ఆంధ్రపదము ఆంధ్రదేశమునకును, జాతికిని, భాషకును వర్తించును. అంధ్ర యన్నదే ప్రాచీనరూపమని, ఆంధ్ర యన్నది అర్వాచీనరూపమని ప్రాచీన తామ్రశిలాశాసనములను, వాఙ్మయమును పరిశీలించినచో తెలియగలదు. బౌద్ధపాలీవాఙ్మయమున ఆంధ్రులు 'అంధకు'లని వ్యవహృతులయినారు. అచ్చయిన సంస్కృత పురాణేతిహాసములలో అంధ్ర, ఆంధ్ర రూపములు రెండును కానవచ్చును. 'ఆంధ్ర' అను రూపము వానిలో నెప్పుడు ప్రవేశించెనో నిర్ణయించుటకు వీలులేదు. ప్రాచీనములైన తెలుగు తాళపత్ర గ్రంథములను చూచినను వానిలోను అంధ్రపదమే కనబడును. ఆంధ్రపదము క్రీస్తు శకము పదునాలుగవ శతాబ్దము కడపటి భాగమునను, పదునైదవ శతాబ్దిలోను వాడుకలోనికి వచ్చినదని శాసన పరిశీలనము వలన తెలియుచున్నది.
అంధ్రపదము ఐతరేయమను ఋగ్వేదబ్రాహ్మణమునందే మొదటిమారు కానవచ్చును. బౌద్ధవాఙ్మయములో 'అంధకు'లను గురించిన ప్రస్తావము కలదు. 'సమంత పాసాదిక' అను బౌద్ధగ్రంథములో 'దమిళు'లతోపాటు 'అంధు'లుకూడ మ్లేచ్ఛులుగా పేర్కొనబడిరి. 'అంధులు', 'అంధకులు' ఒక్కరే కావచ్చును. బౌద్ధగ్రంథముల వలన గోదావరీతీరమున 'అంధకరట్ఠ' (అంధ్ర రాష్ట్ర) మొకటి కలదని, 'అస్స'కులు, 'అళ'కులు(ముళకులు) అంధ్ర రాజులని తెలియుచున్నది. బుద్ధునికాలమునాటికే గోదావరీతీరమున అంధ్రజనపదము లుండినట్లు విశదమగుచున్నది. తరువాత క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దములో మగధను పాలించిన చంద్రగుప్తమౌర్యుని యాస్థానమున నుండిన గ్రీకు రాయబారి యాంధ్రులనుగూర్చి ప్రస్తావించియున్నాడు. అశోక చక్రవర్తి శాసనములలో జాతిపరముగ అంధ్ర శబ్దము కానవచ్చును. అటుపిదప క్రీస్తుశకము నాలుగవ శతాబ్దారంభమునాటి పల్లవరాజుల ప్రాకృత శాసనములలో 'అంధాపథ'మను పేరుతో అంధ్రదేశము పేర్కొనబడినది. పథము, ఆపథము, మార్గము అను పదములు పూర్వము దేశవాచకములుగ ప్రయుక్తములైనవి. క్రీస్తుశక మారవశతాబ్దములో అంధ్రపదము జనులపరముగా మౌఖరివంశజుల శాసనములలో వాడబడినది. అంధ్రపదము జాతిపరముగ వాడినట్లు తెలుపు శాసనములు చాల కలవు. వీని నన్నిటినిబట్టి చూడగా అంధ్రము మొదట జాతివాచకమని, అంధ్రులు నివసించు దేశము అంధ్రరాష్ట్రమని, అంధ్రాపథమని స్పష్టమగుచున్నది. అంధ్రులకు దక్షిణమున ఉండిన తమిళులు వారిని 'వడుగర్' - ఉత్తరాదివారు - అని వాడుటచేత తమిళ శాసనములలో అంధ్రాపథమునకు 'వడుగవష్జి' అని ప్రయుక్తమయినది. వష్జి(வழி) అనగా మార్గము. అంధ్రాపథమునకు పడమటనున్న కొంత ప్రదేశమును పాలించిన ఒక బాణరాజు తాను అంధ్రమండలములోని ద్వాదశ సహస్ర గ్రామముల కధిపతినని, అంధ్రాపథ పశ్చిమదేశము ('వడుగ వష్జి మేఱ్కు')ను పాలించితినని చెప్పుకొనెను. అత డేలినది అంధ్రాపథములోని పండ్రెండువేల గ్రామముల దేశము. పూర్వము దేశవిస్తృతిని తెల్పుటకు గ్రామముల లెక్కను ఇచ్చువారు. బాణు లేలిన రాజ్యము అంధ్రమండలములో ద్వాదశ సహస్ర గ్రామ పరిమితమయినదని దాని యర్థము. సముద్రతీర స్థాంధ్ర దేశమును పరిపాలించిన వెలనాటి దుర్జయులు పండ్రెండవ శతాబ్దమునాటి తమ శాసనమొక దానిలో
"పూర్వాంభోనిధి కాలహస్తిశిఖరి శ్రీమన్మహేంద్రాచల
శ్రీశైలై ర్వలయీకృతాంధ్రవిషయ"మ్మని
తాము పాలించిన అంధ్రదేశవిభాగమునకు సరిహద్దులు తెలిపినారు. ఈరీతిని పూర్వ మాంధ్రదేశమున ఏ కొంత భాగముననో పరిపాలనము నెరపిన రాజులు తాము పాలించిన దేశము విస్తీర్ణము, హద్దులు తెలుపుచు వచ్చినారు; కాని, మొత్త మంధ్రదేశపు విస్తీర్ణముకాని హద్దులుకాని తెలియవు. అందువలన పూర్వము అంధ్రదేశము మొత్తము పరిమితిని కాని, దాని ఎల్లలు కాని తెలిసికొన వీలులేక పోవుచున్నది.
తెలుగు అన్నమాట నిపుడు ఆంధ్రమునకు పర్యాయ పదముగా వాడుచున్నాము. ఆంధ్రపదముతో ఏమాత్రమును సాజాత్యములేని తెలుగు దానికి ఎట్లు ఎప్పటినుంచి పర్యాయపదమయ్యెనో తెలియదు. క్రీస్తుశకము పదివందలకు పూర్వపు శాసనములలోకాని, వాఙ్మయములోకాని తెలుగు అనుపదమే కానరాదు. తమిళ కన్నడ శాసనములలోను, ఆంధ్ర కర్ణాట వాఙ్మయములలోను తెలుగు పదము క్రీస్తుశకము పదునొకండవ శతాబ్దము ఆరంభమునుండియే కనబడును. శాసనములలో 'తెలుంగు భూపాలు'రు, 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ', 'తెలుంగదమల్ల' మొదలైన పదములు కానవచ్చును. ఈ శాసనములలోకూడ 'తెలుంగ', 'తెలింగ' పదము జనవాచకము లేదా జాతివాచకముగనే కనబడును. ఒక్క శాసనములో మాత్రము 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అని తెలుగుదేశములోని 'మాధవియకెఱె' అను గ్రామము పేర్కొనబడినది. ఇందు తెలుగునాడు అని తెలుగుదేశ ముదాహృతమైనది. ఆనాటికే అంధ్ర తిలింగ లేక తెలింగపదములు ఒకటే జాతిని దేశమును తెలుపుటకు అభేదముగ వాడబడినవి. తెలుగును దేశపరముగాను, జాతిపరముగాను వాడిన శాసనము లింకను ఉండవచ్చును. కాని అవి యన్నియు క్రీ. శ. పదవ శతాబ్దమునకు తరువాతివే కాని అంతకు పూర్వపువికావు. పూర్వోక్తోదాహరణముల ననుసరించి చూడగా తెలుగు రూపమే - అది తెలుంగు కానీ, తెలింగ కానీ - మొదటిది. పదునొకండవ శతాబ్ద మధ్య కాలమున పూర్వ చాళుక్య రాజరాజ నరేంద్రుని ఆస్థానమున నుండిన నన్నయభట్టారకుని నాటికి తెలుగు రూపాంతరముగా తెనుగు వచ్చినది. పదునాలుగవ శతాబ్దమునకు పూర్వమం దుండిన నన్నయ నన్నెచోడులు తెనుగును భాషాపరముగా వాడియున్నారు. పదుమూడవ శతాబ్దములోని మహమ్మదీయ చరిత్రకారులు ఈ దేశమును తిలింగ్ (తిలింగ) అని వ్యవహరించిరి. ఈ విధమున తిలింగ, తెలుంగు, తెలింగ పదములు దేశమును భాషను జాతిని సూచించు అంధ్రమునకు పర్యాయపదము లైనవి.
తెలుగు, తెనుగు పదముల వ్యుత్పత్తి ఎట్టిది, అవి ఎందుండి పుట్టినవి అను విషయము గొప్ప వాదోపవాదములకు కారణమైనది. క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్దము మొదటి పాదములో ఓరుగంటి కాకతి ప్రతాపరుద్రుని ఆస్థానమునం దుండిన విద్యానాథకవి తన ప్రతాపరుద్రీయములో ఈ దేశమును తిలింగ, తెలుంగ, తెలింగ అని కాక 'త్రిలింగ'మని వ్యవహరించి, శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామములలోని మూడు శివలింగములవలన ఈదేశమునకు ఆ పేరు కలిగినట్లు
"యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః
తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర
ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు॥"
అను శ్లోకములో సూచించియున్నాడు. ఈ శ్లోకము శైవ మతావలంబకుడయిన ప్రతాపరుద్ర చక్రవర్తినిగురించి చెప్పినది. కళింగము మినహాగా ఇప్పటి యాంధ్రదేశమునకంతకు కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రభువగుటచేత శివ క్షేత్రములైన శ్రీశైల కాళేశ్వర దాక్షారామములను ఉజ్జాయింపుగా ఎల్లలుగా చెప్పి ఆ క్షేత్రములలోని శివలింగముల వలననే ఈ దేశమునకు త్రిలింగమను పేరు కలిగినట్లు కవి చమత్కరించినాడు. అంతియేకాని అంతకు పూర్వ మీదేశమునకు త్రిలింగమనుపేరు ఉండినట్లు వాఙ్మయములోకాని, శాసనములలోకాని ఎందును కానరాదు. కాకతి రాజన్యులు శైవులని, వారు పాలించిన కాలములో అంధ్రదేశములోని ప్రధాన మతము శైవమేయని మన మీ సందర్భమున జ్ఞాపకముంచుకొనవలసియున్నది. దీనిని బట్టి ఆంధ్రదేశమునకు త్రిలింగ మను పేరు శైవము ముమ్మరముగా వ్యాపించిన కాలమునందే వచ్చిన దనుట స్పష్టము. కాకతి ప్రతాపరుద్ర రాజ్యవిస్తృతిని చమత్కారముగ నిరూపించి 'తెలుగు'కు సార్థక్యము కల్పించుటకే త్రిలింగ పదము వాడబడినది. కాని, కొంద రనుకొనునట్లు త్రిలింగ పదము ప్రాచీనమును కాదు; తెలుగు త్రిలింగ, త్రికళింగ పదములనుండి కాని, తెనుగు త్రినగరమునుండి కాని రాను లేదు. త్రిలింగమని ఒకమారు వ్యవహారములోనికి వచ్చిన పిదప అది ఉచ్చరించుటకు గంభీరముగను, 'తెలుగు' వ్యుత్పత్తికి అనుకూలముగను ఉండుటచేత భాషలో నిలిచి పోయినది. 'తెలుగు'కు వ్యుత్పత్తి చెప్పుటలో విద్యానాథుడు చెప్పిన విషయమునే అతనికి తరువాతికాలపు తెలుగు లక్షణవేత్తలు ఉటంకించినారు. వీరిలో ప్రథముడు పదునైదవ శతాబ్దము పూర్వార్ధమునం దుండిన విన్నకోట పెద్దన. ఇతడు తన కావ్యాలంకార చూడామణిలో
ధర శ్రీపర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా
కర మగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్.
'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ
దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'
రని చెప్పినాడు. దీనినే క్రీస్తుశకము 17వ శతాబ్దములో ఉండిన అప్పకవి అనువదించినాడు. పాల్కురికి సోమనాథుడు ఈదేశమును 'నవలక్ష తెలుంగు', అనగా నవలక్ష గ్రామపరిమితమైన తెలుగుదేశము అని తన పండితారాధ్య చరిత్రలో నుడివియున్నాడు. అప్పటి మహమ్మదీయ చరిత్రకారుడైన ఈసామీకూడ 'నౌలక్ తిలింగ్' అని చెప్పినాడు. పదునాలుగవ శతాబ్దము పూర్వార్ధమునాటి శాసనములలో ఇది 'తిలింగ' దేశమని, 'తైలింగ ధరణితల' మని వ్యవహరింపబడినది. పైని చెప్పిన శతాబ్దమునాటి ఒక శాసనము తిలింగదేశము నీ విధమున నిరూపించుచున్నది.
"పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ
ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;
అవా గుదక్ పాండ్యక కాన్యకుబ్జౌ
దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా."
ఈరీతిని తెలుగు దేశమున కంతకును ఒకరీతిగా ఎల్లలు తెలుపబడినవి.
తెలుగు ఆంధ్రమునకు పర్యాయపదమైనది. తెలుగునకు వ్యుత్పత్తి కాని, ఆపదము తొలుదొల్త జాతివాచకమో, భాషావాచకమో కాని తెలియదు. జాతివాచకము కాని భాషావాచకము కాని అగుచో ఆదిమకాలములో అంధ్రులు తెలుగువారు ఒక్కరగునో కాదో, ఈ రెండు పదములు ఎట్లు పర్యాయపదములయినవో ఇవి భావి పరిశోధనలవలన తేలవలసిన విషయములు. వీనినిగురించి ఎట్టి చర్చలు చేసినను అవి ఊహాజనితములే కాని నిరూఢ ప్రమాణ నిబద్ధములు కావు. నన్నయ భట్టారకుని నాటినుండి తెలుగు అంధ్రములు ఒకదాని కొకటి పర్యాయ పదములయినవి. నేడు తెలుగువా రన్నను ఆంధ్రు లన్నను, తెలుగుభాష యన్నను ఆంధ్రభాష యన్నను ఒకటే; అంధ్రదేశమే ఆంధ్రదేశము. అదియే తెలుగుదేశము.
మల్లంపల్లి సోమశేఖర శర్మ.
తెలుగు సంస్కృతి ( తెలుగు విజ్ఞాన సర్వస్వము - మూడవ సంపుటము ) నుంచి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి