గ్రీష్మర్తువులోలంబంబు ధ్వనించె నాకసము
గండూషించె బీరెండలన్
వాలాయంబుగ బాలకోమలదళ
వ్యాలోల డోలావళీ
కేళీమంజుల లీలలందలసి
కున్కెం గ్రీష్మవాతూలముల్
చేలుం దోటలు దాటి యేగి వన
వంశీకుంజపుంజంబులన్.ప్రత్యూషముల దిశాఫాలభాగమ్ముల
కెందమ్మి విరిచాయ గీలుకొల్పు
కుతపవేళల విశ్వకుహరాంతరములందు
గుమ్మడి పూవన్నె గుస్తరించు
మధ్యాహ్నముల నభోమండలాధ్వములందు
మల్లెదండల శోభ వెల్లిగొల్పు
అపరసంధ్యల రమ్యవిపిన నిర్ఝరులందు
సిందూరకాంతులు చిలుకరించు
కాలకంఠుని ఫాలాక్షి కాఱుచిచ్చు
దావ పావకదీప్తికి జీవగఱ్ఱ
పశ్చిమానిల వీచికి పట్టుగొమ్మ
అవతరించెను గ్రీష్మకాలాతపమ్ము.దుర్నిరీక్ష్య ప్రభాధూర్ధరచ్ఛటలతో
క్షేత్రజీవనుల శిక్షించినాడు
పటురోషకాషాయ కుటిలాంశుకశలతో
గోగణంబులు చావగొట్టినాడు
ఖరమయూఖ క్రూర ఘనకాండపటలితో
విహగజాతులు క్షోభవెట్టినాడు
గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో
తరువల్లికల కగ్గిదార్చినాడుగగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి
నలఘు బ్రహ్మాండ భాండమ్ము నలగద్రొక్కి
చటుల దుర్జన రాజ్యశాసనమువోలె
సాగె మార్తాండు చండప్రచండ రథము.ఎవడో చాకలి ఆకలిన్ మరచి
తానేవన్యమల్లీలతా
నివహక్రోడపుటీ తటాకముననో
నిత్యశ్రమాజీవన
వ్యవసాయంబొనరించుచున్న
ధ్వనియే వ్యాపించె ప్రాపంచిక
వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ
వ్యాపారమేమోయనన్.వివిధ నిమ్నోన్నతవీధులం బరుగెత్తి
వైశాఖలో మేనువాల్చెనొకడు
ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి
బెజవాడ కన్నీరుబెట్టె నొకడు
మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి
గుంటూరులో కుప్పగూలెనొకడు
కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి
నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు
క్రూర దారిద్ర్య దుర్విధికారణమున
తన భుజాగ్రమునెక్కు భేతాళమూర్తి
సర్వ కాలానువర్తి రిక్షా ధరించి
లాగలేకను వేసవికాగలేక.కొండల గండభాగముల
గూల్చి శిలాశకలమ్ములేర్చి పే
రెండలధాటికోర్చి శ్రమి
యించి పురీపరిణాహవీధులం
బండలు లాగుచుం బ్రతుకు
భారము మోయు నభాగ్యకోట్లు నా
గుండెలలోన నగ్నిదరి
కొల్పును తీవ్రనిదాఘవేళలన్.గునగున సంచరించు పసి
కూనలు చానలు చెట్ల నీడలం
దినములు బుచ్చు కాలము
గతించును గాక సమస్త దీన జీ
వనములు పల్లవించి సుఖ
వంతములై విలసిల్లు గాక నా
మనము శమించు గాక మరు
మల్లెలలో చిగురాకు చందమై.
21, ఫిబ్రవరి 2016, ఆదివారం
గ్రీష్మము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి