Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

తెలుగు కవులు - గుడిపాటి వెంకటచలం



గుడిపాటి వెంకట చలం

వికీపీడియా నుండి
(గుడిపాటి వెంకటచలం నుండి దారిమార్పు చెందింది)
గుడిపాటి వెంకటచలం
Chalam1.jpg
జన్మ నామం గుడిపాటి వెంకటచలం
జననం మే 19, 1894
మద్రాసు-ఇప్పటి చెన్నై
మరణం మే 4, 1979
వృద్ధాప్యం వల్ల
నివాసం అరుణాచలం,తమిళనాడు
ఇతర పేర్లు చలం
వృత్తి ఉపాధ్యాయుడు, రచయిత
సంతానం రవి, సౌరీస్, వసంత్
తండ్రి కొమ్మూరి సాంబశివరావు
తల్లి కొమ్మూరి వెంకటసుబ్బమ్మ
చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

చలం - జీవితం

యవ్వనంలో చలం(అరుదయిన చిత్రం)
చలం భార్య, కుమారునితో(అరుదయిన చిత్రం)

చలం - ఆత్మ కథ

తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972), దానికి "చలం" అని పేరు పెట్టాడు. అదే అతని ఆత్మకథ. తన ఆత్మకథలో చలం తనతండ్రి తనను కొట్టడం గురించి వ్రాసాడు, కానీ ఆయన పేరు మాత్రం వ్రాయలేదు. తన తల్లి భర్తతోను పిల్లలతోను పుట్టింటనే అవస్థ పడటం గురించి వ్రాసాడు,కానీ ఆవిడ పేరు కూడా రాయలేదు. (చలం ఆత్మకథలో ఇద్దరి పేర్లు లేవు). ఈ ఆత్మకథకు ముందుమాట తనే వ్రాసుకున్నాడు. ఆ ముందుమాట చలం అంతర్గతాన్ని తెలియజేస్తుంది -
ఆత్మకథలంటే నాకసహ్యం. ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్నమాట, రాసినవాడు. ఎందుకు పుట్టానా? పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ సిగ్గులేకుండా చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు
—చలం
.

జననం - బాల్యం

చలంగా ప్రసిద్ధి చెందిన గుడిపాటి వెంకటచలం 1894,మే నెలలో 18న మద్రాసు నగరంలో జన్మించాడు. చలం తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు . చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించాడు. హైస్కూలు చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివాడు. తన తండ్రి, తల్లిని వేధించే తీరు ఆ చిన్నవాని హృదయంపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు 'అమ్మణ్ణి' పెళ్ళి ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్ళించింది.

విద్యాభ్యాసం - వివాహం - ఉద్యోగం

1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరాడు. ఆ సమయంలో బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు నాయకత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. తరువాత బి.ఎ.చదువు కోసం మద్రాసు వెళ్ళాడు. అంతకు ముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్‌లో చేర్చి, తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆమెను సైకిల్ పై స్కూల్లో దించేవాడు. దీనిని అంతా వింతగా చూసేవారట. మామగారైతే చలంను తన ఇంటి గడపే తొక్కవద్దన్నాడు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు అయిన తరువాత కాకినాడ లో ట్యూటర్‌ గా ఉద్యోగంలో చేరాడు. తిరిగి బ్రహ్మసమాజ ఉద్యమంలోనూ, 'రత్నమ్మ' తో స్నేహం-ప్రేమ లోనూ బిజీ అయ్యాడు. టీచరుగా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత పాఠశాల తనిఖీ అధికారిగా పని చేశాడు. తన ఉద్యోగం గురించి తాను రచించిన "మ్యూజింగ్స్" లో(72వ పుట,5వ ముద్రణ 2005) ఈవిధంగా వ్యాఖ్యానం చేశాడు
రాతిని, ప్రభుత్వ బానిసను. స్కూళ్ళ తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయవర్గ ప్రాణ మూషికాలకి మార్జాలాన్ని
—చలం
.

రచనల ద్వారా సమాజం నుండి వెలి

చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. కానీ, సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారట. చలం తన కథలు, నవలల్లో వ్రాసిన విషయాలకు అప్పటి సమాజం తట్టుకోలేక పోయింది. అతను తన అనేక రచనల్లో వ్యక్తపరచిన భావాలు, మచ్చుకి కొన్ని, ఈ వ్యాసం లో చలం వ్యాఖ్యలు,అభిప్రాయాలుగా ఉటంకించడం జరిగింది, అక్కడ చూడవచ్చును. దీనికి తోడు, అతని వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తన (స్త్రీ లోలత్వం)కూడా అభ్యంతరకరముగా పరిగణింపబడింది. మొత్తంమీద, అతను సంఘంలో ఒక "విపరీత వ్యక్తి"గా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దీనివలన, అతనితో ఎవరూ మాట్లాడేవారుకాదట. అతనికి ఇల్లు అద్దెకివ్వడానికి కూడా వెనకాడేవారట. ఇంతెందుకు, చివరకు అతని దగ్గరబంధువులు కూడా అతన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. చలం ముఖ్యంగా తన రచనల వలన మరియు కొంతవరకు తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘంనుండి వేరుపడి ఒంటరివాడయ్యాడు. అతని భార్య కూడా అతని మూలాన బంధువులకు దూరమయ్యింది. ఆతనిని సమర్థించి అతనితోనే ఉండటానికి నిర్ణయించుకోవడం మూలాన ఆమె తండ్రి, ఇతర బంధువులు కూడా ఆమెను దగ్గరకు చేరనిచ్చేవారు కాదు. కాని ఆమె, చలంను కొంతవరకు అర్ధంచేసుకుని, ఆర్యసమాజ భావాలను ప్రచారం చేయడంలో ఉత్సాహంగా అతనికి సహాయం చేసేదట. కాని, కొంతకాలానికి, ఆమె కూడా చలం ప్రవర్తనతో విసిగిపోయింది. ఇద్దరిమధ్య కీచులాటలు ప్రారంభమై ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య అన్యోన్యత కరవైంది.

1920లో టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళితే 'చెడిపోయినవాడు' అని ఎవరూ ఇల్లే ఇవ్వలేదు. చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకొన్నాడు. గోదావరి ఒడ్డున గడిపిన సాయంకాలాల్లో అతను అనుభవించిన సంఘబహిష్కరణను తనతోబాటు పాట్లుపడుతున్న రంగనాయకమ్మపట్ల జాలిని వ్యక్తంచేస్తాడు చలం. అతని మాటల్లోనే:"ఆమెకు(తన భార్యకు) కావలసింది జాలి మాత్రమేనా -' నా మీద ఎంత కోపం వుండనీ, నన్ను నమ్మి ఈ నిర్భాగ్య జీవితంలో నాతో నిలిచి వుంటుంది రంగనాయకమ్మగారు(భార్య). లోపల పిల్ల కదిలే పెద్దపొట్టతో అన్నిపనులు చేసుకుంటోంది. వెలిపడ్డ మాకు దాసీ వుండదు, చాకలి వుండదు, కొన్ని సమయాల్లో విరోధం తక్కువగా వున్నప్పుడు నవ్వుకుంటూ యిద్దరం అంట్లు తోముకునేవాళ్లం. బట్టలు వుతుక్కునేవాళ్లం . స్నేహంగా పలకరింపులు లేకుండా అర్థం చేసుకునే చూపైనా లేకుండా బతుకుతున్నాము. ఏటిపొడుగునా మమ్మల్ని పలకరించేవాళ్ళులేరు. మమ్మల్ని విజిట్ చేసేవాళ్ళు అసలు లేరు. తను వొంటరి. నన్ను వొదిలిపోదామంటే తనకీ ఎవరూలేరు తన బంధువుల్లో. నన్నునమ్మి నాతో తనూ వెలిపడ్డది. నాకు మాత్రం ఎవరు తోడు? నాకు దేవుడూ లేడు".

జీవితంలో చివరిఅంకం

అరుదయిన చిత్రం-జిల్లెళ్ళమూడి అమ్మ తో చలం
వృద్ధ్యాప్యంలో చలం(మరణానికి కొద్ది నెలల ముందు)
చలం వ్యక్తిగత జీవితంలో పెద్దగా సుఖపడలేదని చెప్పవచ్చు. భార్య అతని ప్రవర్తనతో విసుగెత్తి, అతనితో ఉండలేక బంధువులదగ్గరకు వెళ్ళలేక మానసిక క్షోభ అనుభవించిందట. కొంతకాలానికి, ఆమె తీవ్ర విచారంలో (Depression)మునిగిపోయిందట. పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. కూతురు సౌరిస్ వివాహం చేసుకోలేదు, సన్యాసినిగా మారింది. పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద "బిడ్డల శిక్షణ" అనే పుస్తకం వ్రాసిన చలంకు ఈ పరిస్థితి ఎదురు కావటం విచిత్రం!
సమాజం తన పట్ల చూపుతున్న ఏహ్యభావం, తన రచనల పట్ల వచ్చిన వివాదం, చివరకు అతనికి ఎంతగానో దగ్గరైన వదిన (వొయ్యి గా పిలుచుకున్న పెద్ద రంగనాయకమ్మ, అతని భార్య సవతి సోదరి. ఈమె బెజవాడలో వైద్యురాలు, ఆమెకు వైద్య విద్య చలమే చెప్పించాడు) మరణం చలాన్ని కుంగతీసి, ఆంధ్ర దేశం నుండి వెళ్ళిపోయి ఏదైనా ప్రశాంత వాతావరణంలో బతుకుదామన్న నిర్ణయం తీసుకునేలా చేసాయి. 1950 ఫిబ్రవరి 9న చలం బెజవాడలోని తన సొంత ఇంటిని అమ్మివేసి,తన కుటుంబముతో అరుణాచలం వెళ్ళిపోయాడు. అప్పటివరకు ధార్మిక విషయాలమీద విముఖత చూపిన చలం, ఒక్కసారిగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం చర్చనీయాంశమయ్యింది. చలాన్ని రమణ మహర్షి దగ్గరకు, అతని మిత్రుడు, సహోద్యోగి దీక్షితులు 1930లలో తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి చలం అప్పుడప్పుడు రమణాశ్రమానికి వెళ్ళివస్తూండేవాడట. ప్రముఖ సినీ రచయిత పింగళి నాగేంద్రరావుకు చలంకు ఈ విషయంలో జరిగిన సంభాషణ:


పింగళి నాగేంద్రరావు  :ఎందుకండీ అరుణాచలంవెళ్ళారు మీరు?
గుడిపాటివెంకటచలం  : 'శాంతికి'
పింగళి  : 'శాంతికా! ఎందుకు కావాలి?'
చలం  : 'వ్యధ భరించలేక, నాలో, నా మనసులో పుట్టే ఈ ఆరాటపు బాధ భరించడం అశక్యమై'
పింగళి  :బాధ పోయి శాంతివస్తే ఇంక మీరేం రాస్తారు? ఇప్పటి మీ మ్యూజింగ్స్ లో మీ రాతకి వెర్రి దూకుడు తగ్గి ఓ స్తిమితం, ఓ మార్గం ఏర్పడ్డది. రాతే మాని, ఇంతలో చావు శాంతిలోకి పోతారా?'
చలం  : 'రాయకపోతేనేం'
పింగళి  :'దానికి జవాబు మీరే అంటున్నారన్న మాట. చెత్త రాతలు గాక, వాస్తవం పలికేవన్ని బాధలోంచే బైలుదేరేయి మరి!'
చలం  : 'కావొచ్చు, మీరందరూ హాయిగా చదువుకునేందుకు,రాత్రింబవళ్ళు నేను భరించలేని వేదనతో గడపమంటారా?'
ఈ జవాబు విని పింగళి సహృదయంతో నవ్వారని, చలం "విషాదం" వ్యాస సంపుటిలోని "బాధ" అనే వ్యాసంలో స్వయంగా వ్రాశారు (విషాదం 88వ పేజీ,ముద్రణ 1992) దీనివల్ల, చలం ఎంతో క్షోభపడి, ఎన్నిరకాలుగానో ఆలోచించి, సమాజంలో జరుగుతున్న కనపడని అన్యాయాల గురించి మధనపడి తన రచనలు సాగించాడనిపిస్తుంది. చివరకు తన మధనకు, బాధకు సరైన స్పందన రాకపోవటం అతని అరుణాచల యాత్రకు ఒక కారణమయ్యిందనవచ్చును.
చలం తన చివరి కాలంలో, తన కూతురు సౌరిస్ లో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడట. ఏపని చేసినా 'ఈశ్వరుడు చెప్పాలి' అనేవాడట. "ఈశ్వరుడు" అంటే అతని దృష్టిలో సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో "ప్రళయం" వస్తుందని ప్రచారం చేసాడు. తెలిసిన వారందరికి ఉత్తరాలు వ్రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని, లేదా అరుణాచలం వచ్చేయమని సలహా ఇచ్చాడు. అతని అభిమానులు కొంతమంది సహాయ శిబిరాలను కూడా ఏర్పరిచారట. కాని, అటువంటి ప్రమాదం ఏమీ జరగక పోవటంతో, చలం నవ్వులపాలైన మాట నిజం.
ఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. చలం అక్కడి ప్రశాంత వాతావరణంలో కొంత ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే భగవద్గీతకు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజులలో అతని కూతురు సౌరిస్, ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో మూడు దశాబ్దాలు జీవించి, 1979 మే 4న అనారోగ్యంతో చలం మరణించాడు. అతని అంత్యక్రియలు కూతురు సౌరిస్ జరిపించింది. ఆతని మరణం తరువాత కొన్ని నెలలపాటు, ఆతని రచనల గురించి దిన/వార పత్రికలలో తీవ్ర చర్చలు జరిగాయి.

చలం - రచనా వ్యాసంగం

చలం తన రచనలను 1920 చివరి ప్రాంతాలలో మొదలు పెట్టాడు. 1930-40లలో ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఏ రచయిత కూడా తెలుగులో ఇంతగా స్త్రీలగురించి వ్రాయలేదు. స్త్రీ రచయితలుకూడా, ఆయన వ్రాసినదాంట్లో శతసహస్రాంశం కూడా ఇంతవరకు వ్రాయలేకపొయ్యారు. ఈ మధ్యకాలంలో (1920-1950 మధ్య) చలం రచనలు తెలుగు దేశమంతటా పెనుతుఫానులాగా ముసురుకొన్నాయి. అతని స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. చలం రచనలను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు. ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి 1950లో తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు.

తన రచనా శైలి గురించి చలం మాటల్లో

చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
'నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలి లో, రాతలో అంత తీవ్రత అంత invetibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి.
—(ఆత్మకథలో 74-75వ పుటలు)
.

మహా ప్రస్థానానికి ముందుమాట

చలం, శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానం కు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానం లోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. "యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి(పదును) ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి. అందులో కొన్ని వాక్యాలు క్రింద ఉదాహరింపబడినాయి-
  • ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
  • శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గుస్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.
  • ...శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు." ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.
మచ్చుకి, చలం శైలి ఈ కింద ఉదహరించిన వ్యాసం/కథలో చూడవచ్చు. ఈ రెండూ కూడా, ఈ పక్కన ఇచ్చిన లింకుల ద్వారా చదువవచ్చు.

చలం ప్రఖ్యాత రచనలు

వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచడానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడ ఉన్నాయి, కానీ అందులో వ్యంగ్య నాటికలు ఎక్కువ. హరిశ్చంద్ర నాటికలో భార్యను వేలంవేసి అమ్ముతున్న హరిశ్చంద్రునికి పిచ్చిపట్టిందని ప్రజలు కట్టేసి తన్నే సీను ఉంటుంది. ఈజాబితాలో ఉదహరించినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

తన సమకాలీన రచయితల గురించి చలం

  • మునిమాణిక్యం నరసింహారావు ఆ నిమిషానికి కులాసాగా చదవడానికి పనికి వస్తాయి. .All sentiment and tawdriness ప్రస్తుత కాలపు కుటుంబ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాని disgustingly small.
  • విశ్వనాధ సత్యనారాయణ - ఆయన కవిత్వం నాకు అర్ధం కాదు. తప్పిదం చాలా వరకు నాదేననుకుంటాను. ఆయన నాటకాలలో యేవీ గొప్పవి కావు. Quite disappointing.
  • దేవులపల్లి కృష్ణశాస్త్రి- ఆయన వూర్వశి is disappointing . ఇంకా వెన్నెముక గట్టిపడి, సూనృతమూ, ఉత్సాహమూ అతని జీవితంలోకి-తద్వారా, కవిత్వంలోకీ వొస్తే-తను ఏమి అనుభవించానని ప్రజలు అనుకోవాలనుకుంటున్నాడు అది కాక-తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అది వ్రాస్తే-అతను అద్భుతమైన గీతాలు వ్రాయగలడు.నా ఉద్దేశంలో ప్రస్తుతపు రచకుల్లో అతను అగ్రగణ్యుడని.కాని అతని రచనలు అస్పష్టము, అనవసరంగా అయోమయం.కాని స్వంతంగా, నాకు గొప్పగా వుంటాయి. అతని రచనలు.అతని-fine delicate toches at the heart.హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు
  • బసవరాజు అప్పారావు-ఒక గొప్ప కవిత్వపు పంక్తి కోసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు.ఇప్పటికే అతన్ని మర్చిపోవడం న్యాయంగా తోస్తుంది
  • రాయప్రోలు సుబ్బారావు -కొత్త యుగాన్ని ప్రారంభించాడు. మంచి శైలి .Thought (కొత్త అభిప్రాయాలు) సున్న.

సారస్వతం, రచయితల గురించి చలం అభిప్రాయం

  • సారస్వతం రెండు రకాలు-ఒకటి, అందమైన పటం మల్లే గోడని వేళ్లాడుతో-మనసుని అందాలతో నింపేది, రెండు, ఉరిమి, చించి చెండాడి, మంచికో చెడ్డకో, జీవితాన్ని చేసేది.
  • రచయితలు రెండు రకాలు. ఒక ఉద్గ్రంధాన్ని (మాస్టర్ పీస్) వొదిలిపోయేవారు.తాము స్వంతంగా గొప్పగా యేదీ రాయకపోయినా,సారస్వతానికి కొత్త జీవనాన్నిచ్చేవారు. యే కొందరో యీ రెండూ చెయ్యగలవారుంటారు.

చలం రచనలు - సినిమాలు

తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు, ముఖ్యంగా పరిశ్రమ తొలి దశల్లో,కన్యాశుల్కం వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం కథలుగాని, నవలలుగాని సినిమాగా తియ్యడానికి ఎవరూ సాహసించలేదు. చలం రచనలు ఎంతో మంది చదివినా, సమాజంలో అతను వ్రాసిన కథలు అనేక వక్ర భాష్యాలకు గురి కావడం, ఇంతాచేసి సినిమా ఎంతో శ్రమ పడి, డబ్బు ఖర్ఛు చేసి తీస్తే ఏమవుతుందో అన్న అనుమానం, భయం ముఖ్య కారణం కావచ్చును. పైగా, ఆ కథలు గానీ, నవలలు గానీ సినిమాలుగా తీసి జనంలోకి తీసుకెళ్ళగలిగిన నటులు గాని, దర్శకులు గాని ముఖ్యంగా నిర్మాతలు గాని కరువయ్యారనే చెప్పవచ్చు. 2005 వ సంవత్సరంలో చలం దోషగుణం కథ ఆధారంగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో గ్రహణం చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికంగా లాభాలు ఆర్జించలేదు. అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం మైదానం నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు తనికెళ్ళ భరణి ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడట[1].1980 ల ద్వితీయ అర్థ భాగంలో, హైదరాబాదు దూరదర్శన్ వారు (DD-8), మైదానం నవలను ఒక టెలీ ఫిల్ముగా రూపొందింపచేసి ప్రసారం చేసారు. కానీ, తీసిన పద్ధతి, దర్శకత్వం, నటన పేలవంగా ఉండటం వలన, ప్రాచుర్యం పొందలేదు.

చలంగురించి ఇతర ప్రముఖులు

కొడవటిగంటి కుటుంబరావు ప్రముఖ రచయిత, తెలుగులో కథలు వ్రాయడంలో ఒక చక్కటి ఒరవడిని తీర్చిదిద్దినవారు. చందమామ పత్రికకు దాదాపు మూడు దశాబ్దాలపాటు సంపాదకులుగా వ్యవహరించారు.చలంకు దూరపు బంధుత్వం కూడా ఉన్నదని చెప్తారు.
  • వ్యక్తిగా చలం కవి. కవిత్వం కోసం బతికినంతగా, కవిత్వాన్ని ప్రేమించాడు. కవిత్వం చలం కంట నీరు తెప్పించటం నేనెరుగుదును.
  • ఇతర మనుషుల్లో ఉండే దౌర్బల్యాలు చలంలో ఉండవచ్చు. కాని, అనేక విషయాలలో ఆయన విశిష్ట వ్యక్తి.
  • ఆయన కీర్తికోసం తానై పాటు పడలేదు. ఏ సాహిత్య ఉద్యమంలోనూ చేరలేదు. సాహితీసమితిని "మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ" (పరస్పర పొగడ్తల సంఘం) అన్నాడు,
  • కాని కీర్తి తనను వెతుక్కుంటూ వస్తే దాన్ని పరీక్షించకుండా కావలించుకున్నాడు. అప్పుడప్పుడూ కనువిప్పు కలిగేది."నన్ను మెచ్చుకునేవాళ్ళంతా, నా రచనలు అర్థం చేసుకున్నారని భ్రమ పడ్డాను"అన్నాడాయన ఒకసారి.
  • ఒంటరితనం, స్నేహితులు బంధువులతోనైనా గాఢమైన సంబంధాలు లేవు. ఒంటరితనం ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా సోకిందేమోననుకుంటాను. అదే ఆయన్ను రమణాశ్రమం చేర్చింది. చివరకు, ఒంటరితనం పరాకాష్టకు వచ్చి, ఆయన రజనితో ఇంటర్వ్యూలో "ఈ చలం నన్ను వదలకుండా ఉన్నాడు!" అని విసుక్కున్నాడు.
  • చలం ఎంత ఒంటరివాడో, చలం రచనలు అంత బాగా జనాదరణ పొందాయి. చిత్రం!
పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచయిత, సంపాదకులు. ఆంధ్ర జ్యోతి తెలుగు వారపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకులుగా ఉండి, అనేక వినూత్నమైన ఇల్లాలి ముచ్చట్లు-శీర్షిక మొదలగునవి ప్రవేశపెట్టారు. ఈయన చలం మీద "తెలుగు వెలుగు-చలం" అనే పుస్తకం వ్రాశారు. అందులోనుండి-
  • చలం ఎవరు అనేది, నేనెవరు అనే ప్రశ్న అంత జటిలం. బాల్యంలో చలం వేరు. బ్రహ్మ సమాజంలో తిరిగిన చలం వేరు. ఛిత్రాంగి, పురూరవ, జయదేవ, హరిశ్చంద్ర వ్రాసిన చలం వేరు. మైదానం, బ్రాహ్మణీకం హంపి కన్యలు-ఇత్యాది నవలలూ కథలూ వ్రాసి ఆంధ్ర దేశాన్ని మంచికో చెడుకో, అటూఇటూ తీవ్రంగా వూపించి, సంచలనంరేపిన చలంవేరు. అయినప్పటికీ, అతని జీవితం, అతని సాహిత్యం, అతని అలోచనలు, అతని ప్రణయ తత్వం, అతని స్త్రీ వ్యామోహం, అతని ఆదర్శాలు, అతని విసుగు, అతని కోపం, అతని నిరాశ, అతని నిస్పృహ, అతని ఆనందం, అతని విషాదం అన్నీకూడా నలుగురితో పంచుకుని జీవించాడు.
  • చలం నైతికంలోనూ, ఆధ్యాత్మికంలోనూ కూడా తీవ్రవాదే.
  • మహా ప్రస్థానానికి పీఠిక వ్రాసిన చలానికి, భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసిన చలానికి తేడా లేదనుకోవడం వెర్రితనం.
  • కొన్ని నియమాలకు, కొన్ని సూత్రాలకు, కొన్ని పడికట్టు రాళ్ళకి, కొన్ని ప్రమాణాలకి నిలవలేకపోయినంత మాత్రాన అతను 'అనార్కిస్ట్' కాదు. ఉన్నతమైన స్వేచ్ఛ కోసం కలలుగని, తపించి బాధపడినవాడు...........
  • ఇప్పుడు, చలం ఎవరంటే వెలుగు నీడల వైపు వేలు చూపింతు".
తురగా జానకీ రాణి ఈ రచయిత్రి, చలం మనుమరాలు. చలం-మా తాతయ్య అని ఒక పుస్తకం వ్రాశారు. అందులోనించి, కొన్ని వ్యాఖ్యలు-
Maataatayyachalam.jpg
  • నువ్వు శృంగార రచనలు చేశావు. స్త్రీ, పురుష సంబంధాలను గురించి విప్లవాత్మకంగా , ఎంతో పచ్చిగా రాశావు. మరి యిప్పుడు యీ యోగి పాత్ర ఏమిటి? అని చాలాసార్లు అనేదాన్ని. ‘నా వయసు పొగరు అది. ధైర్యంగా ఎవరితో పడితే వారితో, తోచినవి అనేయడం అలవాటున్న రోజులు. రొమాన్సు అనేది నా రక్తంలో కలిసి నాతోనే పుట్టింది. ఎంత ప్రయత్నించినా శృంగార వాంఛను యీ నాటికీ జయించలేకపోయినాను. అదే లేకపోతే నేనెందుకు బ్రతికీ?... స్త్రీతో కొన్నేళ్లు స్నేహమైతే, నాలోని శృంగార భావం పాతబడి, ఇంక నన్ను ఆకర్షించడం మానేసేది. అప్పుడు యింకొక ప్రేమకాదు. ఉత్త కామమూ కాదు. పసితనం నుంచి, నాకు అన్నేళ్లుగా ఆ వాంఛలు వుంటూనే వుండేవి’.
  • నీ పుస్తకాల వల్ల ఎందరో పాడైపోయారు అంటారు, ఎందుకట్లా రాశావు? అని అడిగాను. 'అట్లా అనిపించింది. రాశానూ అన్నారాయన. 'మరి యిప్పుడు యిల్లా ఈశ్వరుడు అంటూ భజన చేస్తున్నావేం?' అన్నాను. 'ఇప్పుడిట్లా అనిపిస్తోందీ అన్నారు.
  • తల్లిని పోషించని మనిషిగా నేను చలాన్ని పేర్కొనడం భావ్యం కాదు. తన భార్యని పిల్లలతో ఎగతాళి చేయించి, కొట్టించిన 'వికృత వ్యక్తిత్వం' గా ఆయన్ని పేర్కొనడమూ భావ్యం కాకపోవచ్చును. యుక్త వయస్కుడైన ఏకైక కుమారుడు ఆనాటి బెజవాడ నుంచి తెలుగు సమాజంలో యిమిడిపోలేక, యిల్లు విడిచి అంతర్థానమైపోవడానికి ఆయనే కారకుడని (అంటే చలం) కోపంగా అనడమూ సబబు కాకపోవచ్చును.
  • ఆయన బోధించిన 'కాముక స్వేఛ్చ’ నాకు పరమరోత కలిగించింది. అది మానవస్థాయి నుంచి పశుస్థాయికి దిగడం అని నా చిన్న బుర్రకు తోచింది.

చలం పై విమర్శలు

  • చలం దృష్టిలోని లోపం ఏమిటంటే, ప్రేమనూ, ప్రేమవివాహాలనూ సమర్థించడంతో ఆయన ఆగలేదు. ప్రేమలేని వివాహాలు విచ్ఛిన్నం కావలసిందే అని ఉద్ఘాటించడం... స్త్రీలు లేచిపోవడాన్ని సమర్థించడం... వంటి వెన్నో-
  • చలం ఒట్టి సెక్సురచయిత, స్వేచ్ఛాప్రవక్త, విశృంఖల ప్రణయవాది, సుఖవాది, రెబెల్, స్వాప్నికుడు,
  • పురుషాధిక్య నైతికత పెత్తనం నుంచి విముక్తి కలిగిన స్త్రీల కంపానియన్ షిప్ ఒక ఆనందమయజీవితం అంటాడు.
  • చలం తన చేతులు చూపి ఈ చేతుల స్పర్శ కోసం ఎన్నివేల స్త్రీల గుండెలు తపించేవో... అంటాడు.

చలం వ్యాఖ్యలు, అభిప్రాయాలు

  • ఈశ్వరుణ్ణి చూసినవారు లేరు. ఆఖరికి చూశామన్నవారు గూడా లేరు. ఈశ్వరుణ్ణి చూడలేదు అనేవారూ లేరు.-- (ఆత్మకథ 124 పుట నుండి)
  • ఈశ్వరుడు ఉన్నట్టు రూఢీగా తెలిస్తే నమ్మనా? అంతవరకు ఈశ్వరుడు లేనట్టూ రూఢీ లేదు మరి! ఉంటే నమ్మడానికి నాకేం అభ్యంతరం? --(స్తీ 14వ పుట)
  • ఉన్నది దాచుకుంటాననేవాడికి దేవుడి భయం లేదు. నీది లాక్కుని పంచుతాననే వాడికి దేవుడు లేడు. అందుకనే, పశుబలం, యుక్తీ, తెలివీ ఇవే ప్రాబల్యంలోకి వచ్చాయి. ధర్మం, న్యాయం, సత్యం అనేవి ఉత్త మాయ మాటలైనాయి.(290 పుట మ్యూజింగ్స్ 5వ ముద్రణ)
  • తనకు రావలిసిన హక్కులకన్న, తను నెరవేర్చవలసిన బాధ్యతల పైన దృష్టి నిలపాలి స్త్రీ. బైట ఉన్న పరిస్తితులకన్న, తన చుట్టూ ఉన్న వాతావరణం నించి కన్న స్వతంత్రమూ, శాంతీ, హృదయంలోపల పలికి వచ్చినప్పుడే స్తిరంగా నిలుస్తాయి అవి. అత్త అధికారంనించీ, భర్త అధీనం నుంచీ తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషిన్సికీ బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కిందనుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేంగాక) లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తనచుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు!-- (స్త్రీ 16వ పుట)
  • తెల్లారి లేస్తె పిడకలు, మళ్ళు (పాతకాలంలో బ్రాహ్మణ స్త్రీలు మడి కట్టుకునేవారు), అధికారాలు, అలుకులు(పూర్వం ఇల్లు పేడతో అలుక్కునేవారు) ఇవన్నీ వొదిలి, సూర్యోదయం చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం ఉత్సాహం - ఎప్పుడు కలుగుతుంది మానవులకి!...(స్త్రీ 17వ పుట)
  • మాట్లాడటానికి స్వేచ్ఛా, శక్తీ ఉన్ననాడే నిజమో అబద్ధమో చెప్పగలడు. అట్లా తన స్వేచ్ఛని ఉపయోగించేవాడే, ఈనాడు అబద్ధాలు చెప్పినా, ఒకనాడైనా నిజం చెప్పడంనేర్చుకుంటాడు, -- (స్త్రీ 51వ పుట)
  • కుక్కకి యజమానుడు ఎంత అవసరమో, ఆడపిల్లకి మొగుడు అంత అవసరం. కాని, ప్రతి స్త్రీకి ఇట్లా ఏదో ఒక భర్త ఎల్లాంటివాణ్ణో ఒకణ్ణి దానం చేసితీరే సంఘం, భర్త లేకపొతే ఒప్పుకోని సంఘం, ఆ భర్త పోతే మళ్ళీ దానం చెయ్యదేమి? స్త్రీకి భర్త ఉండటమే అంత అవసరమైతే, ఎప్పుడూ ఉండనక్కర్లేదూ? భర్త ఒద్దని ఏడుస్తున్న చిన్న పిల్లలకి బలవంతంగా కట్టబెడుతుంది, భర్త కావాలని గోలపెడుతున్న వితంతువులకి నిరాకరిస్తుంది సంఘం. ఏం తెలివి?-- (స్త్రీ 51-52 పుటలు. ఈ వాక్యాలు చలం 1930-40లలొ వ్రాసినవి)
  • కులం కార్య విభాగమే, కులాలలో సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్నన్నాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలో భేదంగాని, గౌరవంలో భేదంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనేవాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. ఆమె బుద్ధికుశలత పరీక్షించకుండా, స్త్రీ అయినంత మాత్రంచేత, ఆమె భాగానికెప్పుడూ నీచ కార్యాలే ఇస్తే, అది సరైన కార్య విభాగమెట్లా అవుతుంది? ఆమెచేసే వంటా, సేవా నీచంకావనీ, ఇంటిపనులవల్ల ఆమె రాణిలాగ గౌరవం పొందుతోందనీ దేశాభిమానులూ, మతాభిమానులూ పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తారు. కాని ఉపన్యాసమై ఇంటికి పోగానే, కాళ్ళుకడుక్కోవడానికి నీళ్ళు సిద్ధంగా లేకపోతే "ఏమే! వొళ్ళు కొవ్విందా? నీళ్ళు పెట్టక యేం చేస్తున్నావు? ఈసారి సిద్ధంగా ఉండకపోనీ, నీ పని చెపుతా" నంటాడు."నువు సరిగా డబ్బు సంపాదించడంలేదు,బజారు సామానులు వేళకు తీసుకురాలేదు, వీపు చీలుస్తాను వెధవా!" అని స్త్రీ అంటే గౌరవిస్తారా? పోనీ ఆ కార్యాల నీచమే తమకి లేకపోతే పురుషుడే చెయ్యరాదూ వాటిని? ఆ నేను వంటచేస్తానా? అంటాడు అయ్యగారు. పనిలేక ఇంట్లో సోమరిగా కూచునే పనికిమాలినవాడూ, ఊళ్ళో జీతానికి వంటచేసేవాడు కూడా భార్యకి వండి పెట్టడు -- (స్త్రీ 53-54 పుటలు)
  • స్త్రీ ఒక మాటవల్లా,చూపువల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికీ, కోరికలకీ, విన్నపాలకీ అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి, ...(చలంగారి మీద English Wikipedia పుట నుండి)
  • గాంధీగారి అహింసా సిద్ధాంతం ఒక ఉపకరణ, ఒక పాలసీ.ఆయన అనుచరులకి ఒక ధర్మం కింద, ఒక సత్యంకింద, ఎవరికీ విశ్వాసం లేదు.(మ్యూజింగ్స్ 290వ పుట-5వ ముద్రణ)
  • ...ఉదాహరణలు వాస్తవాన్ని ఎన్నడూ ఋజువు చెయ్యలేవు. ఊరికే నిజాన్ని గ్రహించి చూపగలవు.(292 పుట మ్యూజింగ్స్ 5వ ముద్రణ)
  • సినిక్ ఎవరో తెలుసునా? మన కలలకీ, అబద్ధపు నమ్మకాలకీ గాయం అయ్యేట్టు నిజం మాట్టాడేవాడు. ("ఆ రాత్రి" మూడవ ముద్రణ 2007 జూన్)
  • ఎక్కడ ప్రేమకు అంతంలేదో, అంతా ప్రేమమయమో, యెక్కడ ప్రేమకు నీతి, దుర్నీతి అనునవిలేవో, అట్టి లోకం కావాలి.. ప్రేమించినవారికి పాపములేదు. ఎక్కడైనా ఏ అందమైన స్త్రీలను చూసినా నేను చాలా attract ఔతాను. అది పాపమంటావా ?'పాపకార్యాలమీద చాలారోత నాకు. ఒక అబద్ధం చెప్పాననుకో ఎంత బాధపడిపోతానో! నన్ను నేను అసహ్యించుకుంటాను. సిగ్గుపడతాను. పశ్చాత్తాప్పడతాను. ఏ పాప కార్యమైనా నా కంతే. కాని స్త్రీకై నేను పడే ఆకర్షణలో నాకు సంతోషం తప్ప ఏ బాధారాదు.'అమ్మడితో ఆగదే. ఆమెను కావిలించుకోవాలని, ముద్దులు పెట్టుకోవాలనీ గొప్ప ఆశ కలుగుతుంది. ఒకవేళ ఆమె కూడా నన్ను యిష్టపడ్డట్లయితే నా ఆనందానికి మేరలేదు. ఇంత ఆనందమిచ్చే పని, పాపం, తప్పు అంటే నేను నమ్మలేకుండా వున్నాను. పాపంలో అంత ఆకర్షణ ఉంది. పురాణాలూ, శాస్త్రాలూ, పెద్దలూ, మన బ్రహ్మసమాజపు గురువులు అందరూ గట్టిగా ఖండిస్తారు. వారు చెప్పేదంతా నాకు నిజమనిపించదు. మనం కులాల్ని, విగ్రహారాధనల్ని, తద్దినాల్ని, వీటన్నిటినీ అతిక్రమించాం. ఈ నీతులకి మాత్రం ఎందుకు లొంగిపోవాలి? ఎప్పుడన్నా దేవుడు ఈ పనులన్నీ చెడ్డవని చెప్పాడా?'నా అంతరాత్మ దీంట్లో ఏమీ తప్పు లేదని చెపుతోంది.-చలం.(చావుపుటకల సమస్య గురించి)
  • స్త్రీని ఇంత చవక చేసుకొని నశించింది ఎవరనుకున్నారు? పురుషులు.తాము అన్యాయం చేసిన స్త్రీ ముందు నిలబడడం మొగాడికి ఎంతభయం? శ్రీరాముడే తార్కాణం.శ్రీకృష్ణుడే అయితే ఎవడివిరా?నాభార్యను ఎంచుతావా?అని వాణ్ణి హతమార్చి ఉండును.పురుషుడంటే అతను.ఒక్కసీతతో శ్రీరాముడికి ఇన్ని సమస్యలు.పదహారువేలమందితో ఏ సమస్యా లేదు శ్రీకృష్ణుడికి.అతను పురుషుడంటే.తగాదాలూ ఈర్ష్యలూ అలకలూ శృంగారజీవితానికి రంగునిచ్చే ప్రతి అంశమూ ఉంది.కానీ ఎవరిదగ్గర వారికి అనునయంగా రక్తిగా యుక్తిగా ఎవరికివారికే తనవాడే కృష్ణుడన్నట్టు మెలుగుతాడు.(మ్యూజింగ్స్)

చలం జ్ఞాపకాలు

  • విజయవాడ(బెజవాడ)లో, చలం లక్ష్మీటాకీసు అనే సినిమాహాలు దగ్గరున్న ఇంట్లో 1950 వరకు ఉన్నారు. మ్యూజింగ్స్ లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడ్డ సినిమా హాలు ఇదే. ఆ ప్రస్తావనలో ఒకటి(124వ పుట 5వ ముద్రణ 2005):
"మా గోడపక్కన టాకీగృహం. యజమానులు వాళ్ళకి ఏఫిల్ము డబ్బు తీసుకొస్తుందో ఆలోచిస్తారుగాని, పక్కన నివసించే నిర్భాగ్యుల నిద్ర అదృష్టాన్ని గుర్తించరు. ఫిల్ము మారుతోంది అనేప్పటికి గుడెలు దడదడలాడతాయి, ఏ కొత్తరకం ఉపద్రవం రాబోతోందో అని. అర్ధరాత్రులు మెళుకువగా గడిపేవాళ్ళ మనశ్శాంతి ఈ డైరక్టర్ల శ్రవణ సౌకుమార్యం మీద ఆధారపడవలసి వొచ్చింది. తెలుగు ఫిల్ములను చూడనివాళ్ళ అశ్రద్ధ మీద మంచికసి తీర్చుకుంటున్నారు వారాలకి వారాలు వాటి దుస్సహమైన శబ్దాలను వినిపించి. ఏ హీరోయినో పెద్దపులినోట ప్రాణాన్నో, దుర్మార్గుడి హస్తాలమధ్య శీలాన్నో, సముద్రంలో తనవస్త్రాలనో,కోల్పోయే అపాయంలోకి దిగేటప్పుడు, ఇరవై ఇనపతాళ్ళమీద రంపాలుపెట్టి కోస్తున్నట్టు గోలకల్పిస్తే ఊపిరి బిగబట్టి మెడలుచాచి ఆవింత చూసే రెండువందల అణాకానీలకి ఉత్సాహకరంగా ఉంటుందేమో కాని, వినేవాళ్ళు అపాయం తప్పిందని tension సళ్ళిచ్చి ఎప్పుడు ఈలలు కొడతారా అని ఫిల్ము దేవుళ్ళకి మొక్కుకుంటో వుంటారు..........................టిక్కెట్టు కొనలేని వారికి కూడా art పంచాలనే ఉదార ఆశయంతోగావును, దర్శకులు, మాటలూ, పాటలూ చుట్టూ అరమైలు వరకు వినపడేట్టు ఏర్పాటుచేశారు. ఎట్టాగైనా తెలుగువారు చాల generous people. విశ్వదాత అనుగు బిడ్డలు. ఆ పాటల్ని విని, ఆ గంధర్వ కంఠాల ఆకర్షణని నిగ్రహించుకోలేక,ఎట్లాగో అణాకానీలు సంపాయించుకుని, ప్రజలు చిత్రం చూడ్డానికి వస్తారని ఆశ....................నెలలు వాటితో గడిపి ఇంకా బతికి ఉన్నానంటే, నాకు నూరేళ్ళకన్నా ఎక్కువ అయుర్దాయమున్నదని అనుమానంగా ఉంది. నేను దేశానికీ, భాషకీ చేస్తున్న ద్రోహానికి, యముడి పక్కన, ఇటు భారతమాతా, అటు సరస్వతీ నుంచుని తప్పకుండా నరకంలోకి తోయిస్తారని ఆశపడే నీతిసోదరులకి చాలా ఆశాభంగం కలగబోతోంది. ఈ ఫిల్ముపాటలు వినడంతో నా కర్మపరిపాకం ఇక్కడే తీరింది. నాకుకూడా, నరకంలో వేసినా, ఇంతకన్నా ఏంచేస్తారు అనే నిబ్బరం చిక్కింది. ఇంతలో బాలనాగమ్మ ట్రైలరు వినడంతోటే, చాల పొరబడ్డాననీ, దర్శకుల శబ్దకల్పనాశక్తి లోతుల్ని తెలుసుకోలేక, అబద్ధపు ధీమాలో బతుకుతున్నానని వొణుకు పుట్టింది. ఇల్లు మారుద్దామా, ఇల్లు దొరక్కపోతే రైలుస్టేషనులో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ మకాం పెడదామా అనుకొంటూ ఉండగా, ఆ ఫిల్ము రాదని అబద్ధపు ధైర్యాన్నిచ్చారు".
1990లలో ఆ సినిమా హాలుతోబాటు చలం పూర్వం ఉన్నఇల్లుకూడా కొని, కూలగొట్టి ఒక వ్యాపార సముదాయం కట్టారు. కూలగొట్టడానికి ముందు, ఆ ఇంటిని చలం ప్రదర్శనశాలగా మార్చడానికి ఆయన అభిమానులు ప్రయత్నించారు,కానీ, ప్రస్తుతపు వ్యాపార వత్తిడులననుసరించి, ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.


1 కామెంట్‌:


  1. చలం migrain అనే జబ్బుతో కూడా బాధపడుతూ ఉండేవాడు.ఆయన గురించి,రచనలగురించి సాకల్యంగా రాసినందుకు అభినందనలు.నేనేమీ అంతకన్నారాయదలుచుకోలేదు.నేను కంచివరకూవెళ్ళి అరుణాచలం వెళ్ళలేదు.ఆయనను చూడలేకపోయాను.కాని చిన్నప్పుడు నా కాకినాడ మిత్రుడు చలం తెల్లగా( faircomplexioned) ఉంటాడని చెప్పేవాడు.ఏ భావాలైనా అతనిలో చాలా తీవ్రాంగా ఉండేవి.ఆయన పెద్దకొడుకు రవి గుండెజబ్బు తో మరణించేదు.ఈరోజుల్లో దానికి తగినtreatment,surgery ఉన్నాయి.చలం కుమార్తె సౌరిస్ ని మాత్రం భీమునిపట్నంలో ఆవిడ సన్యాసిని గా చూసాను.ఎవరితోను మామూలుగా మాట్లాడేది కాదు.చలం పుస్తకాలు నాటకాలు మినహా చాలావరకు చదివేను.చాలా విషయాల్లో విభేదించినా ,నేను ఆయన అభిమానినే.

    రిప్లయితొలగించండి