రామాయణం -17 వ భాగం
ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలనిగెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.
మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....
యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.
విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదెగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||
ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితొ.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.
ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి