వసంతర్తువుఇది మధుమాసమా! అవుర
యెంత మనోహర మెందుజూచినన్
సదమల కాంతులం గులుకు
జాజులు మల్లెలు తీగసంపెగల్
కొదమగులాబులుం జిగురు
గొమ్మల రెమ్మల శాద్వలమ్ములన్
ముదమున ముంచె నీసుమ
సముద్రము విశ్వదిశాంతరాళమున్.ఈ ఆకాశము నీ మహాజలధులు
న్నీధారుణీ మండలం
బీ యందాల తరుప్రపంచనిచయం
బీ విశ్వవైశాల్య మెం
తో యంతస్సుషమా సముల్బణముతో
నుఱ్ఱూత లూగించె నా
హా! యూహావిహగమ్ము తానెగిరిపో
నాశించె నుత్కంఠతో.నీలిజలంబు నీలిధరణీ
వలయంబు వినీల శైలముల్
నీలి తరుప్రపంచములు
నీలియనంతము - యెందు జూచినన్
నీలిమ; నీలిమాకలిత
నిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమదేహపంజర వి
నిర్గతమై పరుగెత్తె నెంతయున్.ఏ మాకందతరు ప్రవాళములనో
హేలాగతిం గోకిలా
భామాకంఠము శంఖమై మొరసె
శుంభత్ కీరనారీదళ
శ్యామంబై మెరసెన్ నభంబు,
భ్రమర జ్యావల్లి మల్లీసుమ
శ్రీ మీనాంక శరమ్ములంగురిసె
వాసిం జైత్రమాసమ్మునన్.చిక్కని చిగురాకుజీబులో పవళించి
యెండువేణువు కంఠమెత్తి పాడె
తలిరాకులూడిచి తపసిగా మసలిన
నగ్నవల్లికయు పర్ణములదాగె
జిలుగు సీతాకోకచిలుక రూపము దాల్చి
కీటకయోగి కంకేళి గవిసె
శిశిర వ్రతాచార జీర్ణ మారుతమూర్తి
యలరు గిన్నెల గందమలదుకొనియె
ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ
యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ
విశ్వమందిరకుడ్యముల్ విరుగగొట్టి
మోహకల్లోలవీచిక ముంచివైచె.ఎల బ్రాయమ్మున విశ్వమందిరమునన్
హేలాకళామూర్తితో
కొలువై కన్నులపండువైన పురుషున్
గోర్కుల్ పిసాళించి మై
పులకింపం దిలకింపగా ప్రకృతి సొం
పుల్ గుల్కు సింగారియై
యలరుల్ కెంజిగురుల్ ధరించిన వసం
తారంభకాలంబిదే.ఆ యాకర్షణ మా మహోత్సవము
నా యావేశ మాకాంక్షయున్
ఏయాలింగనకున్, సుధామధుర పా
నీయాధరాపేక్షకున్
ఏ యుద్వేల రతిక్రియాకలనకున్
ఏ మాత్రముంగాదు తా
నేయంతర్గత సృష్టిసూత్రమహిమా
హేవాకమో చూడగన్.ఆసల్ దీరునె దృష్టిచే, మహితగా
ఢాలింగనాయుక్తిచే
నాసంయోగ నిరంతవేదనములే
యద్వైతసంసిద్ధికో
నైసర్గంబగు నేయగాధకుహ
రాంతః ప్రజ్వలానందకీ
లాసంతర్పణకో శరీరమొక కా
రాగారమై తోచగన్.ఇది వాసంత రసస్రవంతి; యిది
ధాత్రీజీవకూలంబులన్
గదియంబారెను హోరుమంచు, నళినీ
కాసారతీరంబులన్
బొదలం దోటల బాటలాధరలతో
పోలేని కూలీజనుల్
మదిలోగుందుచు చేలలోదిరిగిరా
మధ్యాహ్న కాలంబులన్.కొండల కోనలన్ నదుల
కోవల త్రోవల నాట్యమాడుచుం
బండువుసేయగా కుసుమ
బాలలు శోకరసాలవాలమై
కొండొకకంఠమే శిథిల
కుడ్య గుహాంతరితాంధకారమం
దుండియొ నిర్గమించె విన
వోయి తురంగము నాపుమించుకన్.కలికి గులాబిఁగేలగొని,
కమ్మని తెమ్మెర గుఱ్ఱమెక్కి, కెం
పులదలిరాకుబాకు నడుముం
గులికింతువు గాని, చూడు, నీ
జిలుగు పసిండి దువ్వలువ
చీరచెరంగున భాగ్యశోకపం
కిలకలనాకళంకములు
గీల్కొనె మేల్కొనవోయి మిత్రమా.లోకాలోకపరీత భూవలయ
కల్లోలంబులందాటి యే
రాకాకోకిలశోకమో మలయ
నారంభించె వాసంతికన్;
నా కళ్యాణ హృదంతరాళ కల
కంఠస్వైర ఘంటాపథ
వ్యాకీర్ణ స్వరమాధురీలహరులై
భాసింప తద్వైఖరుల్.తిమిరతమాలపల్లవము
తీరున కోకిల యాకులందునన్
గుములుచు కూరుచుండి యొక
కోమలగీతిక పాడినంతనే
సమధిక విశ్వశోకమయ
సాహితి పొంపిరివోవ త్రోవలన్
విమలరవంబు మాహృదయ
వేణువులన్ రవళింపనేలనో.తోరపు పంటచేలు పువు
దోటలు బాటలు పచ్చబీళ్ళు పొం
గారు తటాకముల్ తనవి
గావు; విశాలధరాతలమ్మునన్
దూర గ్రహాంతరాగత వినూతన
జీవిగ గ్రుమ్మరిల్లి యిల్
సేరగబోవు శ్రామికుడు
చీకటి దిక్కుల పిక్కటిల్లగన్.చేలంబూవులు వెక్కిరించె
గగనశ్రీ చంద్రరేఖాంకయై
వేళాకోళముజేసె తాళవనిలో
వేలాదితారావళుల్
గోలంజేసెను చింతకొమ్మపయినం
ఘూకంబు శోకించె నా
కూలీవాడు కుటీరగర్భమున
నాక్రోశించె దైన్యంబునన్.ముదుసలి తల్లిదండ్రులును
ముగ్గురు పిల్లలు చిన్నచెల్లెలున్
ఒదిగి పరున్న జీర్ణకుటిలో
నిటువైపున భార్య యావలన్
జిదుగులచెంత దాను శయ
నించును కన్నులుమూసి, మిన్నులన్
దదియ శశాంకరేఖయు
నితాంతనిశాగతి నస్తమింపగన్.నేలయు నింగియుం దెలియ
నీక యొకేతిమిరంబు విశ్వమం
దేలెను కీచురాళ్ళు ముఖరించె
మిణుంగురు లంధకారముం
జీలిచె చెట్లకొమ్మలును
శీర్షములన్ విరబోసి దయ్యముల్
వోలె చలించె జీర్ణకుటిలో
నెటులో నిదురించె జీవుడున్.
21, ఫిబ్రవరి 2016, ఆదివారం
వసంతర్తువు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి