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చుసుకున్నావు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా, నా పాలనలో లోపాలు కనబడ్డాయ, నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయ, రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి " అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ............... రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః | సాక్ష్హాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ || " ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకి సత్యము-ధర్మము కావాలి, అన్నిటికీమించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు " అన్నారు. అలాగే, రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది, భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది, ఇంద్రుడికిఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. అలాగే, " రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే, లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు, ఆయన స్నానం చేసి వెంటనే ఎనుగో, రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దెగ్గరికి వచ్చి, ముందు ఆయనే పలకరించి, కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటిముందు నుంచి వెళుతూ, కనపడ్డ వాళ్ళందరిని ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు. అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది, అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి " అని అన్నారు. అలాగే, " ప్రజలు సుఖంగా ఉంటె, తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు (ప్రేమ అంటె = తాను అనుభవించక పోయినా, తనవారు అనుభవిస్తుంటే, వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం). ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి పోయినా కాని, రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమితెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమికానటువంటి వాళ్ళు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ " అన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి