రామాయణము ప్రాముఖ్యము
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి....
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
"రామో విగ్రహవాన్ ధర్మః''
వేదాలలో నిక్షిప్తమైన "ధర్మం'' సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే, ఆచరణయోగ్యమైన "ధర్మానికి' ఆకారం దాల్చాలని ఆశపుట్టింది కాబోలు. శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.
ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో "రామావతారం'' పూర్ణావతారము. జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో జగతిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ "రామాయణం'' అని చాటి చెప్పాడు.
రామస్య ఆయనం'' - రామాయణం :
"ఆయనం'' అంటే గమనం, కదలిక. రామాయణం అంటే "రామగమనం'. అదే "ధర్మం యొక్క కదలిక''. ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మ బలంతోనే నడుస్తోంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలూ ధర్మాన్ని అనుసరించే వుంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే "ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు.
శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తాటకా సంహార సమయంలో "స్త్రీని చంపడం ఎంతవరకూ ధర్మం'' అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు :
నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్
పాతకం వా సదోషం వా కర్తవ్యం రాక్షతా సతా ||
"ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు, ధర్మసంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం'' అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి తాటకను సంహరించాడు ... శ్రీ రాముడు.
శివధర్భంగం జరిగింది. సీతారాముల కళ్యాణము జరిగింది. తన వీరత్వంతోనే శివధర్భంగం జరిగిందనీ ... సీతను పెళ్ళి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడూ అనుకోలేదు.
ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భుయో భ్యవర్థత ||
తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే, రామునకు సీతపై ప్రేమ కలిగింది. సీత, తన సౌదర్యముచేతనూ, సద్గుణముల చేతనూ రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేసెను'' అంటాడు ఆదికవి వాల్మీకి. "తనయుని వివాహా విషయంలో తండ్రిదే సర్వాధికారం'' అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు.
శ్రీరామ పట్టాభిషేక ముహూర్త నిర్ణయం జరిగింది. కానీ, "అదే మొహూర్తానికి పదునాలుగేళ్లు వనవాసం చెయ్యాలి'' అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక, చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరాముడు. "మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా?'' అని సందేహాన్ని వ్యక్తం చేసింది కైక.
"రామో ద్విరాభి భూషతే''
అమ్మా! ఈ రామునకు రెండు నాలుకలు (మాటలు) లేవు. పితృవాక్య పాలనమే నా ధర్మం'' అన్నాడు శ్రీరాముడు. అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదీ రాముని ఆయనం, ధర్మం. శ్రీరాముని మనస్సు, మాట,చేత ఒక్కటే.అందులో మార్పు వుండదు. అప్పుడే "ధర్మాచరణ'' సాధ్యం. అదే చేసి చూపించాడు శ్రీరాముడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి