Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

దేశీయమువంశ చరిత్రలు - గేయ కథాదులుస్థానిక చరిత్రలుముస్లిము చరిత్రలువిదేశీయము దేశీయము

దేశీయమువంశ చరిత్రలు - గేయ కథాదులుస్థానిక చరిత్రలుముస్లిము చరిత్రలువిదేశీయము
దేశీయము

శాసనములకు, నాణెములకు తరువాత పేర్కొనదగినది గ్రంథ సామగ్రి. మన చరిత్ర పునర్నిర్మాణమునకు ఉపయుక్తమైన గ్రంథములు చీనా, అరబీ, పార్సీ మున్నగు ఆసియా భాషలలోను, గ్రీకు, ఇటాలియను, పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషు మొదలగు ఐరోపీయ భాషలలోను గలవు. వివరణ సౌకర్యార్థము వీనిని సారస్వతాత్మకము లనియు, చరిత్రాత్మకము లనియు రెండు తరగతులుగా విభజింప వచ్చును.

సారస్వతరచనల ముఖ్యోద్దేశము భాషావిషయక మైనను, చరిత్ర పరిశోధకులకు అవి ఉపయుక్తములగు చున్నవి. మన ప్రాచీన వాఙ్మయ మంతయు రాజాశ్రయమున అభివృద్ధినందినది. రాజులే కాక వారికి అరిగాపులైన సామంతులును, వారిని కొలిచి యుండిన మంత్రి దండనాయకాదులును కవులను, పండితులను తమ యాస్థానములకు రప్పించి వారిని సత్కరించి గ్రాసవాసాదులకు తగు ఏర్పాటులను కావించి గ్రంథరచనకు ప్రోత్సహించి గ్రంథములను అంకితము గొనువారు. గ్రంథకర్తలు, తాము విరచించు గ్రంథములలో తమ్ము పోషించు ప్రభువులను ప్రశంసించుట వాడుకయైనది. ఆ ప్రశంసలలో వారు ఆ ప్రభువుల యొక్కయు, వారి పూర్వుల యొక్కయు ఘనకార్యములను ప్రశంసించువారు. తన్మూలమున ఆ ప్రభువుల పూర్వచరిత్రయే కాక అనుషంగికముగ కొంతవరకు దేశచరిత్రయు తెలియవచ్చుచున్నది. ఉదాహరణము కొరకు రెండు మూడు గ్రంథములను ఇచట పేర్కొనుట యుక్తము.

కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవియైన విద్యానాథ మహాకవి 'ప్రతాపరుద్రయశోభూషణము' అను అలంకార గ్రంథమును ఆ రాజునకు అంకితమిచ్చి యున్నాడు. అందు నాటక ప్రకరణమున ప్రతాపరుద్రుని చరిత్రయే ఇతివృత్తముగ గల నాటకము ఒకటి గలదు. దాని మూలమున కొన్ని చరిత్రాంశములు తెలియవచ్చును.

క్రీ. శ. 1378 మొదలు క్రీ. శ. 1404 వరకును విజయనగర సామ్రాజ్యమును పాలించిన రెండవ హరిహర రాయల పుత్రుడును, యౌవరాజ్య పట్టభద్రుడునునైన ఇమ్మడి బుక్కరాయల యొక్క కొలువునందు లక్ష్మణాచార్యుడు అను ఒక భిషగ్వర్యుడు ఉండెను. ఇతడు 'వైద్యరాజ వల్లభము' అను ఒక వైద్యశాస్త్ర గ్రంథమును రచించెను. ఆ గ్రంథ పీఠికలో తనకు ఆశ్రయుడైన ఇమ్మడి బుక్కరాయల ప్రతాపమును తెలుపుటకొరకు అతని దిగ్విజయములను వర్ణించినాడు. అందువలన అన్యత్ర తెలియరాని చరిత్రాంశములు తెలియుచున్నవి.

కృష్ణరాయల నగరి సంగీత విద్వాంసుడైన బండారు లక్ష్మీనారాయణ యను నతడు 'సంగీత సూర్యోదయ' మను శాస్త్ర గ్రంథమును వ్రాసెను. ఆ గ్రంథ పీఠికలో అతడు కృష్ణరాయల కళింగ జైత్రయాత్రనే కాక మరి యే దేశీయ రచనలలోను కానరాని రాయచూరు దండయాత్రను కూడ అభివర్ణించి యున్నాడు.

సంస్కృత గ్రంథములకంటె ఆంధ్ర గ్రంథములు చరిత్రకారునికి అత్యంతోపయుక్తములై ఉన్నవి. మనకు తెలియ వచ్చునంత వరకు ఆంధ్ర కృతులలో కృతిపతి వంశమును వర్ణించు ఆచారము తిక్కన సోమయాజి కాలమున ప్రారంభమైన ట్లున్నది. తిక్కన తన 'నిర్వచనోత్తర రామాయణ' పీఠికయందు కృతిపతియైన మనుమసిద్ధికి పూర్వులైన నెల్లూరుశాఖ తెలుగు చోళరాజుల వంశచరిత్రను కీర్తించియున్నాడు. శ్రీనాథుడు తన కాశీఖండమున రెడ్డిరాజుల ఘనకార్యములను పేర్కొనియున్నాడు. ఇట్లే తక్కిన ప్రబంధ కర్తలు తమ కృతిపతుల వంశ చరిత్రలను వివరించి యున్నారు.

ఇవి కాక చరిత్రకు ఉపయుక్తములగు విషయములను తెల్పు మరియొక తరగతి గ్రంథములు కలవు. ఇవి చారిత్రాత్మక వ్యక్తులకు కాని, వంశములకు కాని సంబంధించినవి కావు. రాజకీయవిశేషములు కాని, పరాక్రమ ప్రశంసలు కాని వానియందు కన్పట్టవు. వానియందు ప్రాయికముగ పట్టణవాసుల జీవనవిశేషములు వర్ణింపబడి యుండును. ఈ తరగతి గ్రంథములలో మొదట పేర్కొన దగినది విజయనగరాధీశ్వరుడైన రెండవ హరిహర రాయల యొక్క కొలువులో ఉండిన వినుకొండ వల్లభరాయలు రచించిన 'క్రీడాభిరామము.' ఇది రావిపాటి త్రిపురాంతక కృతమైన 'ప్రేమాభిరామము' అను సంస్కృత వీథినాటకమునకు తెలుగుసేత. నేటివరకు 'ప్రేమాభిరామము' లభ్యపడలేదు. క్రీడాభిరామములో కాకతీయ ప్రతాపరుద్రుని కాలములో ఓరుగంటిపట్టణము యొక్క వైభవమును, తద్వాస్తవ్యుల స్థితిగతులును వర్ణింపబడియున్నవి. అట్లే, వామన భట్టబాణ కృత 'శృంగారమంజరీ భాణము'ను, డిండిమ కృత 'సోమవల్లీ యోగానంద ప్రహసనము'ను క్రీ. శ. 13, 14 శతాబ్దములనాటి విజయనగరపట్టణ చరిత్ర విశేషములను తెలియజేయును. ఇట్టి గ్రంథముల సంఖ్య యల్పము.

మన సారస్వతములో చరిత్రాధారములుగ ఉపయుక్తములగు మరియొక తరగతి గ్రంథములు కలవు. ఇవి అభ్యుదయ కావ్యములు. ఇందు మహాపురుషుల ఘనకార్యములు వర్ణింపబడును. బిల్హణుని 'విక్రమాంకదేవ చరిత్ర', గంగాదేవి రచించిన 'కంపరాయ చరిత్ర', డిండిముని 'సాళువాభ్యుదయ, అచ్యుతరా యాభ్యుదయము'లు, రామభద్రాంబ రచించిన 'రఘునాథాభ్యుదయము' మున్నగునవి ఈ తరగతిలోని ముఖ్య గ్రంథములు.

అభ్యుదయ కావ్యములు కాక పోయినను, ఆ జాతిలో చేర్పదగినవి మరికొన్ని గ్రంథములు కలవు. కాసె సర్వప్ప అను నతడు 'సిద్ధేశ్వర చరిత్రము' అను నామాంతరము గల 'ప్రతాపచరిత్ర'ను ద్విపద కావ్యముగ రచించెను. కూచిమంచి జగ్గకవికృత 'సోమదేవరాజీయము' అను పద్యకావ్యమును, అజ్ఞానకర్తృకమైన 'ప్రతాపచరిత్ర' అను వచన రచనయు దీని ననుసరించి విరచింపబడినవే. వీనినే కాక కొటికము విశ్వనాథనాయని స్థానాపతి రచించిన 'రాయవాచకము'ను కూడ ఇచట స్మరింపవలసి యున్నది. దీనినే కుమారధూర్జటి 'కృష్ణరాయ విజయము' అనుపేర పద్యకావ్యము చేసెను. ఇందు మొదటి మూడును కాకతీయుల చరిత్రకు సంబంధించినవి. తరువాతి రెండును కృష్ణదేవరాయల విజయములను, రాజ్యపరిపాలనను వర్ణించును. ఇటువంటిదే దిట్టకవి నారాయణకవి విరచిత 'రంగరాయచరిత్ర'. ఇందు క్రీ. శ. 1757లో విజయరామరాజునకును రంగారాయనికిని జరిగిన బొబ్

వంశ చరిత్రలు - గేయ కథాదులు

తెనుగున కొన్ని వంశావళులు గలవు. వీనిలో ప్రథమమున పేర్కొన దగినది ఆరవీటి వంశశాఖలలో నొక్కటియగు అవుకురాజుల వంశావళి. ఇది యొక స్వతంత్ర గ్రంథము కాదు; దోనేరు కోనేరు నాథకవి రచించిన 'ద్విపద బాల భాగవతము'నకు అనుబంధముగ తత్కృతిపతియైన అవుకు తిమ్మరాజు పూర్వీకుల చరిత్ర ఇందు అభివర్ణింప బడినది. ఆరవీటి వంశచరిత్రను వర్ణించు పద్యకావ్యము ఒకటి కలదు. ఇది అందుగుల వెంకయ్యచేత రచియింప బడిన 'రామరాజీయము'. దీనికే 'నరపతి విజయ' మని నామాంతరము. వంశావళులలో సుప్రసిద్ధమైనది 'వెలుగోటివారి వంశావళి'. ఇది కాలక్రమమున పెరిగినది. కాకతీయ గణపతిదేవుని కాలమునుండియు విజయనగర సామ్రాజ్యాధిపతులలో కడపటి వాడైన ముమ్మడి శ్రీరంగరాయల కాలమువరకు వర్ధిల్లిన రేచర్లగోత్రజు లైన వెలమనాయకుల ప్రతాపాదికములు ఇందు ప్రశంసింపబడి యున్నవి. ఇట్టి వంశావళి గ్రంథములు కన్నడమునను కలవు. 'చిక్కదేవరాయ వంశావళి', 'కెళదినృప విజయము'లు వీనిలో ప్రధానమైనవి. రెంటియందును విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించిన చరిత్రాంశము లనేకము వర్ణింపబడి యున్నవి.

వంశావళులవలె ప్రత్యేక చరిత్రాంశములను వర్ణించు గేయ ప్రబంధములును, సీసమాలికలును అనేకములు ప్రచారములో నున్నవి. పల్నాటి వీరచరిత్ర, బొబ్బిలి కథ, కుమారరాముని కథ, గనితిమ్మానాయని సీసమాలిక, కస్తూరి రంగప్పనాయని సీసమాలిక, ఏచమనాయని సీసమాలిక, దేసూరిరెడ్ల సీసమాలిక మున్నగునవి ఇట్టివి.

స్థానిక చరిత్రలు

ఆంధ్రదేశ చరిత్రాధారములను పేర్కొనునపుడు స్థానిక చరిత్రములును స్మరింపవలసి యున్నది. వీనికి గ్రామ కైఫియతులని పేరు. గ్రామ కైఫియతు లనగా గ్రామ చరిత్రలు. పూర్వకాలములో ప్రతి గ్రామ కరణమును తన గ్రామముయొక్క పుట్టు పూర్వోత్తరములను, ఆస్తి పాస్తులను, పన్ను పర్యాయములను వివరించుచు గుడికట్టు లెక్కలు వ్రాసిపెట్టుట ఆచారమై యుండెను. వానిలో గ్రామములోని భూమిపై ఎవ్వరెవ్వరికి ఎట్టి స్వామ్యపు హక్కులు కల్గినది వ్రాసిపెట్టు వారు. కాలక్రమమున రాజకీయములందు కలుగుచు వచ్చిన మార్పులును, తత్ప్రభావమువలన గ్రామజీవనమున కల్గిన మార్పులును అందు సూచించువారు. కావున ఇతర చరిత్రాధారములలో కానరానివి, జనానీకముయొక్క రాజకీయార్థిక సాంఘిక విషయములకు సంబంధించిన ముఖ్యాంశములు అనేకము ఈ కైఫియతులలో కానవచ్చును. తత్కారణమున ఈ గ్రామ కైఫియతులు చరిత్ర పరిశోధకులకు మిక్కిలి ఉపయోగించుచున్నవి.

క్రీ. శ. 1799, 1800 ప్రాంతమున కల్నల్‌ కాలిన్‌ మెకంజీ యను కుంఫిణీ యుద్యోగి కావలి వెంకటబొర్రయ్య మొదలైన వారిని కొందరిని నియోగించి ఈ గ్రామ చరిత్రలకు నకళ్లు వ్రాయించెను. వీనికి మెకంజీ రికార్డు లని పేరు. సి. పి. బ్రౌన్‌ దొర వీటికి ప్రతులు వ్రాయించెను. వీనిని స్థానిక చరిత్ర లందురు. ఈ చరిత్రలు అరవములోను, కన్నడములోను, తెలుగులోను కూడ ఉన్నవి. తెలుగులో ఉన్నవి అధికము. ఈ చరిత్రలలో రాయలసీమకు చెందినవి అమూల్య మయినవి. వానివల్ల ఇతరములయిన ఏ యాధారములవల్లను తెలియని చారిత్రక విషయము లనేకము తెలియవచ్చును. ఇవి ముఖ్యముగా విజయనగర యుగమునుండి బ్రిటీషు యుగమువరకు గల మనదేశ చరిత్రమును రచించుకొనుటకు అధికముగా ఉపకరించును.

ఇంతవరకు దేశభాషలలోని యాధారములు వివరింప బడినవి; కాని యవి యన్నియు చరిత్ర రచన కుపకరించు సాధనములే కాని చరిత్రలు కావు. మన పూర్వులకు చరిత్ర దృష్టి లేదు; కావున వారు చరిత్రలను వ్రాయుటకు పూనుకొనలేదు. కల్హణుని రాజతరంగిణి ఒక్కటి తక్క సంస్కృతమునందు కాని, ఇతర దేశ భాషలందు కాని చరిత్ర గ్రంథములు లేవు. సంస్కృత భాషలో ఉన్న పురాణములవల్ల కొంత ఇతిహాసము తెలియవచ్చును. కాని, అది యంతయు చారిత్రకాధారములు దొరకని చరిత్ర పూర్వయుగమునకు సంబంధించినవి. ప్రత్యేకముగా చరిత్రకారునికి ఉపయుక్తమయినది పురాణములలోని భవిష్యద్రాజేతిహాసము. దీనివల్లనే మనదేశమును ఆదిమ కాలములో పరిపాలించిన ఆంధ్రరాజులను గురించి తెలియ నగుచున్నది.


ముస్లిము చరిత్రలు

హిందూదేశమునందు చరిత్ర రచన మహమ్మదీయుల ఆగమనముతో ప్రారంభమయినది. మహమ్మదీయులకు చరిత్రాభిమానము మెండు; కావున వారు మొదటినుండియు చరిత్ర రచనకు పూనుకొని పెక్కు చరిత్ర గ్రంథములను రచించిరి; కాని అవి దేశ చరిత్రలు కావు; అవి యన్నియు మహమ్మదీయ రాజ్యముల యొక్కయు, మహమ్మదీయ రాజవంశముల యొక్కయు చరిత్రములు. కావున వానియందు ఆ రాజ్యములకును రాజవంశములకును సంబంధించిన విషయములు మాత్రమే వర్ణింపబడినవి. వానిలో దేశ ప్రజలనుగూర్చి కాని, హిందూ రాజ్యములను గూర్చికాని ప్రస్తావము ఉండదు. మరియు మతాభిమానము పెంపున మహమ్మదీయ చరిత్రకారులు హిందువులనుగూర్చి కాని, హిందూ రాజ్యములనుగూర్చి కాని విధిలేక చెప్పవలసివచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పక, సత్యమును కప్పిపుచ్చి, తమ యాధిక్యమును స్థాపించుకొనుటకు విషయమును తారుమారు చేసి చెప్పుదురు; కావున ఆధునిక దృష్టితో దేశ చరిత్రము రచియించునప్పుడు వానియందలి విషయములను చక్కగ పరిశీలించి కైకొనుట యుక్తము. క్రీ. శ. 14 శతాబ్ద ప్రారంభమునుండియు దక్షిణ భారతమున మహమ్మదీయుల ప్రాబల్యము అధికము కాజొచ్చినది. అప్పటినుండియే మహమ్మదీయ చరిత్రలలో దక్షిణ హిందూ రాజ్యముల ప్రస్తావము కానవచ్చును. ఈ చరిత్రలలో సమకాలిక రచనములును, అర్వాచీన రచనములును కలవు.

మహమ్మదీయ చరిత్రకారులలో ప్రప్రథమమున పేర్కొనదగినవాడు అమీరు ఖుస్రూ. ఇతడు బహు మేధావి; మహాకవి, సంగీత విద్వాంసుడు. ఇతడు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాలమునుండి ఘియ్యాజుద్దీన్‌ తుఘ్లకు కాలము పర్యంతము ఢిల్లీ సుల్తానుల యాశ్రయమున వర్ధిల్లి పారశీక భాషలో పెక్కు కావ్యములను రచించుటయే కాక 'తారీఖ్‌-ఇ-ఆలై' అను నామాంతరము గల 'ఖజైన్‌-ఉల్‌-ఫుతూహ్‌', 'తుఘ్లక్‌ నామా' యను చరిత్రలను వ్రాసెను. ఇందు మొదటిది వచన రచన. అందే అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ యొక్క యాంధ్రదేశ దండయాత్రలును, తక్కిన దక్షిణ దిగ్విజయములును వర్ణింపబడినవి. ఈ చరిత్ర గ్రంథమునందే కాక అతనిచే విరచితమైన 'ఖిజ్ర్‌ఖాన్‌ వ దవల్‌ రాణీ', 'నూ సిపిహ్ర్‌' అను కావ్యములలోను ఖిల్జీ సుల్తానుల దక్షిణ దిగ్విజయములు అందందు సందర్భానుసారముగ వర్ణింపబడినవి.

ఇతని తరువాత చెప్పదగినవాడు ఈసామీ. ఇతడు బాల్యమున ముహమ్మద్‌ బిన్‌ తుఘ్లకు ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాదుకు మార్చినపుడు దక్కనుకు వచ్చి యచ్చటనే స్థిరముగ నిలిచిపోయెను. ముహమ్మదు బిన్‌ తుఘ్లకుపై దక్షిణదేశములవారు తిరుగుబాటు కావించి స్వతంత్ర రాజ్యములు స్థాపించుకొనినపుడు ఇతడు దక్కనునందే యుండి, అచట అపుడు నడచిన చరిత్రాంశములను ప్రత్యక్షముగ చూచెను. క్రీ. శ. 1347 లో స్వతంత్రుడై గుల్బరగ రాజధానిగ బహమనీరాజ్యమును స్థాపించిన అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూ బహ్మన్‌షాను ఆశ్రయించి అతని యాదర గౌరవములకు పాత్రుడై క్రీ. శ. 1349 వ సంవత్సరమున, 'ఫుతూహ్‌-ఉస్‌-సలాతీ' నను ఉత్తమోత్తమ పద్యచరిత్ర గ్రంథమును రచించి అతనికి అంకితమొసగెను. ఇతని చరిత్రలో ఒక యాంధ్రదేశమునందే కాక దక్షిణ భారతమున నడచిన చరిత్రాంశములు విపులముగ వర్ణితము లైనవి. ఇతడు మహమ్మదీయ చరిత్రకారు లందరిలో గరిష్ఠుడు. ఇతడు గాఢ మతాభిమానము గలవాడైనను సత్యముమీదనే దృష్టి అధికముగ కలవాడు. కావున ఇతడు రచించిన చరిత్ర అత్యంతము విశ్వాసపాత్రమైనది.

ఈసామీకి సమకాలికుడు జియా ఉద్దీ\న్‌ బరనీ అను మహమ్మదీయ చరిత్రకారుడు మరియొక డుండెను. ఇతడు మహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఆస్థానమున ఉండెను. మొట్ట మొదటినుండి ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు పర్యంతము ఢిల్లీని పాలించిన మహమ్మదీయరాజుల చరిత్రను ఇతడు 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను గ్రంథమున వివరించెను. బరనీకి మతాభిమానముతోపాటు జాత్యభిమానముగూడ గాఢమైనందువలన ఇతడు రచించిన చరిత్ర ఈసామీ గ్రంథమువలె పక్షపాతరహితమైనది కాదు. హిందువుల యెడలను, మహమ్మదీయమతము నవలంబించిన భారతీయుల యెడలను ఇతడు ద్వేషముకలవాడై సందర్భము చిక్కినపుడెల్ల వారిని దూరుచుండును. కావున ఇతని యభిప్రాయములను పరిశీలించి చూచి కైకొనుట యుక్తము.

బరనీ వలెనే 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను పేరుగల చరిత్రను వ్రాసిన చరిత్రకారుడు మరియొకడు కలడు. ఇతని పేరు షమ్స్‌-ఇ-సిరాజ్‌ ఆఫీఫ్‌. ఇతని చరిత్ర బరనీ గ్రంథమంత ఉపయుక్తమైనది కాదు; కాని ఇందు మరియెచ్చటను కానరాని చరిత్రాంశములు కొన్ని కలవు.

ఇతనితరువాత పేర్కొన దగినవాడు నిజామ్‌ ఉద్దీన్‌ అహమద్‌ బఖ్షి. ఇతడు ఢిల్లీయందు అక్బరుపాదుషా యాస్థానమునం దుండెను. ఇతడు చరిత్ర రచనయం దొక క్రొత్త దారిని తొక్కెను. పూర్వులగు భారతీయ మహమ్మదీయ చరిత్రకారులవలె ఢిల్లీ సుల్తానుల చరిత్రతో తృప్తి నొందక బంగాళ, మాళవ, గుజరాతు, దక్కను ప్రాంతములలో స్వతంత్రరాజ్యములను స్థాపించి పరిపాలించిన మహమ్మదీయ రాజవృత్తాంతములను కూడ వర్ణించి యున్నాడు. నేటివరకు లభ్యమైన బహ్మనీ మొదలగు దక్కను మహమ్మదీయ రాజవంశ చరిత్రలలో నెల్ల నిజాముద్దీ\న్‌ అహమదుచే విరచితమైన 'తబకాత్‌-ఇ-అక్బరీ' లోని గ్రంథభాగమే ప్రాచీనతమ మైనది. అర్వాచీన మహమ్మదీయ చరిత్రకారులలో పెక్కండ్రు నిజామ్‌ ఉద్దీ\న్‌ అహమదు మార్గమును అవలంబించి విపులమైన చరిత్రలను రచించిరి. కాని మహమ్మదీయ చరిత్రలలో నిజామ్‌ ఉద్దీ\న్‌ రచనకు కొంత ప్రత్యేకత కలదు.

నిజామ్‌ ఉద్దీ\న్‌ యొక్క పద్ధతి ననుసరించి చరిత్రను వ్రాసిన రచయితలలోనెల్ల ముహమ్మదు కాసిం హిందూషా ఫెరిస్తా సుప్రసిద్ధుడు. ఇతడు హిందూదేశమునందు మహమ్మదీయుల అభ్యుదయమును వర్ణించుచు ఒకగొప్ప చరిత్ర గ్రంథమును వ్రాసెను. ఇది 'తారీఖ్‌-ఇ-ఫెరిస్తా' అనుపేర వాసికెక్కినది. ఫెరిస్తా దక్కను వాస్తవ్యుడు; మొదట నిజాంశాహి సంస్థానమును ఆశ్రయించి కొంత కాలము అతడు అహమదునగరమున నివసించి యుండెను. తరువాత అతడు విజాపురమునకు వచ్చి అచట ఆదిల్‌ శాహి ప్రభువులను ఆశ్రయించి వారి యనుగ్రహమునకు పాత్రుడై చరిత్ర రచన సాగించెను. భరతఖండమునందు ప్రభుత్వము సల్పిన మహమ్మదీయ రాజవంశము లన్నింటి వృత్తాంతమును ఫెరిస్తా తాను రచించిన చరిత్రమున వర్ణించి యున్నను దక్కను రాజవంశములను, అందును ముఖ్యముగ బహ్మనీ, ఆదిల్‌శాహీ, నిజామ్‌శాహీలను గూర్చి విస్తరించి చెప్పుట వలన అది దక్కను మహమ్మదీయ రాజ్యముల చరిత్రగనే ప్రసిద్ధిచెందినది; కాని ఫెరిస్తాకు స్వమతాభిమానముతో కూడ తనకు ఆశ్రయ మొసగిన ఆదిల్‌శాహీలపై ఆదర మధికమగుటవలన అతడు తరచుగా చరిత్రాంశములను విడిచిపెట్టియు, తారుమారు చేసియు సత్యమును కప్పిపుచ్చి యున్నాడు; కావున అతని చరిత్ర విశ్వాసపాత్రమైనది కాదు. అతని వ్రాతల లోని విషయములు ఇతర చరిత్రాధారములవల్ల రుజువైన కాని అంగీకార్యములు కావు.

ఫెరిస్తా అనంతరము వెలసిన మహమ్మదీయ చరిత్ర కారులలోనెల్ల ఖాఫీఖాను ముఖ్యుడు. ఖాఫీ యనునది అతని వాస్తవ నామము కాదు. అతడు మొగలాయి చక్రవర్తియగు ఔరంగజేబు కొలువులోని యుద్యోగి. ఆ చక్రవర్తి తన చరిత్ర ఎవ్వరును వ్రాయగూడదని శాసింపగా ఇతడు తాను రచించిన చరిత్రను గుప్తముగ దాచియుంచెను. తత్కారణముగ ఇతనికి (ఖాఫీ) దాచి పెట్టిన ఖానుడని పేరు కల్గెనని చెప్పుదురు. ఇతడు తనకు ముందు నడచిన చరిత్రను పూర్వచరిత్రలను ఆధారపరచుకొని వ్రాసెను. దక్కను విషయమున ఇతడు ఫెరిస్తా చరిత్రను అనుసరించినను అందందు ఫెరిస్తా వ్రాతకు విరుద్ధములైన అన్యగ్రంథములలోని చరిత్రాంశములను ఉదాహరించి యున్నాడు. తన కాలమున జరిగిన చరిత్రను మతాభిమాన దృష్టితో కాక యథాతథముగ వర్ణించి సత్యమును తెలిపి యున్నాడు. కావున ఇతని రచన అత్యంతము విశ్వాసపాత్రమని ఆధునిక చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

పైన చెప్పిన వారివలె హిందూస్థాన చరిత్రలను వ్రాయక మరికొందరు మహమ్మదీయ చరిత్రకారులు ప్రాంతీయ మహమ్మదీయ రాజ్యములనుగూర్చి గ్రంథములను వ్రాసిరి. వారిలో ముఖ్యుడు సయ్యద్‌ ఆలీ తబాతబా అను నతడు. ఇతడు నిజామ్‌శాహి సంస్థానమును ఆశ్రయించుకొని రెండవ బుర్హా\న్‌ నిజామ్‌శాహి కాలములో అహమదు నగరమునందు నివసించుచు బహ్మనీ సుల్తానులను గూర్చియు, నిజాంశాహి వంశజులను గూర్చియు 'బుర్హా\న్‌-ఇ-మ అసీ'రను చరిత్ర గ్రంథమును వ్రాసి ప్రకటించెను. సయ్యద్‌ ఆలీ తబాతబా ఫెరిస్తాకు సమకాలీనుడు. హిందువులపై ద్వేషమునందు ఇతడు ఫెరిస్తాకు పైమెట్టు; కాని ఫెరిస్తా గ్రంథము కంటె ఇతనిదే విశ్వాసపాత్రమని చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

ఇట్లే ఆదిల్‌శాహి, కుతుబ్‌శాహి వంశ చరిత్రలను వర్ణించిన రచయితలును కలరు. ఇబ్రాహీం ౙబీరీ యను నతడు 'బుసాతీన్‌-ఉస్‌-సలాతీన్‌' అను గ్రంథమునను ౙహూర్‌ ౙహూరీ యను నతడు 'ముహమ్మద్‌ నామా' యందును విజాపుర సుల్తానుల చరిత్రమును వర్ణించి యున్నారు. అజ్ఞాతనామధేయుడగు చరిత్రకారు డొకడు 'తారీఖ్‌-ఇ-ముహమ్మద్‌ కుల్లీ కుతుబ్‌శాహి' అను గ్రంథమున కుతుబ్‌శాహీల చరిత్రమును వర్ణించి యున్నాడు. మరియొకడు 'హదీకత్‌-ఉల్‌-ఆలమ్‌' అను గ్రంథమున ఈ వంశజుల చరిత్రమును కడపటి కుతుబ్‌శాహి సుల్తానగు తానాశాహ పతనమువరకును వివరించి యున్నాడు. ఈ మహమ్మదీయ చరిత్రలయం దాయా రాజ్యములను ఏలిన సుల్తానుల చరిత్రలే కాక ఇరుగు పొరుగుల తెలుగు రాజ్యములకు సంబంధించిన విషయములును ప్రస్తావవశమున వర్ణింపబడి యుండుట వలన ఇవి తెలుగుదేశ ప్రాచీన చరిత్ర రచనకు మిక్కిలి ఉపయుక్తము లగు చున్నవి.


విదేశీయము

చిరకాలమునుండియు భారతదేశమునకు ఖండాంతర పూర్వ పాశ్చాత్యదేశములతో సంబంధము కలదు. మత ప్రచారమునకై కొందరును, పుణ్యతీర్థ దర్శనార్థము కొందరును, వ్యాపారార్థము కొందరును, దేశాటనాపేక్షచే కొందరును దేశాంతరములనుండి వచ్చువారు. అట్లు వచ్చిన వారిలో పెక్కండ్రు తాము భరతఖండమునందు అనేక స్థలములలో కన్న విన్న విషయములను తమ పర్యాటన గ్రంథములలో వ్రాసియుంచిరి.

బౌద్ధమతము భరత ఖండమునందు ప్రబలియుండిన కాలమున చీనా మొదలయిన తూర్పు దేశములనుండి యాత్రికు లనేకులు పుణ్యక్షేత్రములను సందర్శించుటకును, బౌద్ధమత గ్రంథములను సంగ్రహించుకొని పోవుటకును వచ్చెడివారు. వారిలో ఫాహియాను, యువా\న్‌ చ్వాంగు లను వారు ముఖ్యులు. ఫాహియాను దక్షిణదేశమునకు రాలేదు; కాని అతడు దక్షిణ హిందూస్థానమును గూర్చి, ముఖ్యముగ పారావత విహారమును గూర్చి, తాను విన్న విషయములను తన పర్యటన గ్రంథమున వివరించి యున్నాడు. ఫాహియానువలెగాక యువా\న్‌ చ్వాంగు దక్షిణ భారతమునకు వచ్చి పలుతావులను సంచరించి తాను చూచిన, విన్న విషయములను గ్రంథస్థము చేసి యున్నాడు. ఇతడు తీరాంధ్రమున పెక్కు దేశములు తిరిగి అచటి మతాచారాదికములను, ప్రజల స్థితిగతులను చక్కగ విచారించి తన యనుభవములను, అభిప్రాయములను ఉల్లేఖించి యున్నాడు. క్రీ. శ. 7 శతాబ్ద పూర్వార్ధమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలిసికొనుటకు ఇతని పర్యటన చరిత్రము మిక్కిలి ఉపయోగకరమైనది.

యువా\న్‌ చ్వాంగు వెనుక ఆంధ్రదేశమునకు వచ్చిన ప్రయాణికులలో మార్కొపోలో అను ఇటలీ దేశీయుడు ప్రసిద్ధుడు. ఇతడు వచ్చినపుడు కాకతీయ రుద్రాంబ ఆంధ్రదేశమును పాలించుచుండెను. అప్పటి దేశస్థితిని గూర్చి ఇతడు వ్రాసిన వృత్తాంతము చరిత్రకారులకు అత్యంతోపయుక్తమై యున్నది.

ఇతనికంటె ప్రఖ్యాతుడు ఇబన్‌ బత్తూతా అను అరబీ ప్రయాణికుడు; ఇతని జన్మస్థానము ఆఫ్రికాఖండమున మధ్యధరా సముద్ర తీరమున నుండు మొరాకోదేశము. మహమ్మదీయ ప్రపంచము నంతను త్రొక్కి చూడవలెనను ఉద్దేశముతో స్వదేశమునుండి బయలుదేరి పశ్చిమ మధ్యమ ఆసియా దేశములలో సంచరించి, క్రీ. శ. 1333 లో ఇతడు హిందూస్థానమునకు విచ్చేసెను. అప్పుడు ఆసేతు శీతాచల పరివ్యాప్త భరతఖండము సమస్తమును తుఘ్లకు వంశజుడైన ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఏకచ్ఛత్రాధిపతియై పరిపాలించు చుండెను. అతడు ఇబ\న్‌ బత్తూతాను చేరదీసి సత్కరించి ఢిల్లీ మహానగరమునకు న్యాయాధిపతిగ నియమించెను. బత్తూతా హిందూదేశమున పదియేండ్లకాలము ఉద్యోగము చేసిన పిమ్మట సుల్తాను ఆదేశము చొప్పున చీనాకు రాయబారము పోవుచు దక్షిణ హిందూస్థానమున పెక్కు స్థలములను దర్శించి, అందలి రాజకీయార్థిక మత సాంఘికాది విషయములను విచారించి తాను రచించిన 'రిస్లా' యను అరబీ పర్యటన చరిత్రమునందు వివరించి యున్నాడు. ఇతని 'రిస్లా' చరిత్ర పరిశోధకుల పాలిటి పెన్నిధానము. అప్పటి భరతఖండ స్థితిగతులు ఇందు చక్కగ ప్రతిబింబించు చున్నవి.

ఇబన్‌ బత్తూతా తరువాత పెక్కండ్రు పాశ్చాత్యులు రాజకీయ కార్యములమీదను, వర్తకము కొరకును దక్షిణ భారతమునకు వచ్చి విజయనగర సామ్రాజ్యమున సంచరించి తమ యనుభవములను వర్ణించుచు గ్రంథములను రచించిరి. వీరిలో మొదట పేర్కొనదగినవాడు అబ్దుల్‌ రజాక్‌ అను పారశీకుడు; ఇతడు షా రూఖ్‌ అను పారశీక రాజు పక్షమున విజయనగర చక్రవర్తియైన రెండవ దేవరాయల యాస్థానమునకు క్రీ. శ. 1444 లో రాయబారము వచ్చి, కొన్ని నెలలకాలము విజయనగరమున నివసించెను. ఇతడు విజయనగర రాజధానిని, అందలి ప్రజల జీవనమును, దేవరాయల యాస్థానపు మర్యాదలను, పండుగ పబ్బములను, వేడుకలు వింతలను విపులముగ వర్ణించుచు 'మత్ల ఉస్‌ స ఆదీ\న్‌' అను పుస్తకమును వ్రాసెను.

ఇతని తరువాత నికోలో కాంటి, వర్థేమా అను పాశ్చాత్య ప్రయాణికులు ఒకరి వెనుక నొకరు విజయనగర సామ్రాజ్యమున పర్యటనము చేసి అనేక విషయములను వర్ణించి యున్నారు.

క్రీ. శ. 15 వ శతాబ్దపు కడపటి దశకమున పోర్చుగీసు వారు దక్షిణహిందూస్తాన పశ్చిమ సముద్రతీర ప్రాంతమునకు వచ్చిరి. అప్పటి నుండియు దక్షిణ హిందూస్తానమునకును, ఐరోపీయ పాశ్చాత్యదేశములకును రాకపోకలు క్రమముగ హెచ్చి, చిట్టచివర ఆంగ్లేయ సామ్రాజ్యస్థాపనకు దారితీసినవి. పోర్చుగీసువారు వచ్చినప్పటినుండియు వారికి విజయనగర రాయలతో స్నేహము కుదిరినది. తత్కారణమున పోర్చుగీసు రాజకీయోద్యోగులు, మత ప్రచారకులు, వర్తకులు మున్నగువారు తరచుగ విజయనగరమునకు వచ్చువారు. వా రందరును విజయనగర రాజకీయములను గూర్చియు, దక్కను మహమ్మదీయ ప్రభువులకును రాయలకును గల పరస్పర రాజకీయ సంబంధములను గూర్చియు, సామ్రాజ్య ప్రజల స్థితిగతులను గూర్చియు తమచే విరచింప బడిన గ్రంథములలోను, నివేదికలలోను ఉత్తర, ప్రత్యుత్తరములలోను వ్రాసి యున్నారు. ఇట్లు విజయనగర సామ్రాజ్యమునకు వచ్చి అచట తమకు కలిగిన గౌరవాదులను తెలుపుచు వ్రాసినవారు పోర్చుగీసువా రొక్కరే కారు; వారి మార్గమును అనుసరించి వచ్చిన డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషువారును, ఐరోపీయు లితరులును తమ రచనలలోను, ఫాక్టరీ లెక్కలలోను దేశములోని రాజకీయ విశేషములను, అపుడు సంభవించిన చరిత్రాంశములను వర్ణించి యున్నారు. ఈసందర్భమున పేర్కొనదగినవారిలో ప్రముఖులు దురాతే బర్బోసా, న్యూనిజ్‌, పేయసు లను పోర్చుగీసు యాత్రికులు. బర్బోసా వీరనరసింహ రాయల కాలముననో కృష్ణరాయల రాజ్యారంభ దశయందో రాయసామ్రాజ్యమున సంచారము చేసినట్లు ఉన్నది. న్యూనిజ్‌, పేయసులు కృష్ణదేవరాయల కాలమున వచ్చిరి. బర్బోసా రాయరాజ్యప్రజల జీవన విధానమును తెలియజేయు విషయము లనేకము వివరించి యున్నాడు. పేయసు విజయనగర పట్టణమును, రాయల నగళ్లను, దేవాలయములను, అందలి జన విస్తారమును, వర్తక బాహుళ్యమును వర్ణించి యున్నాడు. న్యూనిజు ఆనెగొంది కంపిలిరాయల కాలమునుండి అచ్యుతరాయల పరిపాలనము వరకును విజయనగర చరిత్రను వ్రాసియున్నాడు. న్యూనిజ్‌ రచనయే విజయనగర చరిత్రలలో మొదటిది. తాను విన్న పూర్వరాజ వృత్తాంతమును, కనులార కాంచిన కృష్ణ, అచ్యుత దేవరాయల చెయిదములను ఆధారపరచుకొని న్యూనిజ్‌ గ్రంథ రచనను సాగించెను. న్యూనిజ్‌ రచన నేటికిని విజయనగర చరిత్ర రచనకు కల మూలాధారములలో ప్రథమస్థానమును ఆక్రమించుచున్నది.

వీరి సంగతిని చేర్పదగినవాడు మాన్యుయల్‌ బర్రాడాసు. ఇతడు క్రీ. శ. 1616 ప్రాంతమున దక్షిణ హిందూదేశమునకు వచ్చియుండి, అప్పుడు విజయనగర సామ్రాజ్యమున నడచిన విశేష చరిత్రాంశములను కొన్నింటిని అభివర్ణించి యున్నాడు. క్రీ. శ. 1614 లో వీరవెంకటపతి రాయలు కాలగతిని చెందిన పిమ్మట గొబ్బూరి జగ్గరాజకృత దుష్కృత్యములను, వెలుగోటి యేచమనాయని యద్వితీయ ప్రతాపమును, తత్ఫలితముగ చొప్పడిన జగ్గరాజాది రాజద్రోహుల నిర్మూలనమును, రాయరాజ్య పునఃప్రతిష్ఠను చక్కగ వివరించి యున్నాడు. అప్పటి రాజకీయ చరిత్ర పునర్నిర్మాణమున కనుకూలమగు సాధనములలో బర్రాడాసు లేఖ ప్రధానమైనది.

ఈపై నుడివినవారు కాక క్రీస్తుశకము పదునేడవ శతాబ్దములో హిందూదేశమునకు వచ్చిన టవెర్నియరు, బెర్నియరు విజయనగరాధీశ్వరుడయిన రెండవ వేంకటపతి దేవరాయల కాలమున దక్షిణ హిందూదేశమునకు వచ్చిన జెసూయిట్‌ ఫాదరులు రూబినో మొదలైనవారును వ్రాసిన యాత్రా వృత్తాంతములు ఇంకను చాల ఉన్నవి. ఇవి కాక, డచ్చివారి 'డాగ్‌ రిజిస్టరు', తూర్పు ఇండియా కంపెనీవారి రికార్డులు అనేకము మన దేశచరిత్ర రచన కుపయోగించునవి కలవు. వీని అన్నిటి యాధారమున మన దేశ చరిత్ర రచింపబడుచున్నది.

డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య, ఎం.ఏ., పి.హెచ్‌.డి.,
రీసెర్చ్‌ ఆఫీసర్‌, హిస్టరీ ఆఫ్‌ ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ ఇన్‌ ఆంధ్ర ప్రదేశ్‌.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి