Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, మార్చి 2016, శుక్రవారం

రామాయణం -19 వ భాగం

రామాయణం -19 వ భాగం


ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.
ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జెరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. 

ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.
ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |
ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |
తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.

భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||

అప్పుడు జనకుడు " మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది " అన్నాడు.
అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దెగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జెరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దెగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.

వెంటనే దశరథుడు తన గురువులతొ, పురోహితులతొ సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, " మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు. వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.

దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.

ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.

ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చినభరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి,మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి