Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

19, జనవరి 2014, ఆదివారం

భాగవతము - కుచేలోపాఖ్యానము



కుచేలోపాఖ్యానము
క. హలధరుఁ డమర్త్య చరితుం
డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం
బులు పెక్కు నాల్గు మొగములు
గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా!
1
చ. అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లనుఁ బద్మపత్రలో
చనుని యనంత వీర్య గుణ సంపద వేమఱు విన్ననైనను\న్‌
దనియదు చిత్త మచ్యుత కథావిభవం బొకమాటు వీనులన్‌
వినిన మనోజ పుష్పశరవిద్ధుఁడు నైన విరామ మొందునే.
2
వ. అదియునుం గాక. 3
చ. హరి భజియించు హస్తములు హస్తము లచ్యుతుఁ గోరి మ్రొక్కు త
చ్ఛిరము శిరంబు చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త మిందిరా
వరుఁ గను దృష్ట్లు దృష్ట్లు మురవైరి నుతించిన వాణి వాణి య
క్షరు కథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువి\న్‌.
4
క. హరి పాదతీర్థ సేవా
పరుఁడై విలసిల్లు నట్టి భాగవతుని వి
స్ఫురితాంగము లంగము లా
పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా!
5
సీ. అనుడు వేదవ్యాస తనయుఁడా యభిమన్యు తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి
జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు నా నొప్పు విప్రుండు మానధనుఁడు
విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు
విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి
తే. నడుగఁ బోవక దనకుఁ దా నబ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్‌గాఁ దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొకవిధంబున నడపుచు నుండునంత.
6
సీ. లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర
పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి
మలమల మాఁడుచు మానసం బెరియంగఁబట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ
బత్రభాజన ధృతపాణు లై తనుఁ జేరి వేఁడిన వీనులు సూఁడినట్ల
తే. యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ
జేరి యిట్లని పలికె నో జీవితేశ!
తట్టు ముట్టాడునట్టి పేదఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి.
7
వ. అని మఱియు నిట్లనియె. 8
తే. బాల సఖుఁడైన యప్పద్మపత్రనేత్రుఁ
గాన నేఁగి దరిద్రాంధకార మగ్ను
లయిన మము నుద్ధరింపుము హరి కృపాక
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.
9
వ. మఱియును. 10
చ. వరదుఁడు సాధుభక్తజన వత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడుఁ దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు నీ
వరిగిన మిమ్ముఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూనసంపదల్‌.
11
మ. కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముఁ డై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబున\న్‌ నిజపదాబ్జాతంబు లుల్లంబులోన్‌
దలఁప న్నంతనె మెచ్చి యార్తిహరుఁ డై తన్నైన నిచ్చు\న్‌ సుని
శ్చలభక్తి\న్‌ భజియించువారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌.
12
క. అని పలికిన నమ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁడా కృష్ణు\న్‌
గన నేఁగుట యిహ పర సా
ధన మగు నని మదిఁ దలంచి తన సతితోడన్‌.
13
తే. నీవు చెప్పినయట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
కాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు.
14
తే. అనిన న య్యింతి యౌఁగాక యనుచు విభుని
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.
15
వ. అట్లు చనుచుం దన మనంబున. 16
సీ. ద్వారకానగరంబు నేరీతిఁ జొత్తును భాసు రాంతఃపురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగి దర్శింపఁగలను దద్ద్వారపాలు
రెక్కడి విప్రుండ విం దేలవచ్చెద వని యడ్డపెట్టిరే నపుడు వారి
కేమైనఁ బరిదానఁ మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్థశూన్యుండ నేను
తే. నయిన నా భాగ్య మతని దయార్ద్ర దృష్టి
గాక తలపోయఁ గా నొండుఁ గలదె యాతఁ
డేల నన్ను నుపేక్షించు నేటిమాట
లనుచు నా ద్వారకాపుర మపుడు సొచ్చి.
17
వ. అట్లు ప్రవేశించి, రాజ మార్గంబునం జని చని, కక్ష్యాంతరంబు గడచి,
చని ముందట.
18
సీ. విశదమై యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విశాల సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధహర్మ్యములఁ జూచి
మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి సంతోషబాష్పముల్‌ జడిగొనంగఁ
బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మందిరమున నింతులు చామరములు వీవఁ
తే. దనరు మృదు హంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహువినోదములఁ దనరి
మహిత లావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.
19
సీ. ఇందీవరశ్యాము వందితాసుత్రాముఁ గరుణాలవాలు భాసురకపోలుఁ
గౌస్తుభాలంకారుఁ గామితమందారు సురుచిరలావణ్యు సురశరణ్యు
హర్యక్షనిభ మధ్యు నఖిలలోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు
ఖగకులాధిప యానుఁ గౌశేయ పరిధానుఁ బన్నగ శయను నబ్జాతనయను
తే. మకరకుండల సద్భూషు మంజుభాషు
నిరుపమాకారు దుగ్ధసాగర విహారు
భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు.
20
మ. కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళ త్కంజాక్షుఁ డ ప్పేద వి
ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరు\న్‌
ఘన తృష్ణాతురచిత్తు హాస్యనిలయు\న్‌ ఖండోత్తరీయు\న్‌ గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుం డై దిగెన్‌ దల్పమున్‌.
21
క. కర మర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి బంధుస్నేహ
స్ఫురణన్‌ దోడ్తెచ్చి సమా
దరమునఁ గూర్చుండఁ బెట్టెఁ దన తల్పమున\న్‌.
22
తే. అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్లు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళిత మైన.
23
తే. మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతముల విసరి
బంధు రామోద కలిత ధూపంబు లొసఁగి
మించు మణిదీపముల నివాళించి మఱియు.
24
వ. సురభి కుసుమమాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు లిడి,
ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన, నప్పు డ వ్విప్రుండు మేనం
బులకాంకురంబు లంకురింప, నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె. అట్టి
యెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణంబులు
మెఱయఁ జామరలు వీవం, దజ్జాత వాతంబు ఘర్మసలిలంబు నివారింపు చుండం
జూచి, శుద్ధాంత కాంతాజనంబులు మనంబున నద్భుతం బంది, యిట్లనిరి.
25
ఉ. ఏమితపంబు చేసెనొకొ యీ ధరణీదివిజోత్తముండు దొల్‌
బామున యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగత్‌
స్వామి రమాధినాథు నిజతల్పమునన్‌ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలు\న్‌.
26
వ. అదియునుం గాక. 27
చ. తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదము\న్‌
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలన్‌ బరితుష్టుఁ జేయుచు\న్‌
వినయమున\న్‌ భజించె ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుఁడో.
28
వ. అ య్యవసరంబున. 29
క. మురసంహరుఁడు కుచేలుని
కరము గరంబునఁ దెమల్చి కడక న్మన మా
గురు గృహమున వర్తించిన
చరితము లని కొన్ని తడవి చతురత మఱియు\న్‌.
30
సీ. బ్రాహ్మణోత్తమ! వేదపాఠన లబ్ధ దక్షతఁ గల చారు వంశంబువలనఁ
బరిణయం బైనట్టి భార్య సుశీల వర్తనములఁ దగ భవత్‌సదృశ యగునె
తలఁప గృహ క్షేత్ర ధన దార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట
దోఁచుచున్నది యేనుఁ దుది లోకసంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు
తే. గతి మనంబునఁ గామమోహితులు గాక
యర్థిమై విహితకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు భవ్యనిష్ఠఁ
దగిలి యుందురు గొంద ఱుత్తములు భువిని.
31
వ. అని మఱియు ని ట్లనియె. 32
క. ఎఱుఁగుదె గురుమందిరమున
వెఱ వొప్పఁగ మనకు నతఁడు వెలయఁగ దెలుప
న్నెఱుఁగఁగ వలసిన యర్థము
లెఱిఁగి పరిజ్ఞాన మహిమ లెఱుఁగుట లెల్ల\న్‌.
33
వ. అని మఱియు, గురుప్రశంస సేయం దలంచి, యి ట్లనియె. 34
తే. తివిరి యజ్ఞాన తిమిర ప్రదీప మగుచు
నవ్యయం బైన బ్రహ్మంబు ననుభవించు
భరిత సత్త్వుండు సత్కర్మ నిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డనఘుండు బుధనుతుండు.
35
వ. అ మ్మహాత్మునివల్న సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండ నగు
గురుండ నై యుండియు, గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి. అది గావున.
36
క. భూసురుల కెల్ల ముఖ్యుఁడ
నై సకల కులాశ్రమంబులందుల నెపుడు\న్‌
ధీ సుజ్ఞానప్రదుఁ డన
దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడల\న్‌.
37
తే. అట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు.
38
వ. అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను తపో వ్రత యజ్ఞ దాన
శమ దమాదులచేత సంతసింపను, గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం
బరిణమింతు. అని చెప్పి మఱియును, మనము గురుమందిరంబున నున్నయెడ
గురుపత్నీ నియుక్తుల మై, యొక్కనాఁ డింధనార్థం బడవికిం జనిన యవసరంబున.
39
సీ. ఘుమఘుమారావ సంకుల ఘోరజీమూత పటల సంఛ న్నాభ్ర భాగమగుచుఁ
జటుల జంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండనిభాఖండ వారిధారాపూర్ణ వసుధ మగుచు
విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణజిత్‌ విద్యుద్ద్యుతిచ్ఛటా విభవ మగుచు
తే. నడరి జడి గురుయఁగ నినుం డస్తమింప
భూరి నీరంధ్ర నిబిడాంధకార మేఁచి
సూచికాభేద్య మై వస్తుగోచరంబు
గాని యట్లుండె మనము న వ్వానఁ దడిసి.
40
ఆ. బయలు గొందియుఁ బెనుమిఱ్ఱు పల్ల మంబు
రహిత సహితస్థలంబు లేర్పఱుపరాక
యున్న య త్తఱి మనము నొండొరుల చేతు
లూఁతగాఁ గొని నడచుచు నుండునంత.
41
క. బిసబిస నప్పుడు నుడుగక
విసరెడి వలిచేత వణకు విడువక మనము\న్‌
బసచెడి మార్గముఁ గానక
మసలితి మంతటను నంశుమంతుఁడుఁ బొడిచెన్‌.
42
క. తెలతెల వాఱిన వనములఁ
గలకల మని పక్షిగణ మెల్లెడల\న్‌
మిలమి లని ప్రొద్దు వొడువున
ధళధళ యను మెఱఁగు దిగ్వితానము నిండె\న్‌.
43
క. అప్పుడు సాందీపుఁడు మన
చొ ప్పరయుచు వచ్చి వాన సోఁకునను వలి\న్‌
దెప్పఱిలుటఁ గని భేదం
బుప్పతిల\న్‌ బలికె నకట! యో వటులారా!
44
చ. కటకట! యిట్లు మా కొఱకుఁగా జనుదెంచి మహాటవిన్‌ సము
త్కట పరిపీడ నొందితిరి గావున శిష్యులు మాఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో యిటమీఁద మీకు వి
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్‌.
45
క. అని గారవించి యాయన
మనలన్‌ దోడ్కొనుచు నాత్మమందిరమునకున్‌
జనుదెంచుట లెల్లను నీ
మనమునఁ దలఁతే యటంచు మఱియును బలికె\న్‌.
46
వ. అనఘా! మన మధ్యయనంబు సేయుచు, నన్యోన్య స్నేహవాత్సల్యంబులం
జేయు కృత్యంబులు మరవవు గదా! అని యవియెల్లనుం దలంచి యాడు
మాధవు మాటలు విని, యతనిం గనుంగొని, కుచేలుం డి ట్లనియె.
47
క. వనజోదర! గురుమందిర
మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే
విను మవి య ట్లుండనిమ్ము విమలచరిత్రా!
48
క. గురుమతిఁ దలపగఁ ద్రిజగ
ద్గురుఁడ వనందగిన నీకు గురుఁ డనఁగా నొం
డొరుఁ డెవ్వఁ డింతయును నీ
కరయంగ విడంబనంబ యగుఁగాదె హరీ!
49
వ. అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని, సమస్త భావాభిజ్ఞుం డైన
పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుం డగుచు, నతనిం జూచి, నీ విచ్చటికి
వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి, నాకు నుపాయనంబుగా నేమి పదార్థంబు
దెచ్చితివి. అ ప్పదార్థంబు లేశమాత్రం బైనఁ బదివేలుగా నంగీకరింతు. అట్లుం
గాక, నీచవర్తనుం డై, మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యం బైన
పదార్థంబు నొసంగిన, నదియును నా మనంబునకు సమ్మతంబు గాదు. కావున.
50
క. దళమైన పుష్పమైనను
ఫలమైనను సలిల మైనఁ బాయని భక్తి\న్‌
గొలిచిన జను లర్పించిన
నెలమి\న్‌ రుచిరాన్నముగనె యేను భుజింతు\న్‌.
51
క. అని పద్మోదరుఁ డాడిన
వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చిన యటుకులు దగ నర్పిం
పనునేరక మోము వాంచి పలుకక యున్న\న్‌.
52
వ. అ వ్విప్రుండు చనుదెంచిన కార్యంబు గృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి,
యితఁడు పూర్వభవంబున నైశ్వర్యకాముం డై, నన్ను సేవింపఁడు. ఐనను,
ని క్కుచేలుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొఱకు నాయొద్దకుం జనుదెంచిన
వాఁడు. ఇతనికి నింద్రాదులకుం బడయరాని బహుప్రకారంబు లైన సంపద్విశేషంబు
లీ క్షణంబ యొడఁగూర్పవలయు. అని తలంచి, యతండు జీర్ణవస్త్రంబు కొన
ముడిచి తెచ్చిన య య్యటుకులముడియఁ గని, యిది యేమి యని యొయ్యన న మ్ముడియఁ
దన కరకమలంబున విడిచి, య య్యటుకులు గొన్ని పుచ్చికొని, యివియు
సకలలోకంబులను నన్నుఁ బరితృప్తిం బొందింపజాలు. అని యప్పుడు.
53
క. మురహరుఁడు పిడికెఁ డటుకులు
గర మొప్పఁగ నారగించి కౌతుకమతి యై
మఱియును పిడిఁకెడు గొనఁ ద
త్కర మప్పుడు వట్టెఁ గమల కరకమలముల\న్‌.
54
క. సొంపారఁగ నితనికి బహు
సంపద లందింప నివియ చాలును నిఁక భ
క్షింపఁగ వలవదు త్రిజగ
త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మ! హరీ!
55
వ. అని యిట్లు వారించిన, న క్కుచేలుండు నా రాత్రి గోవిందుని మందిరంబునం దనకు
హృదయానందకరంబు లగు వివిధపదార్థంబు లనుభవించి, మృదుల శయ్యాతలంబున
నిద్రించి, తన మనంబునం దన్ను సమధిక స్వర్గభోగానుభవుంగాఁ దలంచుచు,
మఱునాఁ డరుణోదయంబున మేల్కని, కాలోచిత కృత్యంబులు దీర్చి, యిందిరారమణుండు
దన్నుఁ గొంతద వ్వనిపి, యామంత్రితుం జేయఁ జనుచు, నందనందన సందర్శనానంద
లోలాత్ముం డై, తనమనంబున ని ట్లనియె.
56
క. నాపుణ్య మరయ నెట్టిదో
యా పుణ్యనిధిం బ్రశాంతు నచ్యుతు నఖిల
వ్యాపకుఁ బ్రహ్మణ్యునిఁ జి
ద్రూపకుఁ బురుషోత్తమునిఁ బరుం గనుఁగొంటి\న్‌.
57
సీ. పరికింపఁ గృపణస్వభావుండ నైనట్టి యే నేడ నిఖిలావనీశ్వ రైన
యిందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుఁ డై యొప్పు న వ్వాసుదేవుఁ
డేడ న న్నర్థిమైఁ దోడఁబుట్టినవాని కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నుంచి సత్క్రియల్‌ పూని నడపి
తే. చారు నిజవధూ కరసరోజాత కలిత
చామరానిలమున గతశ్రమునిఁ జేసి
శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ
తలములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి.
58
వ. కావున. 59
ఉ. శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె నెన్న దరిద్రుఁడు సంపదంధుఁ డై
కానక తన్నుఁ జేరఁ డని కాక శ్రీతార్తిహరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే.
60
వ. అని తనమనంబున వితర్కింపుచు, నిజపురంబునకుం జని చని, ముందట. 61
సీ. భానుచంద్ర ప్రభా భాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ మానిత కూజి తోద్యానములును
ఫుల్లసితాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములును
మణిమయ కనకకంకణ ముఖాభరణ విభ్రాజిత దాసదాసీజనంబుఁ
తే. గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముఁ డుండు
నిలయ మొక్కొ యపూర్వ మై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు.
62
వ. అని తలపోయుచున్న యవసరంబున. 63
తే. దివిజవనితలఁ బోలెడు తెఱవ లపుడు
డాయ నేతెంచి యిందు విచ్చేయుఁ డనుచు
విమల సంగీత నృత్యవాద్యములు చెలఁగ
గరిమఁ దోఁకొని చని రంతిపురమునకును.
64
వ. ఇట్లు చనుదేర నతని భార్య యైన సతీలలామంబు దనమనంబున నానంద రసమగ్న
యగుచు నుండి.
65
సీ. తన విభు రాక ముందటఁ గని మనమున హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబుఁ గైకొన్న యిందిరావనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁ గన్నుల క్రేవల నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భావంబున నాలింగనంబు చేసె
తే. నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషిత లై రతిరాజు సాయ
కములగతి నొప్పు పరిచారికలు భజింప
లలిత సౌభాగ్య యగు నిజలలనఁ జూచి
66
క. ఆ నారీరత్నంబును
దానును ననురాగరసము తళుకొత్తఁగ ని
త్యానందము నొందుచుఁ బెం
పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయ\న్‌.
67
సీ. కమనీయ పద్మరాగ స్తంభకంబులుఁ గొమరారు పటికంపు కుడ్యములును
మరకత నవరత్నమయ కవాటంబులుఁ గీలిత హరినీల జాలకములు
దీపిత చంద్రకాంతోపల వేదులు నంచిత వివిధ పదార్థములును
దగు హంసతూలికా తల్పంబులును హేమ లాలిత శయనస్థలములఁ దనర
తే. సమధి కోత్తుంగ భద్రపీఠముల సిరులు
మానితోన్నత చతురంతయానములును
వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును
గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి.
68
వ. సుఖంబున నుండునట్టియెడం, దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు,
నిర్మలం బగు తన మనంబున ని ట్లను. ఇంతకాలం బత్యంత దురతం బగు దారిద్ర్య
దుఃఖార్ణవంబున మునింగియున్న నాకుం గడపట\న్‌ గలిగిన విభవంబున నిప్పుడు.
69
ఆ. ఎన్నఁ గ్రొత్త లయిన యిట్టి సంపదలు నా
కబ్బు టెల్ల హరి దయావలోక
నమునఁ జేసి కాదె నలినాక్షుసన్నిధి
నర్థి నగుచు నేను నరుగుటయును.
70
క. నను నా వృత్తాంతంబును
దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ
మ్మని యీ సంపద లెల్లను
నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయనిఁ జేసె\న్‌.
71
వ. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠు లైన సజ్జనులు, లేశమాత్రం బగు పదార్థం
బైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన, నది కోటి గుణితంబుగాఁ గైకొని,
మన్నించుటకు నిది దృష్టాంతంబు గాదె. మలినదేహుండును, జీర్ణాంబరుండు నని
చిత్తంబున హేయంబుగాఁ బాటింపక, నాచే నున్న యటుకు లాదరంబున నారగించి,
నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయు కాదె. అట్టి కారుణ్యసాగరుం
డయిన గోవిందుని చరణారవిందంబులయందుల భక్తి ప్రాభవంబు
గలుంగుగాక! అని, య ప్పుండరీకాక్షునియందుఁ బూర్వ భక్తితాత్పర్యంబునం దగిలి,
పత్నీసమేతుం డయి, నిఖిలభోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును,
నిర్వికారుండునునై, యఖిలక్రియలయందు ననంతుని యనంత ధ్యాన
సుధారసంబునం జొక్కుచు, విగతబంధనుం డై, యపవర్గ ప్రాప్తి నొందె. మఱియును.
72
ఆ. దేవదేవుఁ డఖిలభావజ్ఞుఁ డాశ్రిత
వరదుఁ డయిన హరికి ధరణిసురులు
దైవతములు గాన ధారుణీదివిజుల
కంటె దైవ మొకఁడు గలఁడె భువిని.
73
క. మురహరుఁ డిట్లు కుచేలునిఁ
జరితార్థునిఁ జేసినట్టి చరితము విను స
త్పురుషుల కిహ పర సుఖములు
హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!
74
మాలిని. శరధిమద విరామా! సర్వలో కాభిరామా!
సురరిపు విషభీమా! సుందరీ లోక కామా!
ధరణివర లలామా! తాపస స్తోత్రసీమా!
సురుచిర గుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
74
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ
పాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహా
పురాణమునంబునందుఁ గుచేలోపాఖ్యానంబు నను కథలుగల దశమస్కంధంబునందు నుత్తరభాగము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి