దేశచరిత్ర నిర్మాణములో శాసనముల యంత ఎక్కువగా కాకపోయినను కొంతవరకు ఉపకరించునవి నాణెములు. మనము ఇప్పుడు రూపాయలు మొదలైనవి వాడుక చేయుచున్నట్లే మన పూర్వులుకూడ రకరకము లైన నాణెములను వాడుచుండిరి. వానిలో బంగారపువి, వెండివి, రాగివి మాత్రమేకాక సీసపు నాణెములు, మిశ్రలోహపు నాణెములు కూడ ఉండెను. వీనిలో బంగారపువి, వెండివి చాల తక్కువగా దొరకినవి. మిగిలినవే అధికము. నిర్ణీతమయిన పాళ్ళలో సీసము, రాగి, తుత్తునాగము కలిసిన మిశ్రమమునకే మిశ్రలోహము అని పేరు. ఈ లోహముతో చేసిన నాణెములకు నాణక శాస్త్రజ్ఞులు పోటిన్ నాణెములు అని పేరు పెట్టిరి. ఇవి సాతవాహనులకు తరువాత వాడుకలో నుండినట్లు కనిపించదు. సాధారణముగా సువర్ణములు, నిష్కములు, పురాణములు లేక ధరణములు అనునవి చాల పురాతనమైనవి. మనపూర్వపు నాణెములన్నియు మనుధర్మశాస్త్రములో ఇచ్చిన తూకములను అనుసరించి పుట్టినవి. గురివెందగింజ కాని, రతి కాని తూకమునకు ప్రాతిపదిక. ముప్పది రతుల తూకము గల నాణెము సువర్ణము; కాని అట్టి నాణెములు ఇంత వరకు లభింపలేదు. శాతవాహన, ఇక్ష్వాకు రాజుల కాలమునాటి శాసనములవల్ల ఆకాలములో వెండి పురాణములు, కార్షాపణములు వాడుకలో ఉండినట్లు తెలియుచున్నది. కార్షాపణములు వెండివేకాక రాగివి కూడ ఉండెను. శాతవాహన రాజయిన గౌతమీపుత్ర శాతకర్ణికి పూర్వపు సాతవాహనుల నాణెములు అరుదుగా దొరకినవి. పులోమావి కాలమునుండి దొరకిన నాణెము లసంఖ్యములు; వీనిలో పోటిన్ నాణెములు, సీసపు నాణెములు ఎక్కువ. సాతవాహనుల నాణెములమీద ఒకవైపున గుర్రము. ఏనుగు, సింహము, ఒంటె మొదలైన జంతువుల యొక్కయు, రెండు తెరచాపకొయ్య లున్నట్టి కాని,లేనట్టి కాని పడవల యొక్కయు బొమ్మలును, వానిపై నాణెముల అంచున ఆ నాణెములను ముద్రకొట్టించిన రాజులపేర్లును ఉండును. రెండవ వైపున ఉజ్జయినీ చిహ్న ముండును.సంకలనపు గుర్తుకొమ్ములకు (+) చివరలను అంటి నాలుగువైపుల నాలుగు సున్న లుండు దానికే ఉజ్జయినీచిహ్న మనిపేరు. నావ చిహ్నముగాగల నాణెములు సాతవాహనుల సముద్రాధి పత్యమునకును, నౌకావర్తక వ్యాపారాధిక్యమునకును నిదర్శనములు. హిందూదేశ మంతటిలోను మొదట సముద్రాధిపత్యము వహించినవారు సాతవాహనులు. సాతవాహనుల కాలములో తెలుగుదేశమునకును, రోము నగరమునకును వర్తకవ్యాపారము బాగుగా సాగుచుండుటచేత రోమకచక్రవర్తుల బంగారు నాణెములు ఇచ్చి వర్తకులు ఇచ్చటి మల్లు సెల్లాలు క్రయము చేసి కొని పోవుచుండిరి. ఈ కారణమున తెలుగుదేశములో ప్రత్తి పైరగు ప్రాంతము లందు రోమకచక్రవర్తుల నాణెములు దొరకినవి. నాగార్జునునికొండ శాసనములలో దీనార మాషకము లనబడు నాణెములుకూడ ఉదాహృతములైనవి. దీనార మన్నది విదేశీయ నాణకము.
అటుతరువాత వాడుకలోనికి వచ్చిన బంగారు నాణెముల మీద వరాహముద్ర ఉండుటచేత వీనికి వరాహములని పేరు కలిగినది. ఇదియే ప్రజల వాడుకలో కాలక్రమమున వరహా యైనది. వీనికే గద్వాణము లనియు పేరు. వరాహము చాళుక్యరాజ లాంఛనము. అందువలన ఈ నాణెములను వాడుకలోనికి తెచ్చినవారు చాళుక్యులని భావింపబడుచిన్నది. పూర్వ చాళుక్యుల రాగి నాణెములును దొరకినవి. వీరికి పూర్వులయిన శాలంకాయన, విష్ణుకుండి వంశజుల నాణెము లింతవరకు దొరకినవి చాలకొద్ది. చాళుక్య చంద్ర బిరుదముగల పూర్వ చాళుక్య ప్రథమ శక్తివర్మ యొక్కయు, రాజరాజనరేంద్రుని యొక్కయు బంగారు నాణెములు బర్మా ఆరకాన్ ప్రాంతముల దొరకినవి.
దక్షిణ హిందూదేశపు నాణెములమీద పూర్వపు రాజులు తమపేర్లనో బిరుదములనో ముద్ర కొట్టించువారు. ఇటువంటి నాణెములు ఇంతవరకు చాల దొరకినవి; కాని వానిమీది బిరుదములను బట్టి అవి చలామణిలోనికి తెచ్చిన రాజును, రాజవంశమును గుర్తింప గుదిరినవి చాల తక్కువ.
శాసనములలో ఉదాహృతములైన గండగోపాలమాడలు ఇట్టివే. గండగోపాల బిరుదము తెలుగు చోళులకు ఉండుటవలన ఈ మాడలు వారివే కావచ్చును. మాడలు, వెండి టంకములు, పణములు, బిరుదుమాడలు, పద్మటంకములు మొదలైనవి, వేరు వేరు రకముల నాణెములు శాసనములలో ఉదాహృతమయినవి; కాని అవి ఎట్టివో, ఎవరు ముద్రించినవో ఈ విషయము లేవియు తెలియవు. ఏవేవో నాణెములు దొరకినను, అవి ఫలాని వారివని నిర్ధారణచేయుట కూడ కష్టముగ నున్నది. పద్మటంకములలో కొన్ని నెల్లూరు తెలుగు చోళులవి కలవు.
కాకతీయుల బంగారు, వెండి, రాగి నాణెములు కలవు. రాగి నాణెముమీద ఒకప్రక్క నంది ప్రతిమ కలదు; రెండవప్రక్క నాగరి అక్షరములతో 'కాకతి ప్రతాప రా...య' అని కాకతి ప్రతాపరుద్ర నామము ముద్రితమైనది. కాకతీయుల కాలపు పణములు ఏడు ధాన్యపు గింజల ఎత్తు గలవి. గణిత శాస్త్రములో ప్రతాపమాడ, టంకము పేర్కొనబడినది. ప్రతాప మాడకు చవిలెలు నాలుగు. పండ్రెండు దమ్మము లొక చవిలె. టంకమునకును చవిలెలు నాలుగే. అందువలన మాడయు, టంకమును ఒకటే కావలెను.
విజయనగర రాజుల నాణెములమీది శాసనములు నాగరిలిపిలో ఉన్నవి. కృష్ణదేవరాయల బంగారు నాణెములు పరిమాణములో చిన్నవి. కృష్ణదేవరాయల కాలములో విజయనగర సామ్రాజ్యమున వేరు వేరు విలువలు గల నాణెములు వాడుకలో ఉండినట్లు విదేశ యాత్రికుల యొక్కయు, వ్యాపారుల యొక్కయు వృత్తాంతముల ననుసరించి తెలియుచున్నది.
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి