మహాప్రస్థానం
- శ్రీ శ్రీ
1ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ. చెలం చూశాడు. మాట్లాడాడు. కాని
శ్రీ శ్రీని ఎరగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి-"ఇదేమిటి. ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీ శ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా వూడ్చుకు పోతోవుంటే! హృదయాలమీది పెంకులు పగిలి పోతున్నాయి. బైట వినబడుతున్నాయి. యిట్లా రండి, రోడ్డు మీదికి," అన్నాడు.అంతవరకు శ్రీ శ్రీ కవిత్వాన్ని ఎరక్క పోవడం చెలంలో క్షమించతగిన విషయం కాదు. కాని చెలవాటికి క్షమించాలి చెలాన్ని.
కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చెలానికి impatience, అనుమానం. శబ్ద సౌందర్యంలో తృప్తిపడి సంతోషించవలసిందే కాని, చెప్పే దానికి అర్థం వెదకటం అవివేకం అని. కాని నీరసపు కళాచతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించీ, విచారించీ, తప్పుకోవడం చెలానికి చాతకాదు. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కి. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు. కవులూ చెయ్యరు -ఎంకీ, శ్రీ శ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.
తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవ లనిపిస్తుంది. ఎందుకంటే-కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీ శ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ.
2శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగ వేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపచేస్తారు. బుద్ధి వున్న వాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి. కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటో అగచాట్లు పడి కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల వెనక అణగి చచ్చి, కొనవూపిరితో ఆరిపోలేక మిణుకు మిణుకు మంటో వుంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త అర్థంలేని న్యూసెన్సుగా తోస్తాయి శ్రీ శ్రీ పద్యాలు. సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి ఈ వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!అదీ సాధారణంగా కల్చెర్డు రీడర్సు సంగతి.కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని వెయ్యికన్నులతో కనిపెడుతూ వుంటారు. కనపడ్డదా, ఆనాటినుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించీ, కవిని గురించీ, ప్రచారం మొదలు. సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆకొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తీ, కాల పరిస్థితులను బట్టి చప్పరించడమూ- తమ కావ్యాలనించో, ఇతర కావ్యాలనించో, సంగ్రహించబడిన దనడమూ -విప్లవ కారణ మనడమూ, నిర్జీవమనడమూ -కవిని గురించి చాలా righteous indignation తోనో, జాలిపడుతోనో, చాలా సానుభూతి దయా వున్నట్లు ప్రస్తావించడమూ వీళ టెక్నిక్.
"శ్రీ శ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని కవిని అడిగారా, అతను "దానికేం చాలా బావుంటుంది. ఓ బాగా వ్రాస్తాడు. నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-" అన్నాడా, అతను చాలా సన్నిహిత ప్రియమిత్రు డన్నమాట కవికి. చిరునవ్వుతో శ్రీ శ్రీ విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి పోతున్నాడు జాగ్రత్త!
శ్రీ శ్రీ కవిత్వానికి Motive springs చూపుతాడు ఆ మిత్రుడు. తప్పదు."ఆకలి పాట ---కటిక దరిద్రుడు అతను -తిండిలేక వీథులు తిరిగాడు--- పాపం" అంటో ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని explain చేస్తాడు.నిజమా? నిజమైతే శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు."ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్య ఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీదపడి బతుకుతున్న యీ Parasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.ప్రపంచంలో ఈనాడు ప్రతిదేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మ యుద్ధం చేసే ధీరులు ఈ నాడూ పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే, అనాదిగా తనకోసం ప్రయత్నించే dreamers మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన rotten channels ఈ నాటి సారస్వత సభాపతులు.
తాము బతికివున్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికివున్న శవాలు ఈ నాటికీ తాము ముప్ఫైయేళ్ళక్రింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు మీద కాఫీ యిడ్డెన్ల ముందు Inspire ఐ ప్రగల్భాలు పలికే ఈ రసికులు, తాము తెచ్చిన సంస్కారమే యింక సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి, ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చెయ్యడానికి మీదికి ఉరికే భగీరథ ప్రవాహాల్ని ఊరి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు.
మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి "శ్రీ శ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్త తనాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే, ఇంకా యీ సర్రియలిజం తెస్తే అసలు గాభరా పడి చదవడమే మానేస్తారేమో!" అన్నాడు చెలం. Man of little faith.
శ్రీ శ్రీ ఏం జవాబు చెపితేనేం! మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవైయేళ్ళ తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొనివున్న చెలం మానవత్వం మీద శ్రీ శ్రీ కి వున్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవొంచాడు.
శ్రీ శ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా!
శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా -ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం. Pass it on.
పదేళ్ళు ఆగండి. ఈలోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా influence చేసినవి వుంటే -మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీ శ్రీ పద్యాల్ని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో.
స్వయంగా చదవండి. చదివిం తరువాత శ్రీ శ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి. ఎవరి అభిప్రాయమూ అడగకండి. ముఖ్యం, కవి అనేవాణ్ణి -చెప్పినా వినకండి.
3
కవిత్వపు కాలం అంతమయింది. నగలూ, అపురూపపు కళలూ, సూర్య కిరణాల్ని ఎరగని అందాలూ గతిస్తున్నట్టే కవిత్వమూ గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. "ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?" అని దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీ శ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వొస్తుంది.
చెప్పుకో తగిన ఒక్క కవీ, మన కృష్ణ శాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన, తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు లేపి ఆకాశ మార్గాన విహరింప జేసి, రక్షించాడు శ్రీశ్రీ.
ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.
కృష్ణశాస్త్రి పద్యాలు చదివి, అర్థం విడదీసి, "ఏది గొప్పతనం చూప" మంటే చూపలేక పోయినాను పూర్వం. శ్రీ శ్రీ అగ్గిపుల్లలోనూ, కుక్కపిల్లలోనూ, కవిత్వం చూపలేను ఈనాడూ.
అగ్గిపుల్లవంక -ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను.
కుక్కపిల్లని -ముఖ్యం తల్లిచచ్చిన దిక్కులేని గజ్జికుక్కపిల్లని పెంచమంటాను.
మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, "ఈ పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా ఈ పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?
పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక మళ్ళేఏ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీ శ్రీ.
"ధ్వంసం చేసి రోడ్డు వేశాడు-"
"పదండి ముందుకు
పదండి తోసుకు-" అంటున్నాడు
తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారో, ఆ నిరంకుశాధికారుల నెత్తిమీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీదచూపే అభిమానం చాలదు శ్రీ శ్రీ కి. తామూ యింకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని.
శ్రీ శ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సులోంచి పాత మూలుగులూ, serenadings, మూర్చలూ, వేదాంతాలూ, మత్తులూ పోయి- దేశాలకి, ఉత్సాహాలకి, కదిలిపోయే యువక సైన్యాలకి, నూతన యుగ నిర్మాతలకి background music కింద marching band కింద, కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినపడ్డంలేదా, శ్రీ శ్రీ గీతాల్లో: వినపడకపోతే-
"ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి!"
ప్రపంచం ఎట్లాపోతేనేం? మీకెందుకు లెండి.
"అదృష్టవంతులు మీరు ---
వడ్డించిన విస్తరి మీ జీవితం"
ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు, యుద్ధాలనించి, ముష్టివాళ్ళనించి, విప్లవాల నించి, అనాథల నించి, అశాంతినించి, సత్యాన్నించి, మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు.
వీళ్ళందరి అధ్యక్షుడూ మీదేవుడు. మీ డబ్బుకి దాసుడు. మీ నంగిపూజలకీ స్వార్థ ప్రార్థనలకీ వశ్యుడు. దొంగభక్త పరాధీనుడు.
ఇన్ని బాంబులు కురుస్తున్నా, ఇన్ని మర ఫిరంగులు మోగుతున్నా, ఇన్ని చెరసాలలు నిండుతున్నా, ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు -పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని! ఇంక లాభం లేదని మీ ఆటలు సాగవని!
ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచం నిర్మాణ కర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీ శ్రీ.
ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, scandals లేవో ఆలోకాన్ని dream చేస్తున్నాడు యీ కవి.
మీ ఆనందంకన్న ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు, నరకమంటే అట్లాంటి లోకం.
శ్రీ శ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీ శ్రీ!
దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్థంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, ఇవన్నీ అర్థంకాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాల్ని ఏకంచేసి పలుకుతున్నాడు శ్రీ శ్రీ.
మీ కెందుకు లెండి. పట్టు దిళ్ళలో తలలు దూర్చి, భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతో- "All is well with the world" అనుకుంటో నిద్రపొండి.
నిర్భాగ్యులం కొందరం మాకు---
"అన్నీ సమస్యలే, సందేహాలే."
"ఏవో,
ఏవేవో, ఏవేవో
ఘోషలు వినబడుతున్నాయ్!గుండెలు విడిపోతున్నాయ్!"
మీకు కవిత్వం కావాలా?
అరుగో ఆ మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి"కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.
"రాబందుల రెక్కల చప్పుడు
పయోధర ప్రచండ ఘోషం
ఝంఝానిల షడ్జధ్వానం"
విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి.
బెజవాడ
17-7-40
చెలం
మహాప్రస్థానం కవితలు
జగన్నాథుని రథచక్రాలు
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడులేని,
గూడులేని
పక్షులార! భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు-
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి.
మీ రక్తం కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి,
ఓ వ్యథానివిష్టులార!
ఓ కథావశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!
వస్తున్నాయొస్తున్నాయి....
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్!
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
మెయిల్దారిని
బయల్దేరిన
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!
సింహాచలం కదిలింది,
హిమాచలం కరిగింది,
వింధ్యాచలం పగిలింది-
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం....
మహానగా లెగురుతున్నాయి!
మహారథం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!
ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ-
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం పటునిరాశ-
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును....
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీగాథలు
అవగాహన నాకవుతాయి!
పతితులార!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీకోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట,
అడావుడిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్ర ప్రళయ ఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!
అరె ఝాఁ! ఝాఁ!
ఝటక్, ఫటక్ ….
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంస నచణ
హింస రచన!
విషవాయువు, మరఫిరంగి
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది!
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది!
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!
మీ రాజ్యం మీరేలండి!
1ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ. చెలం చూశాడు. మాట్లాడాడు. కాని
శ్రీ శ్రీని ఎరగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి-"ఇదేమిటి. ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీ శ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా వూడ్చుకు పోతోవుంటే! హృదయాలమీది పెంకులు పగిలి పోతున్నాయి. బైట వినబడుతున్నాయి. యిట్లా రండి, రోడ్డు మీదికి," అన్నాడు.అంతవరకు శ్రీ శ్రీ కవిత్వాన్ని ఎరక్క పోవడం చెలంలో క్షమించతగిన విషయం కాదు. కాని చెలవాటికి క్షమించాలి చెలాన్ని.
కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చెలానికి impatience, అనుమానం. శబ్ద సౌందర్యంలో తృప్తిపడి సంతోషించవలసిందే కాని, చెప్పే దానికి అర్థం వెదకటం అవివేకం అని. కాని నీరసపు కళాచతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించీ, విచారించీ, తప్పుకోవడం చెలానికి చాతకాదు. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కి. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు. కవులూ చెయ్యరు -ఎంకీ, శ్రీ శ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.
తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవ లనిపిస్తుంది. ఎందుకంటే-కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీ శ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ.
2శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగ వేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపచేస్తారు. బుద్ధి వున్న వాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి. కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటో అగచాట్లు పడి కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల వెనక అణగి చచ్చి, కొనవూపిరితో ఆరిపోలేక మిణుకు మిణుకు మంటో వుంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త అర్థంలేని న్యూసెన్సుగా తోస్తాయి శ్రీ శ్రీ పద్యాలు. సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి ఈ వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!అదీ సాధారణంగా కల్చెర్డు రీడర్సు సంగతి.కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని వెయ్యికన్నులతో కనిపెడుతూ వుంటారు. కనపడ్డదా, ఆనాటినుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించీ, కవిని గురించీ, ప్రచారం మొదలు. సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆకొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తీ, కాల పరిస్థితులను బట్టి చప్పరించడమూ- తమ కావ్యాలనించో, ఇతర కావ్యాలనించో, సంగ్రహించబడిన దనడమూ -విప్లవ కారణ మనడమూ, నిర్జీవమనడమూ -కవిని గురించి చాలా righteous indignation తోనో, జాలిపడుతోనో, చాలా సానుభూతి దయా వున్నట్లు ప్రస్తావించడమూ వీళ టెక్నిక్.
"శ్రీ శ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని కవిని అడిగారా, అతను "దానికేం చాలా బావుంటుంది. ఓ బాగా వ్రాస్తాడు. నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-" అన్నాడా, అతను చాలా సన్నిహిత ప్రియమిత్రు డన్నమాట కవికి. చిరునవ్వుతో శ్రీ శ్రీ విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి పోతున్నాడు జాగ్రత్త!
శ్రీ శ్రీ కవిత్వానికి Motive springs చూపుతాడు ఆ మిత్రుడు. తప్పదు."ఆకలి పాట ---కటిక దరిద్రుడు అతను -తిండిలేక వీథులు తిరిగాడు--- పాపం" అంటో ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని explain చేస్తాడు.నిజమా? నిజమైతే శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు."ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్య ఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీదపడి బతుకుతున్న యీ Parasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.ప్రపంచంలో ఈనాడు ప్రతిదేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మ యుద్ధం చేసే ధీరులు ఈ నాడూ పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే, అనాదిగా తనకోసం ప్రయత్నించే dreamers మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన rotten channels ఈ నాటి సారస్వత సభాపతులు.
తాము బతికివున్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికివున్న శవాలు ఈ నాటికీ తాము ముప్ఫైయేళ్ళక్రింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు మీద కాఫీ యిడ్డెన్ల ముందు Inspire ఐ ప్రగల్భాలు పలికే ఈ రసికులు, తాము తెచ్చిన సంస్కారమే యింక సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి, ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చెయ్యడానికి మీదికి ఉరికే భగీరథ ప్రవాహాల్ని ఊరి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు.
మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి "శ్రీ శ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్త తనాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే, ఇంకా యీ సర్రియలిజం తెస్తే అసలు గాభరా పడి చదవడమే మానేస్తారేమో!" అన్నాడు చెలం. Man of little faith.
శ్రీ శ్రీ ఏం జవాబు చెపితేనేం! మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవైయేళ్ళ తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొనివున్న చెలం మానవత్వం మీద శ్రీ శ్రీ కి వున్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవొంచాడు.
శ్రీ శ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా!
శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా -ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం. Pass it on.
పదేళ్ళు ఆగండి. ఈలోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా influence చేసినవి వుంటే -మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీ శ్రీ పద్యాల్ని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో.
స్వయంగా చదవండి. చదివిం తరువాత శ్రీ శ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి. ఎవరి అభిప్రాయమూ అడగకండి. ముఖ్యం, కవి అనేవాణ్ణి -చెప్పినా వినకండి.
3
కవిత్వపు కాలం అంతమయింది. నగలూ, అపురూపపు కళలూ, సూర్య కిరణాల్ని ఎరగని అందాలూ గతిస్తున్నట్టే కవిత్వమూ గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. "ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?" అని దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీ శ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వొస్తుంది.
చెప్పుకో తగిన ఒక్క కవీ, మన కృష్ణ శాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన, తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు లేపి ఆకాశ మార్గాన విహరింప జేసి, రక్షించాడు శ్రీశ్రీ.
ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.
కృష్ణశాస్త్రి పద్యాలు చదివి, అర్థం విడదీసి, "ఏది గొప్పతనం చూప" మంటే చూపలేక పోయినాను పూర్వం. శ్రీ శ్రీ అగ్గిపుల్లలోనూ, కుక్కపిల్లలోనూ, కవిత్వం చూపలేను ఈనాడూ.
అగ్గిపుల్లవంక -ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను.
కుక్కపిల్లని -ముఖ్యం తల్లిచచ్చిన దిక్కులేని గజ్జికుక్కపిల్లని పెంచమంటాను.
మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, "ఈ పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా ఈ పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?
పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక మళ్ళేఏ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీ శ్రీ.
"ధ్వంసం చేసి రోడ్డు వేశాడు-"
"పదండి ముందుకు
పదండి తోసుకు-" అంటున్నాడు
తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారో, ఆ నిరంకుశాధికారుల నెత్తిమీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీదచూపే అభిమానం చాలదు శ్రీ శ్రీ కి. తామూ యింకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని.
శ్రీ శ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సులోంచి పాత మూలుగులూ, serenadings, మూర్చలూ, వేదాంతాలూ, మత్తులూ పోయి- దేశాలకి, ఉత్సాహాలకి, కదిలిపోయే యువక సైన్యాలకి, నూతన యుగ నిర్మాతలకి background music కింద marching band కింద, కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినపడ్డంలేదా, శ్రీ శ్రీ గీతాల్లో: వినపడకపోతే-
"ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి!"
ప్రపంచం ఎట్లాపోతేనేం? మీకెందుకు లెండి.
"అదృష్టవంతులు మీరు ---
వడ్డించిన విస్తరి మీ జీవితం"
ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు, యుద్ధాలనించి, ముష్టివాళ్ళనించి, విప్లవాల నించి, అనాథల నించి, అశాంతినించి, సత్యాన్నించి, మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు.
వీళ్ళందరి అధ్యక్షుడూ మీదేవుడు. మీ డబ్బుకి దాసుడు. మీ నంగిపూజలకీ స్వార్థ ప్రార్థనలకీ వశ్యుడు. దొంగభక్త పరాధీనుడు.
ఇన్ని బాంబులు కురుస్తున్నా, ఇన్ని మర ఫిరంగులు మోగుతున్నా, ఇన్ని చెరసాలలు నిండుతున్నా, ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు -పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని! ఇంక లాభం లేదని మీ ఆటలు సాగవని!
ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచం నిర్మాణ కర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీ శ్రీ.
ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, scandals లేవో ఆలోకాన్ని dream చేస్తున్నాడు యీ కవి.
మీ ఆనందంకన్న ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు, నరకమంటే అట్లాంటి లోకం.
శ్రీ శ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీ శ్రీ!
దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్థంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, ఇవన్నీ అర్థంకాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాల్ని ఏకంచేసి పలుకుతున్నాడు శ్రీ శ్రీ.
మీ కెందుకు లెండి. పట్టు దిళ్ళలో తలలు దూర్చి, భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతో- "All is well with the world" అనుకుంటో నిద్రపొండి.
నిర్భాగ్యులం కొందరం మాకు---
"అన్నీ సమస్యలే, సందేహాలే."
"ఏవో,
ఏవేవో, ఏవేవో
ఘోషలు వినబడుతున్నాయ్!గుండెలు విడిపోతున్నాయ్!"
మీకు కవిత్వం కావాలా?
అరుగో ఆ మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి"కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.
"రాబందుల రెక్కల చప్పుడు
పయోధర ప్రచండ ఘోషం
ఝంఝానిల షడ్జధ్వానం"
విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి.
బెజవాడ
17-7-40
చెలం
మహాప్రస్థానం కవితలు
జగన్నాథుని రథచక్రాలు
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శనిదేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడులేని,
గూడులేని
పక్షులార! భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కృతులు-
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి.
మీ రక్తం కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి,
ఓ వ్యథానివిష్టులార!
ఓ కథావశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!
వస్తున్నాయొస్తున్నాయి....
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్!
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
మెయిల్దారిని
బయల్దేరిన
రథచక్రాల్, రథచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి!
సింహాచలం కదిలింది,
హిమాచలం కరిగింది,
వింధ్యాచలం పగిలింది-
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం....
మహానగా లెగురుతున్నాయి!
మహారథం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!
ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ-
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం పటునిరాశ-
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును....
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీగాథలు
అవగాహన నాకవుతాయి!
పతితులార!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీకోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట,
అడావుడిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్!
రథచక్ర ప్రళయ ఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!
అరె ఝాఁ! ఝాఁ!
ఝటక్, ఫటక్ ….
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంస నచణ
హింస రచన!
విషవాయువు, మరఫిరంగి
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది!
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది!
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెగిరిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళులేచి,
జనావళికి శుభం పూచి-
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!
వచ్చేశాయ్, విచ్చేశాయ్,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్,
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్,
రథచక్రాల్, రథచక్రాల్,
రారండో! రండో! రండి!
ఈలోకం మీదేనండి!
మీ రాజ్యం మీరేలండి!
కన్యాశుల్కము
- గురజాడ అప్పా రావు పంతులు గారు
పాత్రలు
1.
అగ్నిహోత్రావధాన్లు
కృష్ణరాయపురం అగ్రహారీకుడు
2.
వెంకమ్మ
అగ్నిహోత్రావధాన్లు భార్య
3.
బుచ్చమ్మ
అగ్నిహోత్రావధాన్లు పెద్ద కూతురు
4.
సుబ్బమ్మ
అగ్నిహోత్రావధాన్లు చిన్న కూతురు
5.
వెంకటేశం
అగ్నిహోత్రావధాన్లు కుమారుడు
6.
కరటక శాస్త్రి
అగ్నిహోత్రావధాన్లు బావమరది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు
7.
శిష్యుడు
కరటక శాస్త్రి శిష్యరికం చేసి, పెళ్ళికూతురుగానూ, దాసరి గానూ నటించును
8.
లుబ్ధావధాన్లు
రామచంద్రపురం అగ్రహారీకుడు
9.
మీనాక్షి
లుబ్ధావధాన్లు కుమార్తె, వితంతువు
10.
రామప్పంతులు
రామచంద్రపురం అగ్రహారం కరణం
11.
గిరీశం
లుబ్ధావధాన్లు పినతల్లి కొడుకు, వెంకటేశమునకు చదువుచెప్పు నయ్యవారు
12.
సౌజన్యారావు పంతులు
వకీలు
13.
భీమారావు పంతులు
ప్లీడరు
14.
నాయుడు
ప్రైవేటు వకీలు
15.
పూజారి గవరయ్య
దెయ్యాల మాంత్రికుడు, వైద్యుడు
16.
మధురవాణి
వేశ్య
17.
ఇతరులు
బంట్రోతు,
పూటకూళ్ళమ్మ, సిద్ధాంతి, పోలిశెట్టి, హెడ్ కనిష్టీబు, బైరాగి, దుకాణదారు,
గ్రామ మునసబు, యోగిని, అసిరిగాడు, మనవాళ్ళయ్య, వీరేశ, తహసీల్దారు, డిప్టీ
కలక్టరు, వగయిరా.
ప్రథమాంకము
ఒకటవ స్థలము: విజయనగరంలో బొంకుల దిబ్బ
[గిరీశము ప్రవేశించును]
గిరీశ:
సాయంకాలమైంది.
పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు
పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను. ఈవాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ,
నాకూ యుద్ధవైఁ పోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వొచ్చింది గాని,
పూర్రిచర్డు చెప్పినట్లు, పేషన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు
లాగేస్తే ఇదివరకు యెన్ని పర్యాయములు వూర్కుంది కాదు. యిప్పుడేదో కొంచం
డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవడైనా
చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ
వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి
కోడలికి లవ్ లెటర్ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి
చేస్తారు.
శీఘ్రంగాయిక్కణ్ణించి బిచాణా యెత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది.
నేను యేమో ఉద్యోగాలూ ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో వుంది, పూర్ క్రీచర్!
యెవరా
వస్తున్నది? నాప్రియశిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిస్‌మిస్
శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనపడుతుంది.
వీణ్ణి కొంచెం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పేమిషమీద వీడితో వీడి
వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వదుల్తాయి; అట్నుంచి
నరుక్కురమ్మన్నాడు.
[వెంకటేశం ప్రవేశించును]
యేమివాయ్ మైడియర్ షేక్స్పియర్, ముఖం వేలవేసినావ్?
వెంక:
యిక మీర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చెయడంచాత నాపరీక్ష పోయిందని అన్నారు.
గిరీశ:
నాన్సెన్స్.
మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరుకి నన్ను చూస్తే
కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్ చేశాడు గాని, లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్
కావడవేఁవిటి! అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను
చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పాపర్లో యేకేశాను. అప్పట్నుంచీ
నేనంటే వాడిక్కడుపుడుకు.
వెంక:
మీవల్ల
నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు
చెప్పడవేఁ కాని, ఒక మారయినా ఒక ముక్క చెప్ప్పిన పాపాన్ని పోయినారూ?
గిరీశ:
డామిట్.
ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిటూడ్, నాతో
మాట్లాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్. ఆ మాట కొస్తే నీకున్న లాంగ్వేజీ నీ
మాష్టరుకుందీ? విడో మారియేజి విషయవై, నాచ్చి కొశ్చన్ విషయమై నీకు యెన్ని
లెక్చర్లు యిచ్చాను! నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు.
పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్ కాజెస్ ఫర్ది
డిజెనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చేసరికి
ప్రొఫెసర్లు డంగయి పోయినారు. మొన్న బంగాళీవాడు ఈ వూళ్ళో లెక్చరిచ్చినప్పుడు
ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్, చుట్ట నేర్పినందుకు
థాంక్ చెయ్క, తప్పు పట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా
బోధపడక పోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లింత
గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణీ
మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి
పట్టుబణ్ణా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే.
సూత ఉవాచ:
ఖగపతి యమృతముతేగా
భుగభుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ |క|
ఇది
బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన
కుఱ్ఱవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాష్టరు మీద నావళ్ళు మహా మండుతోంది. ఈ
మాటు వంటరిగా చూసి వక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా,
వూరికి వెళతావా?
వెంక:
వెళ్ళాల్నుందిగాని, పాసుకాలేదంటే మాతండ్రి చావ కొడతాడు.
గిరీశ:
ఆ గండం తప్పే వుపాయం నేంచెబుతాను, నేంచెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ?
వెంక (గిరీశం కాళ్ళు పట్టుకొని):
మీ శలవు యెప్పుడు తప్పాను? మాతండ్రికి మా చడ్డ కోపం. పాసు కాలేదంటే యెవిఁకలు విరక్కొడతాడు (కన్నీరు చేత తుడుచుకొనును).
గిరీశ:
దటీజ్
టిరనీ -యిదే బంగాళీ కుఱ్ఱవాడవుతే యేంజేస్తాడో తెలిసిందా? తాతయేది
తండ్రయేది కఱ్ఱ పట్టుకుని చమ్డాలెక్కగొడతాడు; మీ అగ్రహారం కుఱ్ఱవాళ్ళు మరి
యవళ్ళయినా యీ వూళ్ళో చదువుకుంటున్నారా?
వెంక:
మరి యెవళ్ళూ లేరు.
గిరీశ:
ఐతే
నేను వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరీక్ష పాసయినావని మీ
వాళ్ళతో చెబుతాను; అక్కడ నీకు చదువు చెప్పడానికి వొచ్చానని మీ వాళ్ళతో
చెప్పు; శెలవులాఖర్ని నిన్ను టవును స్కూల్లో పైక్లాసులో ప్రవేశ పెడతాను.
వెంక:
మీరే వస్తే బతికాను మరేవిఁటి; కిందటి మాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది.
గిరీశ:
ఆల్రైట్
గాని -నాకిక్కడ వ్యవహారములలో నష్టం వస్తుందే- మునసబుగారి పిల్లల్కి
శలవుల్లో పాఠాల్చెపితే ఫిఫ్టీ రుపీజ్ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁ యంత
లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు బార్బరస్
పీపిల్ గదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో, నీవు నన్ను గురించి
మీ మదర్ తో గట్టిగా రికమెండ్ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలకి వక
జాబితా రాయి -కొంచం డబ్బు చేతిలో వుంటేనేగాని సిగర్సుకి యిబ్బంది
కలుగుతుంది. నోటుబుక్కు తీసి రాయి. 1. రోయల్ రీడర్, 2. మాన్యూల్ గ్రామర్,
3. గోష్ జియామెట్రీ, 4. బాస్ ఆల్జీబ్రా, 5. శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్, 6.
నలచరిత్ర, 7. రాజశేఖర చరిత్ర, 8. షెపర్డు జనరల్ ఇంగ్లీష్, 9. వెంకట
సుబ్బారావు మేడీజీ, యెన్ని పుస్తకాలయినాయి?
వెంక:
తొమ్మిది.
గిరీశ:
మరొక్కటి
రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి
చాల్ను. మీ వాళ్ళుగాని యింగ్లీషు మాట్లాడ మన్నట్టాయినా తణుకూ బెణుకూ
లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంతవరకు యాకరు పెట్టు.
నీదగ్గర కాపర్సు యేవైఁనా వున్నవా? నాదగ్గర కరన్సీ నోట్లు వున్నవి గాని
మార్చ లేదు. పదణాలు పెట్టి ఓశేరు కాశీ మిఠాయికొని పట్టుకురా. రాత్రి మరి
నేను భోజనం చెయ్యను. మార్కట్టుకి వెళ్ళి బండీ కుదిర్చి దానిమీద నా
ట్రావెలింగ్ ట్రంక్కు వేశి మెట్టుదగ్గిర బండీ నిలబెట్టివుంచు. యిక్కడ
కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంతరాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను.
గోయెట్వన్స్, మైగుడ్ బోయ్. నువ్ బుద్ధిగావుండి చెప్పిన మాటల్లా వింటూంటే
నిన్ను సురేంద్రనాథ్ బానర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో
వస్తానన్నమాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత్త. (వెంకటేశం
నిష్క్రమించును.)
గిరీశ:
ఈ వ్యవహారమొహటి ఫైసలైంది. ఈరాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ యివ్వందీ పోకూడదు.
[రాగ వరసతో పాడును]
నీ సైటు నాడిలైటు;
నిన్ను మిన్న
కానకున్న
క్వైటు రెచడ్ ప్లైటు
మూనులేని నైటు.
[ఒక బంట్రోతు ప్రవేశించును]
బంట్రోతు:
నేను పొటిగరాప్పంతులుగారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరాపుల కరీదు యెంటనే యిప్పించమన్నారండి.
గిరీశ (విననట్టు నటించుతూ):
ఫుల్లుమూను నైటటా,
జాసమిన్ను వైటటా,
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!
బంట్రోతు:
యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళ లాగూరుకుండే వాణ్ణి కానండి.
గిరీశ:
అయ్యకోనేటికి తోవ ఇదే!
బంట్రోతు:
యక్కడి శెవిఁటి మాలోకం వచ్చిందయ్యా.
గిరీశ:
కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లోగాని యిటివేపులేదు.
బంట్రోతు (గట్టిగా చెవిదగ్గిర నోరుపెట్టి):
పొటిగరాపులు కరీదిస్తారా యివ్వరా?
గిరీశ:
బస, రాధారీ బంగళాలో చెయ్యవచ్చును.
బంట్రోతు (మరీ గట్టీగా):
యాడాది కిందట మీరూ సాందీ కలిసి యేసుకున్న పొటిగరాపుల కరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు.
గిరీశ:
ఓహో
నీవటోయ్, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు. నింపాదిగా మాట్లాడు. రేపు
వుదయం యెనిమిది ఘంటలకి పూటకూళ్ళమ్మ యింటికి వస్తే అణా ఫయిసల్తో
సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ?
బంట్రోతు:
మాటల్తో కార్యం లేదు. మొల్లో శెయ్యెట్టి నిల్చున్న పాట్ని పుచ్చుకొమ్మన్నారండి.
గిరీశ:
పెద్ద
మనిషివి గదా; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద మనిషి. యీ
చుట్ట చూడు యంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు దీన్ని.
రేప్పొద్దున్న రా రెండు కట్టలిస్తాను.
బంట్రోతు:
శిత్తం సొమ్ము మాటేం శలవండి.
గిరీశ:
చెప్పాను కానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు.
బంట్రోతు:
మాలడికొడుకు శండాలుడు కాకుంటే మరేటండి.
గిరీశ:
నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీ పట్టుకు ప్రమాణం చేస్తాను.
బంట్రోతు:
శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యక పోతే నా ఆబోరుండదండి.
గిరీశ:
ఆహా.
నీ ఆబోరు ఒహటీ, నా ఆబోరు ఒహటీనా? (బంట్రోతు నిష్క్రమించును.) ఇన్నాళ్ళకి
ఝంఝప్పోస వినియోగంలోకి వచ్చింది. థియాసొఫిస్టుసు చెప్పినట్లు మన ఓల్డు
కస్టంసు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్పరిచారు.
ఆత్మానుభవం అయితేనేగాని తత్వం బోధ పడదు. ఈ పిశాచాన్ని వదుల్చుకునేసరికి తల
ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్రబుద్ధేః పలాయనం. పెందరాళే యీవూర్నించి
వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం. మేక్ హే
వైల్దీ సన్ షైన్స్ అన్నాడు.
2-వ స్థలము. మధురవాణి యింట్లో గది.
[రామప్పంతులు కుర్చీ మీద కూర్చుండును, మధురవాణి యెదుట నిలుచుండును]
రామ: (జేబులోనుంచి చుట్ట తీసి పంటకొన కొరికి) పిల్లా, అగ్గిపుల్ల.
మధుర:
(అగ్గి పుల్ల వెలిగించి చుట్టకందించుచుండగా రామప్పంతులు మధురవాణి
బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి యడంగా
నిలబడి కోపం కనపర్చుతూ) మొగవాడికయినా ఆడదానికైనా నీతి వుండాలి తాక వద్దంటే
చెవిని పెట్టరు గదా?
రామ:
నిన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి
మా వూరు లేవతీసుకు వెళ్ళడానికి సిద్ధవఁయ్యుంటే ఇంకా యవడో కోన్కిస్కాహే గాడి
ఆడాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి?
మధుర:
వేశ్య అనగానే అంత చులకనా పంతులుగారూ? సానిదానికి మాత్రం నీతి
వుండొద్దా? మాపంతులుగార్ని పిలిచి "అయ్యా యిటు పైని మీ తోవ మీది , నా తోవ
నాది" అని తెగతెంపులు చేసుకున్న దాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు
దెప్పి పొడిచినట్టు ఆయన వైదీకైతేనేమి, కిరస్తానం మనిషైతేనేమి,
పూటకూళ్ళమ్మను ఉంచుకుంటేనేమి నన్ను యిన్నాళ్ళూ ఆ మహారాజు పోషించాడు కాడా?
మీరంతకన్న రసికులయినా, నా మనసు యంత జూరగొన్నా, ఆయన యడల విశ్వాసం నాకు
మట్టుకు వుండొద్దా?
రామ:
పెద్ద పెద్ద మాటాలు ప్రయోగిస్తున్నావు! వాడి బ్రతుక్కి వాడు
పూటకూళ్ళామ్మని వుంచుకోవడం కూడానా! పూటకూళ్ళమ్మే వాణ్ణి వుంచుకొని యింత
గంజి పోస్తుంది.
మధుర: అన్యాయం మాటలు ఆడకండి. ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది.
రామ:
అహహ (నవ్వుతూ) యేం వెఱ్ఱి నమ్మకం! నీవు సానివాళ్ళలో తప్ప పుట్టావు.
గిరీశంగారు గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేవిఁటి, మా వూళ్ళోవున్న
లుబ్ధావుధాన్లు పింతల్లికొడుక్కాడూ వీడూ! గిఱ్ఱడని మేం పిలిచే వాళ్ళం.
బొట్లేరు ముక్కలు నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా వక్కటే వుద్యోగం
దేవుఁడు రాశాడు. యేవిఁటో తెలిసిందా? పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి
అరవ చాకిరీ చెయ్యడం.
మధుర: యీ మాటలు ఆయన్ని అడుగుదునా?
రామ: తప్పకుండా. కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు.
మధుర: అయినా ఆయన గుణ యోగ్యతలతో నాకేం పని? యేవఁయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనపడవ్.
రామ: అయితే అతడికి విడాకులు యెప్పుడిస్తావు?
మధుర: యిక్కడి రుణాలూ పణాలూతీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వందలూ యిప్పిస్తే యీ క్షణం తెగుతెంపులు చేసుకుంటాను.
రామ:
అయితే యింద (జేబులోనుండి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి
అందుకొంటుండగా రామప్పంతులు చెయ్యి పట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి
విడిపించుకొని నోట్లు పారవేసి దూరముగా నిలిచుఁను.)
మధుర: మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్నయం మీద నిలవని మనిషి యేవఁన్నమ్మను?
రామ: (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) లెక్క పెట్టి చూసుకో.
మధుర:
ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండి నా
మనస్సు కనిపెట్ట జాలినారుకారు గదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను
డబ్బు కక్కూర్తి మనిషిని కాను. (నోట్లు యివ్వబోవును)
రామ:
వద్దు!వద్దు!వద్దు! నీ మనసు కనుక్కుందావఁని అన్నమాటగాని మరొకటి కాదు.
గాని, యీ గిరీశం గుంట వెధవవీడెవడో మా గొప్పవాడనుకుంటున్నావేవిఁటి ?
మధుర:
ఆయన్ని నా యదట తూల్నాడితే యిదుగో తలుపు తీశాను విజయం చెయ్యండి.
(తలుపుతీసి వక చేత పట్టుకుని రెండవ చేతి వేలుతో పైకి తోవ చూపును), అదుగో
గిరీశంగారే వస్తున్నారు, ఆ మాటేదో ఆయన్తోటే చెప్పండి.
రామ: వేళాకోళం ఆడుతున్నావూ?
గిరీశం: (వాకట్లోనుంచి) మై డియర్.
రామ: (ఆత్మగతం) అన్న, వేళగానివేళొచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, యేవిఁటి సాధనం, యీ మంచం కింద దూరదాం. (మంచంకింద దూరును.)
[గిరీశం ప్రవేశించును]
గిరీశం: వెల్, మై డియర్ ఎంప్రెస్. (బుజము మీద తట్టబోవును.)
మధుర: (ఒసిలి తప్పించుకొని) ముట్టబోకండి.
గిరీశం: (నిర్ఘాంతపోయి)అదేమిటి ఆ వికారం.
మధుర: ఆఖరు వికారం.
గిరీశం:
(ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సాని
వాళ్ళకి కర్న పిశాచివుంటుంది కాబోలు (పైకి) మైల బడితే స్తానం చేసి వేగిరం
రా
మధుర: ఇప్పుడేం తొందర, తలంటు కుంటాను.
రామ: (ఆత్మగతం) చబాష్, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకో నివ్వ కుండా యెత్తు యెత్తింది!
గిరీశం: మైలా గియిలా మా యింగ్లీషువారికి లక్ష్యం లేదు ఇలా రా (దగ్గరికి చేరును.)
మధుర:
(వేలు చూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను
కిరస్తానం యింకా కాలేదే ? మీరు కిరస్తానం అన్న మాట ఇప్పుడే ఒహరు చప్పగా
విన్నాను.
రామ: (తనలో) నే చెప్పానంటుందా యేమిటి!
గిరీశం:
ఒకరు చప్పగా విన్నావూ? యవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి
మగుదూర్ వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి యవడికి గుండె వుంది? ఆ
మాటలు విని నాతో చెప్పడానికి నీ కెక్కడ గుండుంది ? చెప్పు!
రామ: (తనలో) తంతాడు కాబోలు, యరక్క చిక్కడ్డాను.
మధుర: మొగాడే చెప్పాలా యేవిఁటి? ఆడవాళ్ళకి దేవుఁడు నోరివ్వలేదా?
గిరీశం:
(తనలో)పూటకూళ్ళముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని
నోరుబెట్టుకు బతకమనే దేవుఁడు చేశాడు. పరువైన ఆడది నీ యింటికెందుకొస్తుంది?
మధుర:
పరవైన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకురాకూడదు? ముందు
కూచోండి, తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకోండి, అదుగో అగ్గిపెట్ట.
గిరీశం:
ముట్టుకోడానికి వల్లలేకపోతేఅగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా
పెట్టిపుట్టాను కానా? యీవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని ఉత్సాహభంగం చేశావ్.
మధుర: యెవిఁటా వుత్సాహం?
గిరీశం:
యిదిగో జేబులో హైదరాబాద్ నైజాంవారి దగ్గిరించి వచ్చిన ఫర్మానా. మా
నాస్తం నవాబ్ సదరదలాత్ బావురల్లీఖాన్ ఇస్పహన్ జంగ్ బహద్దర్ వారు సిఫార్స్
చేసి వెయ్యి సిక్కా రూపాయలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు.
అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం.
రామ: (తనలో) యెవిఁట్రా వీడి గోతాలు!
గిరీశం: యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్ వస్తావా?
మధుర: (తల తిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసికెళ్ళండి.
గిరీశం: (నిర్ఘాంతపోయి)పూటకూళ్ళమ్మ యేవఁయినా పెంట పెడుతుందా యేవిఁటి?
మధుర: మీకే తెలియాలి.
గిరీశం:
నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవ డేమాటన్నా నామీద
నమ్మడవేఁనా? యీ ఘోరవైఁన అబద్ధాలు నీతో యవడు చెబుతున్నాడో
కనుక్కోలేననుకున్నావా యేవిఁటి? సప్తసముద్రాల్దాటినా వాడి పిలకట్టుకుని
పిస్తోల్తో వళ్ళు తూట్లు పడేటట్టు ఢాఢామని కొట్టకపోతినట్టయినా నా పేరు
గిరీశమే నినద భీషణ శంఖము దేవదత్తమే! కబడ్దార్!
మధుర: సముద్రాలవతలకెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు
రామ: (తనలో) యీముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దైవమా!
గిరీశం:
(తనలో) థాంక్గాడ్. అయితే పూటకూళ్ళ దాన్దెబ్బతగల్లేదు. (పైకి) యిలాంటి
దుర్మార్గపకూతలు ఆ యిల్లాలు చెవిని పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపవఁంతా
నిన్ని చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు!
మధుర: వెధవముండకి పాతివ్రత్యం అన్న మాట యీనాటికి విన్నాను.
గిరీశం దానికి....కాదు ఆమెకి మొగుళ్ళేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.
మధుర మీరుండగా వెధవెలా అవుతుంది?
గిరీశం
నాన్సెన్స్ (దీనికో ఠస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగో విను. దాని నిజం
యేవిఁటంటే-పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేశే రోజుల్లో ఒక కునుష్టి
ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర
క్షణంలోన్నూ ఆ ముసలాడు పెళ్ళి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి
అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తెకట్ట్టాడన్నారు. కొందరు
కట్టాలేడన్నారు. పిల్ల తండ్రి, పెళ్ళికొడుకు వారసులు మీద దావా తెచ్చాడు.
పురోహితుడు వాళ్ళ దగ్గిర లంచంపుచ్చుకొని పుస్తె కట్టలేదని సాక్షవిఁచ్చాడు.
దాంతో కేసుపోయింది; మరి దాన్నెవరూ పెళ్ళాడారుకారు.
మధుర అయితే మరి మీకు తప్పులేదే?
గిరీశం
యేవిఁటి యీ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండావుంది! ఆహాఁ సరసం
విరసంలో దిగుతూందే! హాస్యానికంటేనివ్వేవఁవన్నా ఆనందవేఁ, నిజవఁనిగానీ
అంటివా, చూడు నా తడాఖా. యవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా
చెప్పవా?
మధుర రామ
రామ (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది!!
మధుర రామ! రామ! ఒహరు చెప్పేదేవిఁటి లోకవంతా కోడై కూస్తూంటేను?
[వీధిలోనుంచి తలుపు తలుపు అని ధ్వని]
గిరీశం (తెల్లపోయి) తలుపు తీయ్యొద్దు, తియ్యొద్దు ఆ పిలిచే మనిషి వెఱ్ఱి ముండ. మనుషుల్ని కరుస్తుంది.
మధుర తలుపు తీసేవుంది.
గిరీశం చంగున వెళ్ళి గడియ వేసెయ్.
మధుర అదుగో తలుపు తోసుకు వస్తూంది.
గిరీశం గెంటెయ్, గెంటెయ్.
మధుర ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకట్లోకి వెళ్ళును)
గిరీశం
మంచం కింద దూరదాం. (గిరీశం మంచం కింద దూరును.) (తనలో) దొంగలంజ
సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. యిదేవిఁటో మంచి మనిషి అని భ్రమించాను.
దీన్తస్సా గొయ్యా. సిగపాయి దీసి తందునుగాని యిది సమయం కాదు. అయినా
పోయేవాడికి నాకెందుకు రొష్టు, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా మీరు,
మహానుభావులు?
రామ నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ.
గిరీశం తమరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవైమందిని మీకు కన్యాదానం చేతునే.
రామ (తనలో) బతికాన్రా దేవుఁడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలా తెలిస్తే నేరాకపోదును సుమా.
గిరీశం మాట వినపళ్ళేదు. కొంచం యిసుంటా రండి. (రామప్పంతులు ముందుకు జరుగును, గిరీశం అతన్ని తప్పించుకుని గోడ వేపు చేరును.)
గిరీశం అన్నా, యీ లంజని యన్నడూ నమ్మకండి, యిలా యిరవైమందిని దాచగల శక్తుంది, దీనికి.
రామ రెండు వందలు దొబ్బిందిరా బాబూ.
గిరీశం నువ్వులేం జాగర్త చేశారా?
రామ అంతేనా?
గిరీశం మరేవిఁటీ?
[మధురవాణి, పూటాకూళ్ళమ్మ వల్లెవాటులో చీపురుగట్ట దాచిన్ని ప్రవేశింతురు]
మధుర: మీరన్న వ్యక్తి యిక్కడలేరంటే చెవినిబెట్టరు గదా!
పూట:
నీ యింట్లో జొరబడ్డాడని వీధులో వాళ్ళు చెబితే నీమాట నమ్ముతానా
యేవిఁటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు
నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్.
మధుర: యవడికిచ్చావో వాణ్ణే అడగవమ్మా.
పూట: వెధవకనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడ దాచావేవిఁటి?
మధుర:
నాకు దాచడం ఖర్మవేఁమిఁ నేను మొగనాల్నికాను. వెధవముండనీ కాను.
నాయింటికొచ్చేవాడు మహరాజులాగ పబ్లీగ్గావస్తాడు. (కంటితో మంచము కిందికి
చూపును.)
పూట:
మంచంకింద దాగాడేమో ? (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే
వుంది లేచిరా. (చీపురుగట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును)
రామ: ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండుముండా? (మంచంకింది నించి పైకి వచ్చి వీపు తడుముకొనును).
మధుర: ఆయన్నెందుకు కొట్టావు? నాయింటికొచ్చి యేవిఁటీ రవ్వ?
పూట: అయితె మంచం కిందెందుకు దూరాడూ?
మధుర: నీకెందుకా ఘోష? అదో సరసం.
పూట: ఇదో చీపురుగట్ట సరసం.
రామ:
(వీపు తడువుఁకొంటూ) నీ సిగతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసి
పోదును. నీ రంకు మొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను
ముందుకి తోసి తాను గోడవేపు దాగున్నాడు.
పూట: ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా పైకిరా.
గిరీశం: వెఱ్ఱప్పా! మంచం కిందికిరా, వెఱ్ఱి వదల గొడతాను.
పూట:
అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతా ననుకున్నావా యేవిఁటి? నీ సానిముండ
యెలా అడ్డుకుంటుందో చూస్తాను. (పూటకూళ్ళమ్మ ఒకవేపు నుంచి మంచం కిందికి
దూరును. మరి వక వేపు నుండి గిరీశం పైకివచ్చి రామప్పంతులు నెత్తి చరిచి
లఘువేసి పెరటి వేపు పరిగెత్తిపోవును.)
రామ: సచ్చాన్రా నాయనా (రెండు చేతులు తలపట్టుకొని ) మధురవాణీఇ యేవీఁ బేహద్బీ! కనిష్టీబు క్కబురంపించూ.
మధుర:
యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి
దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందురు గాని. (మధురవాణి రామప్పంతుల్ని
కౌగలించుకొని తల ముద్దెట్టుకుని చేత రాసి) యేవిఁ దుష్టు! మొగవాడయినవాడు
యెదుట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడతాడూ? వాడి పొంకం అణతురుగాని లెండి.
రామ:
గవురనుమెంటు జీతమిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? యీ
వెధవని పఙ్యండు కోర్ట్లంటా తిప్పక పోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నా
తమాషా!
మధుర:
( రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని ) మాటాడక వూరుకొండి. ( మంచం కింది
వేపు చూపించి నోరు మూసి ) దొంగ దెబ్బ కొట్టిన వాడిదే అవమానం; మీది కాదు.
రామ: నొప్పెవడిదనుకున్నావు? ఆ ముండ మంచం కిందనించి రాదేం? చీపురుకట్ట లాక్కో.
పూట: ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టేవుంది
కన్యాశుల్కము
తృతీయాంకము
1-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో
రామప్పంతులు యింట్లో సావిట్లో గది
[మధురవాణి ప్రవేశించును.]
మధుర:
యీ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది.
భూవుఁలన్నీ తాకట్టుపడి వున్నాయిట; మరి రుణంకూడా పుట్టదట వాళ్ళకీ వీళ్ళకీ
జుట్లుముడేసి జీవనం జేస్తూన్నాడు, యీ వూరు వేగం సవిరించి చెయ్ చిక్కినంత
సొమ్ము చిక్కించుకుని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి (పాడును) 'తెలియక
మోసపోతినే, తెలియక ' (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును.)
రామ: యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిఁటి, పాడూ.
మధుర: తరవాత ముక్కకేవుఁంది. మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.
రామ:
అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్నయప్రకారం రెండొందలూ
పట్ణంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేఁవుంది?
మధుర:
యేంచిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్రధానవైఁనట్టు మీ
మనసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు
రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీ దగ్గిర రెండొందలూ
పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోక పోతే
నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకుని
బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ఠ. మా యింటి సాంప్రదాయం ఇది పంతులుగారూ; అంతే
గాని లోకంలో సాన్లమచ్చని వూహించకండి.
రామ: భూవుఁలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం యవరన్నారోగాని; నేను మహరాజులా వున్నాను.
మధుర:
నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూ వాకలీ వదిలి మానం ప్రాణం మీ పాలు
చేసి నమ్మి మీ వెంట వచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండి; మిమ్మల్ని పాపం
చుట్టుకుంటుంది.
రామ: నేను మోసంచేసే మనిషినేనా?
మధుర:
అలాగయితే లుబ్ధావుధాన్లు గారికి పెళ్ళెందుకు కుదిర్చారు? నాకు
తెలియదనుకున్నారా యేవిఁటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీ కోసవేఁ యీ
యెత్తంతాను.
రామ: ఆహా! హా! హా! యిదా అనుమానం! కొంచం గెడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాణ్ణంటావా యేవిఁటి?
మధుర: చట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్.
రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్! యేదీ ముద్దు. (రామప్పంతులు మధురవాణిని ముద్దుబెట్టుకో బోవును.)
మధుర: (చేతులతో అడ్డి ముఖము ఓరజేసుకుని) వేళాపాళా లేదా? లుబ్ధావుధాన్లు పెళ్ళి తప్పించేస్తేగాని నేను ముద్దుబెట్టుకో నివ్వను.
రామ: అంతా సిద్ధవైఁం తరవాత, నా శక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దుబెట్టుకొనును.)
మధుర: సత్తువుందనా మోటతనం?
రామ:
నా సత్తువిప్పుడేం జూశావ్, చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే
గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిందగ్గిర్నుంచీ డీలా
అయిపోయినాను.
మధుర: యిదా డీలా? నా చెయి చూడండీ యలా కంది పోయిందో అన్నా, మోటతనం!
రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కన పడుతూంది.
మధుర: యీపెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.
రామ:
వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేల్లాయి ఆ
ముసలిగాడిదకొడుకు మీద నా లౌక్యప్రజ్ఞంతా వినియోగపర్చి పెళ్ళి సిద్ధంచేసి
యిప్పుడెలా తప్పించడం?
మధుర: యేం లౌక్యం చేశారు?
రామ:
అలా అడుగు. నా బుద్ధి సత్తువకూడా నీకు తెలుస్తుంది. లుబ్దావుధాన్లు
పరమలోభి. వాడి గుణం యిలావుండబోతుందని పోల్చారేమో అన్నట్టు చిన్నతనంలో
వాడికి పేరు పెట్టారు. పెళ్ళాడితే వల్లమాల్ని ధనం వస్తుందని ఆశపెట్టించాను.
మధుర: యలాచేశారీ మహాచిత్రం? పెళ్ళైతే ధనం ఖర్చౌతుంది గాని, రావడ వెఁలాగ?
రామ:
లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం
చెయ్యడవేఁ కదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడను కున్నావు?
లుబ్దావుధాన్లు జాతకం యగా దిగా చూసి, సీఘ్రంలో వివాహ యోగం వుఁందన్నాడు, ఆ
వివాహంవల్ల ధనయోగ వుఁందన్నాడు, దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకి,
డబ్బు ఖర్చౌతుందన్న భయం వెనక్కిలాగడం ఆరంభించింది. యింతట్లో పండా
గారిక్కడికొచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లుబ్దావుధాన్లు అనుమానం
తీర్చుకుందావఁని ఆయనకి జాతకం చూపించే సరికి పండాగారు యేమన్నారూ? "వివాహ ధన
యోగాలు జవిఁలిగావున్నాయి, అయితే మీరు పెద్దవాళ్ళు, యిప్పుడు మీకు పిల్ల
నెవరిస్తారు, పెళ్ళెలా అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహా యోగాలు
జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది.
అనగా మీకు మారకవోఁ, ధననష్టవోఁ సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం
బాహుళ్యంగా చెయ్యండి, కొంత జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది.
మంచి రోజు చూసి సూర్య నమస్కారాలు ఆరంభించండి" అని చెప్పేసరికి అవుఁధాన్లు
గుండె రెండు చెక్కలై వివాహప్రయత్నం ఆరంభించాడు. యిదీ కథ.
మధుర: యేమి కల్పన!
రామ:
యింకావుంది; యిహను కృష్ణ రాయపురంలో అగ్నిహోత్రావుఁధాన్లు కూతురు జాతక
వెఁలావుందట? చప్పడానికి అలవి లేదు. అది కాలు పెట్టిన యిల్లు పది
యిళ్ళౌతుందట. అది పట్టిందల్లా బంగార వౌఁతుందట!
మధుర: నిజవేఁనా లేక అదీ మీ బనాయింపేనా?
రామ:
అది మట్టుకు నా బనాయింపు కాదు. అగ్నిహోత్రావుఁధాన్లే జాతకం అలా
బనాయించాడు. మా బ్రాహ్మల్లో యిది పరిపాటే, పెళ్ళిళ్ళలో పంపించేది ఒహ
జాతకవూఁ నిజంవుండదు.
మధుర: యేమ్మోసం!
రామ: లౌక్యం, లౌక్యవఁను!
మధుర: రెండింటికీ యేవిఁటో భేదం.
రామ: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవఁను.
మధుర: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిటి?
రామ:
యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అదివకవృత్తి
భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధ
వాఁడి ద్రవ్యా కర్షణ చేసేది. యీ ధర్మ సూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి.
మధుర: నాకెలా తెలుస్తాయి నిజవేఁగాని, ద్రవ్యాకర్షణ యలాగ యీ పెళ్ళివల్ల?
రామ:
(తనలో) క్రాసెగ్జామినేషను చేస్తూందోయి దీంతస్సా గొయ్యా (పైకి) నీకు
మేజువాణి నిర్నయించుకున్నాను కానూ. నీకు పదిరూపాయలసొమ్ము దొరకడం
ద్రవ్యాకర్షణ కాదా?
మధుర:
యేచిత్రవైఁన మనుష్యులు పంతులు గారూ! (తమలపాకుచుట్టతో కొట్టి) నేను
రాబోతానని రెండేళ్ళ కిందటా కలగని, యీ కాబోయే మేజువాణీ బుద్ధిలో వుంచుకుని
యీ పెళ్ళి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ? ద్రవ్యాకర్షణ యలాగో నాకు
బోధపడ్డది. పెళ్ళికూతుర్ని యిలాకా చేసుకుని, దాంద్వారా ముసలాడి మూటా ముళ్లా
లాగేస్తారు. యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత
బతిమాలుకున్నా యీ పెళ్ళి తప్పించక పోవడవేఁవి? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే
నే నమ్ముతానా?
రామ:
ఆమాట్నిజవేఁగాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణ కోసవేఁ చాస్తాననుకున్నావా
యేవిఁటి, ఆ ముసలాణ్ణి కాపాడదావఁనే, యీ పెళ్ళి తలపెట్టాను.
మధుర: "చిత్రం చిత్రం మహాచిత్రం" అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు!
రామ: ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా.
మధుర: పొగటిపూట కథలేవిఁటి. ముందు యీ చిత్రకథేవిఁటో శలవియ్యండి!
రామ: అది చెప్పేది కాదు. చెప్పను.
మధుర: చెప్పకపోతే వొప్పను.
రామ: ఒప్పకేం జేస్తావు?
మధుర: యేం జేస్తానా? యీ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవిఁది.
రామ:
నేం దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం గీస్త్రం వక పక్క నుంచి మోట
సరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేం
లేదు. లుబ్దావుధాన్లు వెధవకూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు.
నాల్రోజుల కొహమారు అది పీకల మీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్ళు బెదిరించి
పది డబ్బుల సొమ్ము లాగేస్తుంటారు. డబ్బు ఖర్చంటే ముసలాదికి, ప్రాణ పోకట.
సంసారం కూడా మీనాక్షి దూబర చేస్తూందంటాడు. పెళ్ళయితే దాని ఆటకడుతుంది.
మధుర: మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంట పడ్డ తరవాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది?
రామ: అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను.
మధుర: యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్ళి మానిపించెయ్యండి.
రామ: యీ పెళ్ళిలోమేజువాణీ పెట్టి పదిరాళ్ళిప్పిస్తాను. మాటాడ కూరుకో.
మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) లుబ్దావుధాన్లు యదట నేను మేజువాణీ ఆఁ!
రామ: పేరు వాడుగాని, పెద్దన్నేనే కదూ?
(హేడ్ కనిస్టేబ్ చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చి మీద కూర్చొనును.)
హెడ్: రామప్పంతులూ! యినస్పెక్టరికే టోపీ వేశావటే?
రామ: (హెడ్ కనిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా.
హెడ్: యెప్పుడూలేంది గారేవిఁటి, గీరేవిఁటి, చింత గారు?
రామ: ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావడవేఁనా, అన్నా!
హెడ్: ఆడవాళ్ళంటున్నావు, నువ్వు కూడా అందులోనె జమాయేవిఁటి? అహ! హ!
రామ: హాస్యానికి వేళాపాళా వుండాలి.
హెడ్:
నేను హాస్యంకోసం రాలేదు; యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయడి దగ్గిర
పాతిక రూపాయల్లాగావట, యిలా యందరి దగ్గిర లాగాడో రామప్పంతుల్ని నిల్చున్న
పొట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచితంగా చెప్పి యినస్పెక్టరు
పాలెం వెళ్ళిపోయినాడు.
రామ:
చిన్నప్పుడు ఒక్క బర్లో చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని
పిలక నేనూ, నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయడి మాట మాత్రం
శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర
కలుస్తాను.
హెడ్: నే నెలా వస్తాను నీతోటి; నాకు వల్లమాల్నపనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను.
రామ: (హెడ్ చెవులో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీకు పుణ్యవుంటుంది.
హెడ్: అదా నీ ఘోష! అలాక్కానియి, (నిష్క్రమించును)
రామ: (తనలో) అదుగో మళ్ళీ ఏకవచనవేఁ కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ.
నౌఖరు: (ప్రవేశించును) సిత్తం బాబు.
రామ: గుఱ్ఱం కట్టమను.
నౌఖరు: సిత్తం బాబు, (నిష్క్రమించును)
రామ:
చూశావూ మధురవాణీ నేన్నిలబడ్డచోట రోపాయలు గలగల్రాలతాయి, యీ
యినస్పెక్టరుగాడికి, యీ తాలూకాకి వచ్చింతరువాత అయిదారు వేలు యిప్పించాను.
వీధి తలుపు వేసుకుని సంగీత సాధకం చేసుకో, విద్య వంటి వస్తువు లేదు.
(గుమ్మందాటి నాలుగడుగులు వెళ్ళి తిరిగి వచ్చి) అప్పుడే వీణ తీశావు? యీ
వూళ్ళో మా దుర్మార్గులున్నారు; నాస్నేహితులవఁనీ, బంధువులవఁనీ పేరు
పెట్టుకొస్తారు, రానీకుమా (తలుపుపైనించి వేసి) గడియ వేసుకో.
(నిష్క్రమించును)
2.వ స్థలము: రామప్పంతులు యింట్లో పడక గది
[మధురవాణి తివాసీ మీద కూచుని వీణ వాయించుచుండును
వాయిద్యం ముగించి.]
మధుర:
విద్య వంటి వస్తువ లేదు, నిజమే - ఒక్కటితప్ప - అదేవిఁటి? విత్తం.
డబ్బు తేని విద్య దారిద్ర్య హేతువ. యీ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు
దమ్మిడీలివ్వరు. గనక యీ వీణ యిటుపెడదాం. హెడ్డు కనిష్టేబు సౌంజ్ఞ చేసి
వెళ్ళాడు. అతడు యిచ్చేదీ చచ్చేదీ లేదు గాని, జట్టీ లేవైఁనావస్తే ఓ వొడ్డు
కాస్తాడు.
(వీధి తలుపు తట్టబడును.)
వచ్చాడు కాబోలు. (తలుపు దగ్గిరకి వచ్చి) యవరు మీరు? బంధువులా?
(తలుపవతల కరటక శాస్తుల్లు, కన్యవేషంతో శిష్యుడున్నూ.)
కరట: ఆపద కడ్డం బడ్డవారే బంధువులు. మే మ్మీకు బంధువులం కావుఁగాని, మీరు మాకు బంధువులు కాగల్రు.
మధుర: నాస్తులా?
కరట: (తనలో) ఈ కంఠం విన్నట్టుంది. (పైకి) నాస్తం కట్టడానికే వచ్చాం.
మధుర: దేంతో కడతారు?
కరట: (తనలో) ఈ వేశ్య మధురవాణి కాదుగద? కంఠాన్ని పోలిన కంఠం వుండ కూడదా? (పైకి) నాస్తం కట్టడానికల్లా వున్నది వక్కటే గదా టంకం?
మధుర: యేవిఁటో ఆ టంకం?
కరట; బంగారం!
మధుర: మాపంతులుగారికి మీరు నాస్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపు తియ్యును)
కరట: (తనలో) అరే! మధురవాణే!
మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) చిత్రం!
కరట: యేవిటి చిత్రం?
మధుర: యీ వేషం?
కరట: ఉదరనిమిత్తం బహుకృతవేషం; యిది దేవుఁడిచ్చిన వేషవేఁను.
మధుర: నా దగిరేనా మర్మం? యీ పిల్లెవరో?
కరట: నా కుమార్త.
మధుర: నాటకవఁల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారుగదా యేల యీ అవస్థ?
కరట: నీ దయవల్ల దేవుడిచ్చిన స్తిథికేం లోపం రాలేదు. నిన్ను చూదావఁని వచ్చాను.
మధుర: యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత గాదు?
కరట:
నీలాంటి మనిషి మళ్ళీవుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా?
నీదగ్గిరకి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి
కుమారరత్నంగారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరువాత, నేనుగానీ నీ
యింటికి వస్తే పీక ఉత్తరించేస్తాడేమో అనే భయం చేత కొంచం యడబెట్టి యితడికి
యెప్పుడు బదిలీ అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుఁణ్ణి
సదా ప్రార్ధిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?
మధుర:
డిప్టీకలక్టరు గారి కుమారరత్నం గార్ని, తండ్రి చదువు పేరు పెట్టి
చన్నపట్ణం రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు
పంపించాడు. ఆ తరువాత మొన్నటిదాకా గిరీశం గారు నన్ను వుంచారు గాని, డబ్బుకి
యటాముటీగా వుండేది. నా యింటికి వచ్చిన వాడల్లా తన కొడుక్కి దోస్తీ
అయివుంటాడని డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నా యింటికి
రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావఁని
యీ వూరొచ్చాను.
కరట:
(ముక్కు మీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి
చదువు చెప్పడానిక్కుదురుకుని మావాళ్ళింట్లో చేరాడు. వాడికి పెందరాళే
ఉద్వాసన చప్పాలి.
మధుర:
(ముక్కు మీద వేలుంచుకొని) నాదగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా
దగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్టీ కలక్టరుగార్ని
తిట్టారే. ఆయన కంటే మీ న్యాయం యేం బాగావుంది? నా దగ్గిరకు వచ్చినందుకు, మీ
భార్యాగారు ముందు మిమ్మల్ని మెడబట్టుకుని యింట్లోంచి తరవ్వఁలిసింది. తనకి
రొట్టా, ఒహడికి ముక్కానా?
కరట: క్రియలలో అంతవరకు జరక్కపోయినా మాటల్లో ఆ మర్యాద ఆమేషా నాకు జరుగుతూనే వున్నది.
మధుర: (చిరునవ్వుతో) యీ యిల్లాలు మాపంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్ట బయలౌతుంది.
కరట: యిల్లాలనేస్తున్నావేఁం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లిచేయడానికే, నీ దగ్గిరికి తీసుకొచ్చాను.
మధుర: మాపంతులుకేనా పెళ్ళి?
కరట: "ఏకనారీ సుందరీనాదరీవా," అన్నాడు. త్రిలోకసుందరివి నువ్వు దొరికింతరవాత నీ పంతులుగారికి యింకా పెళ్ళెందుకు?
మధుర:
ఐతే మరెవరికి పెళ్ళి చెయ్డం? నాకా యేవిఁటి? అలాగైతే, సైయేఁ! మొగ వేషం
వేసుకొని, పెళ్ళిపీటల మీద కూర్చుంటాను. యిలాంటి పెళ్ళాం దొరకడవెఁలాగ?
జగత్ప్రసిద్దులైన కరటక శాస్తుల్లు గారి అల్లుణ్ణి కావడం యెలాగ? దివ్య సుందర
విగ్రహవఁని పొగడగానే నా బుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు? యీ పిల్లదగ్గిర
నాబోట్లు దివిఁటీ ముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక.
మీకేం తెలుసును? మరి నా పెళ్ళాన్ని నాకిచ్చేసి మీతోవని మీరు వెళ్ళండి.
(శిష్యుడి చెయ్యి పట్టి లాగును.)
శిష్యుడు: చూశావురా నాన్నా యలా పట్టుకుందో?
మధుర: (ఆచుకోలేకుండా నవ్వుతూ) శాబాషు! యిదేనా పెద్దమనిషి తరహా! యిరుగు పొరుగమ్మ లేవఁంటారో మొగుడు పిలిస్తే వెళ్ళకుంటేను?
శిష్యుడు: కొడ్తుంది కాబోల్రా నాన్నా, యింటి కెళ్ళిపోదాం, రా!
మధుర: యేం నంగనాచివే? తరవాత పెళ్ళిచేసుకుంటాను. అందాకా ముద్దియ్యి (ముద్దెట్టుకొనును)
కరట: నేరని పిల్లని చడగొడుతున్నావు.
మధుర: నాలాంటి వాళ్ళకి నూరుమందికి నేర్పి చెడగొట్టగలడు. యవరి శిష్యుడు? యీ కన్నెపిల్ల నోరు కొంచం చుట్టవాసన కొడుతూంది!
కరట:
అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరచు మాయవౌఁతుంటాయి. మధురవాణి!
దేవుఁణ్ణాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టివచ్చాను; మళ్ళీ
అతడొచ్చేలోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు.
మధుర: మీ కొచ్చిన చిక్కేవిఁటి? నేం చెయ్గల్గిన సహాయ వేవిఁటి?
కరట:
చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ వూళ్ళో గిరీశం పెత్తల్లికొడుకు
లుబ్దావుధాన్లని ముసలాడున్నాడు; వాడికి మా మేన గోడల్నివ్వడానికి మా బావ
నిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది.
యేం వుపాయం చాస్తావో దాని ప్రాణం కాపాడాలి.
మధుర:
యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్దావుధాన్లు చంకలు
గుద్దుకుని చేసుకుంటాడు. అతనిదాకా యెందుకు నేనే కొనుక్కుంటాను.
కరట: చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవిఁటి?
మధుర: యిదివరకి నిర్ణయవైఁన సమ్మంధం యేమ్మిషపెట్టి తప్పించడం?
కరట: నీబుద్ధి కసాధ్యం వుందా? డబ్బుకసాధ్యం వుఁందా?
మధుర: బుద్ధికి అంతా అసాధ్యవేఁగాని డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు. యీ పెళ్ళిలో మా పంతులుకో పదిరాళ్ళు దొరుకుతా యనుకుంటున్నాడే?
కరట: నా సంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను.
మధుర: సరే. గాని నాటకంలో యంతహాస్యవైఁనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే యేవిఁ మూడుతుందో ఆలోచించారా?
కరట:
మధ్య నీకొచ్చిన ఫర్వాయేవిఁటి? నాకొచ్చిన ఫర్వా యేవిఁటి? యీ కత్తెర
మీసం, కత్తెర గెడ్డం కడిగేసుకుని నా తోవని నే వెళతాను. యీ కోక నీ దగ్గిర
పారేసి మా శిష్యుడు వెళతాడు. ఆ తరవాత యిదేవిఁటమ్మా యీ చిత్రవఁని నువ్వూ
నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్చు చేసి యీ
మంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచనచెయ్యి.
మధుర: మా పంతులు వక్కడివల్లా యీ పని కానేరదు.
కరట: మరియింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు?
మధుర:
మా పంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుధాన్లు కూతురు మా నేస్తం
మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్ద కాసులు యిస్తానని
చెప్పండి. ఆపైని సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశపెట్టండి. యీ పనికి
సిద్ధాంతే కీలకం. నేను తెర వెనకనుంచి సమయోచితంగా హంగు చాస్తాను.
కరట: నీ మాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నాకు విధి.
మధుర:
ఆ మాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తిచేత వేస్యని గనక
చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గాని, మధురవాణికి దయా దాక్షిణ్యాలు
సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి
ఆశిస్తానా? యటుంచి యెటొచ్చినా కాపాడతాడు. హెడ్డు కనిష్టేబుకు మాత్రం కొంత
నిజం చెపుదాం. అతగాడు యిప్పుడే వస్తాడు మాట్లాడతాను. మీరు యిక్కడ కూచోండి.
కరట: స్వాధీనుడేనా? కొంప ముంచడుగద?
మధుర: గులాం. (నిష్క్రమించును)
కరట: కూచుందాం రా.
శిష్యుడు: నా పేరేవిఁటండోయి?
కరట: కొంప ముంచుతావు కాబోలు! సుబ్బి!సుబ్బి! మధురవాణ్ణి చూడగానే మతి పోయిందా యెవిఁటి?
శిష్యుడు: దాని నవ్వు పట్టుబడాలని నిదాస్తున్నాను.
కరట: సబ్బు అన్న మాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది.
(రామప్పంతులు గుఱ్ఱం దూరాన్న దిగి నడిచివచ్చి)
రామ: (కరటకశాస్త్రితో మెల్లిగా) లోపలికెవరైనా వెళ్ళారా?
కరట: (గట్టిగా) యెవరో యిద్దరు ముగ్గురొచ్చారుగాని మీ యిల్లాలు గారొచ్చి పైకి పొమ్మని గెంటేశారు.
రామ: మీరెవరు? యెందుకొచ్చారు?
కరట: మాది కృష్ణాతీరం. నాపేరు గుంటూరు శాస్తుల్లంటారు. తమదగ్గిర రాచకార్యవుఁండి వచ్చానండి.
వీధిలో నుంచి
జవాను "యినస్పెక్టరుగారు నే వచ్చిందాకా మఱ్ఱిచెట్టుకింద గుఱ్ఱాన్ని నిలబెట్టుంచుతావఁన్నారు. రూపాయలు వేగం యివ్వండి."
(మధురవాణి ప్రవేశించును)
రామ: యవరు వొచ్చారట?
మధుర: యవరొస్తారు? మీ నాస్తులట! తగిలాను.
రామ: (మధురవాణితో) యేదీ మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. యీ సైతాను ప్రాణం తింటున్నాడు.
మధుర: మీరిచ్చిన రూపాయలు పట్ణం తోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మా తల్లక్కడ కాలక్షేపం చెయ్యడవెఁలాగ?
రామ: వొట్టబద్ధాలు!
మధుర: (తాళముల గుత్తి మొలలోనుంచి తీసి రామప్పంతులు మీద విసిరి) చూసుకోండి.
రామ: (బుజం తడువుఁకుంటూ) దురహంకారం కూడదు! విసిరికొడితే దెబ్బ తగల్దను కున్నావా యేవిఁటి?
మధుర: దుష్టుమాటలనగా తగిల్తే తప్పా?
జవాను: యేవఁయ్యోయి. పోయి, రూపాయి లిచ్చావు కావని యినస్పెక్టరు గారితో చెబుదునా?
మధుర: (మెడలో నాను తీసి) యిది తాకట్టువుంచి కావలసిన సొమ్ము తెచ్చుకొండి.
రామ: (తనలో) ఆహా! యేమి యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు!
కరట: పంతులుగారూ యెన్ని రూపాయలు కావాలండీ?
రామ: పాతిక.
కరట: నే దాఖల్చేస్తాను (జవానుకు యిచ్చును)
రామ: ధనజాతకానికి డబ్బలా వస్తూవుంటుంది. యేవిఁటి మీ రాచకార్యం?
కరట: యిది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి.
రామ:
వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను, నాకు మంత్రాలు రావే? (చుట్ట
జేబులోంచి తీసి కొన కొరకి) యేవఁంటావు మధురవాణీ? అగ్గిపుల్ల.
మధుర: (అగ్గిపుల్ల అందిస్తూ పంతులు నుంచి శిష్యుడి వేపూ, శిష్యుడి నుంచి పంతులు వేపూ కోపముతో చూసును.)
కరట:
మంత్రమన్నప్పుడు వైదీకపవాడిదేం మంత్రవఁండి? యీ రోజుల్లో వైదీక
మ్మంత్రాల మహిమ పోయిందండి. మంత్రవంటే నియ్యోగప్రభువుదే మంత్రం! తమవంటి
ప్రయోజకులకు మంత్రం మాటాడుతుందండి.
రామ: మధురం! యేవఁంటావు? యీ పిల్ల న్నే పెళ్ళిచేసుకుందునా?
మధుర: (రామప్పంతులు వేపూ, శిష్యుడి వేపూ చురచుర చూసి నిష్క్రమించును)
రామ: సొగసుకత్తెలకు అలకకూడా అదో శృంగారం సుమండీ, శాస్తుల్లు గారూ!
కరట:
(వైదీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అనుభవవౌఁతాయండి?) మా యిల్లాళ్లక్కోపం
వస్తెచీపురుగట్టలు యెగురుతాయండి. సరసవఁన్నది పుస్తకాల్లో చదవడవేఁగాని మాకు
అనుభవవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తి వారు రాధికతో శలవిస్తున్నారు, ఓ
రాధికా నీ కోపం తీర్చుకోవాలన్నష్షాయనా " ఘటయభుజ బంధనం రచయరద ఖండనం,
యేనవాభవతి సుఖజాలం" అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి
బిక్కిరి అయ్యేటట్టుగా కౌగలించుకో, మరిన్నీ రక్తాలోచ్చేట్టు కొరికెయ్యి,
అంఛున్నాడు.
రామ:
(మధురవాణి వెళ్ళిన గుమ్మము వేపు చూసి) ఉప్పులేకనే ముప్పందుం.
మధురపాణికి మాత్రం ఈ వెఱ్ఱి మొఱ్ఱి కవిత్వాలు చెప్పకండి. నా లాంటి
మృదువర్లు ఇటువంటి మోటసరసం సహించరు.
కరట: ఆమె మీ భార్యా కారండీ? సంసారి కన్నా మర్యాదగా వుంది యీ వేశ్య! మీది యేవఁదృష్టం.
రామ: యెంపిక. యెంపికలో వుందండి. మీ రాచకార్యం చెప్పారు కారు.
కరట: లుబ్దావుధాన్లుగారికీ తమకీ చాలాస్నేహవఁని విన్నాను. ఆయన తమ మాట అడుగు దాటరట?
రామ:
ఆ గాడిదకొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికీ డబ్బుకీ
లంకె. డబ్బుకీ వాడికే స్నేహంగాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి
వ్యవహారజ్ఞానం లేకపోవడం చాతా, కోర్టంటే భయం చాతా, నా సలహాలేక బతకలేడు. వాడే
అన్నమాటేవిఁటి, యీ తాలూకాలో సివిలు మేజిస్ట్రేట్లు యెక్కడొచ్చినా
రామప్పంతులు పప్పులేని పులగం వుండదు.
కరట:
ఆ మాటవినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అడ్డేస్తారని
తమర్ని వెతుక్కొచ్చాను. మా పింతల్లికొడుకు బియ్యే బియ్యెల్ పాసయినాడండి.
డిప్టీకలక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతనివల్ల గడ్డిపరకంత సాయం లేదుగదా?
మీది మిక్కిలి కూరానారా యవళ్ళయినా గృహస్థులు గృహస్థు మర్యాదకి పంపించి,
తల్లయినా పెళ్ళాం అయినా అవి పుచ్చుకుంటే, తిరగ గొట్టిందాకా అభోజనం
కూచుంటాడు! పెట్టడానికి పుచ్చుకోడానికీ నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లింది
కాని మా వాళ్ళ ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. "ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే
కాని మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు" అని కవీశ్వరుడన్నాడు .
రామ:
యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్నమాటేవిటి అడ్డవైఁన
జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ
వైదీకప్పంతుళ్ళవారికి మా చాకచక్యాలబ్బుతాయండీ. మా లౌక్యం మాతో స్వతహాగా
పుట్టినది. మీరు తెచ్చిపెట్టుకున్నది. యెరువు సరుకు యెరువు సరుకే.
విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుచ్చుకోడం చాతకాక, పతివ్రతలమని వేషం వేస్తారు.
కరట:
అదే పతకవైఁతే అది అమ్ముకు బతకనాఁ అన్నట్టు మా వాళ్ళకే చాతయితే నాకు యీ
అవస్థేవఁండీ? మావాడు పది మంది పర్టీలతో చెబితే పదిరాళ్ళ సొమ్ము దొరుకును.
యీ చిక్కులు లేకపోవును.
రామ: యెవిఁటా చిక్కులు?
కరట:
రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు
రూపాయలు చెల్లక పోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో
వెంకటదీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వచ్చేసరికి
యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళయిన నెల రోజుల్లో యిస్తావన్నారండి. అందుచేత
అది వదులుకొని లుబ్దావుధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ
దర్శనానికి వచ్చానండి. యిదిగాని తాము సమకూరుస్తే పది వరహాల సొమ్ము దాఖలు
చేసుకుంటాను.
రామ: నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ణి కాను.
కరట:
తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసేవాణ్ణేనండి. నా రుణాలు
పదహారు వందలుంటాయండి. ఆ పైని యెవొచ్చినా తాము దాఖలు చేసుకొండి.
రామ:
"ఐతే, గియ్తే" బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్దెనిమిది
వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి సగం తగ్గితేనేగాని అవుధాన్లు ఆ
సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరే దేవిఁటి
నాకిచ్చేదేవిఁటి? యేవైఁతేనేవిఁ? ఆ వ్యవహారం యలగా మించి పోయింది. పది
రోజులకిందటొస్తే ఫొక్తుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా
చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థ మీద మధురవాణి
మేజువాణీకి వాణ్ణొప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరివక ఉపాయం చెబుతాను
వినండి. మీకు మైనరు కొమాళ్ళున్నారా?
కరట: చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.
రామ: అయితే యిహలేందేవిఁటి? ఆ కుఱ్ఱవాడు మయినరని వాదిద్దాం.
కరట: సాక్ష్యం యలా వొస్తుందండి?
రామ:
ఓ హో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని
వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం విన్నారా? ఉర్లాం బసవరాజుగారి సంభావన్ల
రేటే సాక్ష్యాలక్కూడా గేజటార్డర్ చేశాం. కుండనాలు వేసుకున్న వారికి ఓ
రూపాయి జాఫా.
కరట: జాతకం వుంది గదా యేం సాధనం?
రామ:
కాకితవైఁతే అగ్గిపుల్లతో ఫైసల్! తాటాకైతే నీళ్ళపొయ్యి! కొత్త జాతకం
బనాయించడం అయిదు నిమిషాల పని. మా సిద్ధాంతి మట్టుకు నాలుక్కాలాలు చల్లగా
వుండాలి. నా దగ్గిర పాత తాటాకులు అలేఖాలు అటకనిండా వున్నాయి.
ముప్ఫైయేళ్ళనాటి కాకితాలున్నాయి. రకరకాలు సిరాలున్నాయి. ఒక నూఱ్ఱూపాయలు
నాకు ఫీజు కింద యిచ్చి ఖర్చులు పెట్టుకొండి. గ్రంథం నడిపిస్తాను.
కరట:
దారి ఖర్చుకోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలుచేసాను. మరి బుర్ర
గొరిగించుకుందావఁంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికయినా చేతిలో ఓడబ్బు
సొమ్ముండాలిగదా? యిదొహర్తె టొంపలా నాతోవుంటే యలాగండి కోర్టంట తిరగడం? తమ
లౌక్యానికి అసాధ్యవఁన్నది వుంటుందంటే నే నమ్మ జాలను. యలాగయినా కుదిర్న
సంబంధం తిప్పించి, మా సంబంధం కుదిర్చి నాకు యిచ్చే సొమ్ములో పదోవంతు తాము
అంగీకరించి మిగిలింది నాకు దయ చెయ్యండి. దీన్ని మొగుడింట అప్పజెప్పి ఆ పైన
యీ గ్రంథం యేదో కొసచూసిందాకా తమర్ని అంటగాగి వుంటాను.
రామ: పదోవంతు పనికిరాదు. మా బేరం యెప్పుడూ సగానికి సగం
కరట: సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను?
రామ:
రుణాల్తీర్చుకో అఖర్లేకుండా గ్రంథం జరిగిస్తాం కదూ? అప్పుడే మీ చేతులో
రూపాయలు పడడానికి సిద్ధంగా వున్నట్లు మట్లాడతారేవిఁటి? నేను యంత శ్రమబడ్డ
పైని పతకం తిరగాలి? అది ఆలోచించారా?
కరట:
తాము అలా అంటే నేనేం మనివి చెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటున్నప్పుడు
ఆ కానికూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయంగదండీ? వ్యవహారాల తొట్రుబాటు చాతనూ
పిల్ల కట్టు దప్పివుండడం చాతనూ, తొందరంబద్;ఉతున్నానుగానండి, కొంచం
వ్యవధివుంటే రెండు వేలకి పైగా అమ్ముకుందునండి.
రామ: "అయితే గియితేలు" అనుకున్న లాభం లేదని చెప్పానుకానా? ఐదో వంతుకు ఏవఁంటారు?
కరట: యీపాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి?
రామ: పాపపు సొమ్ము మాదగ్గిరకి రాగానే పవిత్రవైఁపోతుంది. ఒహళ్ల కివ్వడం కోసవేఁగాని నాక్కావాలా యేవిఁటి?
కరట: ఐతే కానియ్యండి.
రామ:
యిక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి
తీసుకురా. మామోలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్ద సిరా బుడ్డితే.
మధుర: (అవతలనుంచి) నాకంటె మధురం కంటబడ్డ తరవాత నేనెందుకు?
రామ: ఆడవాళ్ళకి అనుమానం లావండి. వింటున్నారా? అదో ముచ్చట!
కరట: కేవలం వజ్రాన్ని సంపాదించారు!
రామ: వజ్రవేఁ గానండి, పట్టవాసపు అలవాటుచాత పదిమందితో మాట్లాడితే గాని దానికి వూసుబోదు.
కరట: ఆమాత్రం స్వేచ్ఛ యివ్వడవేఁ మంచిదండి; ఆడదాన్నట్టే రొకాయించకూడదండి?
రామ: రొకాయిస్తే యెం జేస్తుందేవిఁటి?
కరట: యిలాంటి మానంగల మనిషైతే నూతులో గోతులో పడుతుందండి.
రామ: అలాగనా అండి?
కరట: అందుకు సందేహమేమిటండి? నాజూకైన మనస్సుగల స్త్రీని మల్లెపువ్వు లాగ వాడుకోవాలండి.
రామ: ఆ నాజూకులూ గీజుకులూ మీకేం తెలుసండి?
కరట:
పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వచ్చిన్నీ
యేవే, ఉద్యానాల్లో వుండుకున్నటువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహాకవుల
నాటకాల్లో ఆష్లాగే జరిగినట్లు రాశారండి.
రామ: మరెవళ్ళతో మాట్లాడినా తప్పులేదు గాని, హెడ్డుకనిష్టీబు మాత్రం మాట్లాడవద్దని బుద్ధి చప్పండి. మీరు తండ్రిలాంటి వారుగదా?
కరట:
ప్చు! అంత అదృష్టవాఁ అండి! అట్లాంటి పిల్లే నాకువుంటే, మూడు నలుగు
వేలకమ్ముకుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసివుందును. దీన్నయినా
నాలుగు దిక్కులా అమ్మజూపితే రెండు మూడు వేలు యిదివరకే చేతులో పడివుండునండి.
మేనరికం చెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీ దురవస్థ మాకొచ్చింది.
అంచాతనే యింట్లో చప్పకుండా యీ పిల్లని వెంటతీసుకొచ్చి యీ దేశంలో పెళ్ళికి
చూపుతున్నాను.
రామ: నా సహాయ లోపం వుండబోదు!
కరట: ఐతే కార్యవఁయిందే!
రామ: యేదీ పిల్లా యిలారా, చెయి చూపించూ!
(శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును)
కరట:
చూపించమ్మా, భయంలెచ్చూపించు (కరటకశాస్తుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు
దగ్గిరికి తోయును. రామప్పంతులు చెయ్యి పట్టుకుని అరిచెయ్యి చూచుచుండును.
శిష్యుడు చెయ్యిలాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం,
కాకితం పట్టుకుని రామప్పంతులు వెనక నిలుచుండును.)
రామ: ఆహా! యెం ధనరేఖా! సంతానయోగ్యత బాగావుంది.
మధుర: మీరు చేపట్టింతరువాత, అందుకు లోపం వుంటుందా?
(సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖం మీద పోసి ఛఱ్ఱున వెళ్ళిపోవును.)
కన్యాశుల్కము
చతుర్థాంకము
1.వ స్థలము: రామప్పంతులు యింటి సావిడి
[రామప్పంతులు కుర్చీ మీద కూర్చుని వుండగా మధురవాణి నిలబడి
తమలపాకులు చుట్టి యిచ్చుచుండును]
రామ:
నేనే చిన్నతనంలో యింగిలీషు చదివి వుంటే జడ్జీల యదట ఫెళఫెళలాడించుదును.
నాకు వాక్‌స్థానమందు బృహస్పతి వున్నాడు. అందుచాతనే యింగిలీషు రాక పోయినా
నా ప్రభ యిలా వెలుగుతూంది.
మధుర: మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.
రామ: నేనా శునకాన్ని?
మధుర: హాస్యానికన్న మాటల్లా నిజవఁకుంటారేవిఁ?
రామ: హాస్యానికా అన్నావు?
మధుర: మరి మీతో హాస్యవాఁడక పోతే, వూరందరితోటి హాస్యవాఁడ మన్నారా యేవి@టి?
రామ: అందరితో హాస్యవాడితే యరగవా?
మధుర:
అంచేతనే కుక్కన్నా, పందన్నా మిమ్ముల్నే అనాలిగాని, మరొకర్ని అనకూడదే?
మిమ్మల్ని యేవఁనడానికైనా నాకు హక్కు వుంది. యిక మీ మాటకారితనం నాతో
చెప్పేదేమిటి? మీ మాటలకు భ్రమసే కదా మీ మాయలలో పడ్డాను?
రామ: నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా?
మధుర: మీ అందానికి మేము తెనుగువాళ్ళము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవచ్చింది. గిరీశం గారు మాట్లాడితే దొరలుమాట్లాడినట్లుంటుందిట
రామ: అటా, యిటా! నీకేం తెలుసును. వాడు వట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు.
మధుర: అదేమో మీకే తెలియాలి! గాని, గిరీశంగారు లుబ్దావుధాన్లు గారి తమ్ములటా? చెప్పారు కారు!
రామ: నీ మనసు వాడి మీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు, కాకపోతే నీకెందుకు.
మధుర: మతిలేని మాటా, సుతిలేని పాటా, అని
రామ: నాకా మతిలేదంటావు?
మధుర: మీకు మతిలేక పోవడవేఁం, నాకే.
రామ: యెం చేత?
మధుర: నుదుట్ను వ్రాయడం చేత.
రామ: యేవని రాశుంది?
మధుర: విచారం వ్రాసివుంది.
రామ: ఎందుకు విచారం?
మధుర:
గిరీశం గారు లుబ్దావధాన్లు గారి తమ్ములైతే, పెళ్ళికి వస్తారు;
పెళ్ళికి వస్తే, యేదైనా చిలిపిజట్టీ పెట్టి, మీ మీద చెయిజేసుకుంటారేమో అని
విచారం.
రామ: అవును, బాగా జ్ఞాపకం చేశావు. గాని డబ్బు ఖర్చైపోతుందని అవుఁధాన్లు బంధువులనెవళ్లనీ పిలవడు.
మధుర: గిరీశంగారు పిలవకపోయినా వస్తారు.
రామ: నువు గానీ రమ్మన్నావా యేమిటీ?
మధుర: మీకంటే నీతి లేదుగాని నాకు లేదా?
రామ: మరి పాడొస్తాడని నీకెలా తెలిసింది?
మధుర: మీకంటే నీతి లేదుగాని నాకు లేదా?
రామ: మరి పాడొస్తాడని నీకెలా తెలిసింది?
మధుర: మీకంటే నీతి లేదుగాని నాకు లేదా?
రామ: మరి పాడొస్తాడని నీకెలా తెలిసింది?
మధుర: మీకంటే నీతి లేదుగాని నాకు లేదా?
రామ: మరి వాడొస్తాడని నీకెలా తెలిసింది?
మధుర:
పెళ్ళికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్ళింట పెళ్ళి
సప్లై అంతా ఆయనే చేస్తున్నారట. అంచేత రాక తీరదని తలస్తాను.
రామ: వాడొస్తే యేమి సాధనం?
మధుర: నన్నా అడుగుతారు?
రామ: పెళ్ళే తప్పిపోతే?
మధుర: యలా తప్పుతుంది?
రామ: తప్పిపోడానికి ఒక తంత్రం పన్నాను.
మధుర: అయితే, మధురం మాట చెల్లించారే?
రామ: చెల్లించక రావఁప్ప యే చెరువు నీళ్లు తాగుతాడు?
మధుర: యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును)
రామ: గాని మధురం కీడించి మేలిద్దాం. ఒక వేళ దెబ్బ బేజోటు అయిపోయి వాడు రావడవేఁ తటస్థిస్తే యేవిఁటి సాధనం?
మధుర: ఆడదాన్ని నన్నా అడుగుతారు?
రామ:
ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారం అంటే చెప్పు, యెత్తుకి
యెత్తు యింద్రజాలంలా యెత్తుతానూ? చెయిముట్టు సరసవఁంటే మాత్రం నాకు కరచరణాలు
ఆడవు.
మధుర: పెళ్లి నాలుగు రోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి?
రామ: ఆడదాని బుద్ధి సూక్ష్మమని చెప్పాను కానూ? మా మంచి ఆలోచన చెప్పావు.
మధుర: గాని, నాకొక భయం కలుగుతూంది. నిశిరాత్రి వేళ పైగొళ్లెం బిగించి, కొంపకి అగ్గిపెడతాడేమో?
రామ: చచ్చావేఁ! వాడు కొంపలు ముట్టించే కొరివి ఔను. మరి యేవిఁ గతి?
మధుర: గతి చూపిస్తే యేమిటి మెప్పు?
రామ: "నువ్వు సాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి" అంటాను.
మధుర: (ముక్కు మీద వేలుంచి) అలాంటి మాట అనకూడదు. తప్పు!
రామ: మంచి సలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను.
మధుర: డబ్బడగలేదే? మెప్పడిగాను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో ఉపకారం
రామ: మెచ్చి యిస్తానన్నా తప్పేనా?
మధుర: తప్పుకాదో? వేశ్యకాగానే దయాదాక్షిణ్యాలు వుండవో?
రామ: తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు..
మధుర: పెళ్లివంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి.
రామ:
చబాష్! యేమి విలవైన సలహా చెప్పావు! యేదీ చిన్నముద్దు (ముద్దు
పెట్టుకోబోయి, ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దన్నీ కూడా కలియగట్టి తంతాడేమో?
మధుర: ఆ భయం మీకక్కరలేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశం గారు పుంజ్యాలు తెంపుకు పరిగెత్తుతారు, ఆమె నోరు మహా చెడ్డది.
రామ:
అవును. నోరే కాదు, చెయ్యి కూడా చెడ్డదే. దం దెబ్బ నీకేం తెలుసును.
గాని, మా దొడ్డ సలహా చెప్పావు. యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును)
(ముద్దు బెట్టుకుంటుండగా, లుబ్దావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును)
లుబ్దా: యేమిటీ అభావచేష్టలూ!
రామ: (గతుక్కుమని తిరిగి చూసి) మావాఁ పడుచువాళ్లం గదా? అయినా, నా మధురవాణిని నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు?
మధుర: నడికుప్ప మీదయెక్కి ముదుపెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి. బావగారికి దండాలు, దయచెయ్యండి. (కుర్చీ తెచ్చి వేయును.)
రామ: నాకు మావఁగారైతే నీకు బావగారెలా గేవిఁటి?
మధుర:
మాకులానికి అంతా బావలే. తమకు యలా మావఁలైనారో? (లుబ్దావధాన్లుతో.)
కూచోరేం? యేమి హేతువోగాని బావగారు కోపంగా కనపడుతున్నారు. రేపు పెళ్లైన
తరవాత అక్కగారిని, వీధి తలుపు గడియవేసి మరీ ముద్దెట్టుగుంటారేమో చూస్తాను
గదా? అయినా మీ అల్లుడు గారికి యింకా చిన్నతనం యింకా వదిలింది కాదు.
రామ: పైలా పచ్చీసీలో, చిన్నతనంగాక పెద్దతనం యలా వస్తుంది? యేం, మావాఁ! కోపవాఁ?
లుబ్దా: నాకు పెళ్లీ వద్దు పెడాకులూ వద్దు.
రామ:
(మధురవాణి చెవిలో) చూశావా మధురం నా యంత్రం అప్పుడే పరింది. (పైకి
లుబ్దావధాన్లుతో) అదేం, అలా అంటున్నారు? నిశ్చయం అయిన తరవాత గునిసి యేం
లాభం?
లుబ్దా: నీ సొమ్మేం పోయింది? నాకీ పెళ్లి అక్ఖర్లేదు.
మధుర: (రామప్పంతులు చెవిలో) యేమిటా వుత్తరం?
రామ: (మధురవాణి చెవిలో) అగ్నిహోత్రావుధాన్లు పేరు పెట్టి నేనే బనాయించాను.
మధుర: (రామప్పంతులు చెవిలో) యేవఁని?
రామ: (మధురవాణి చెవిలో) నువ్వు ముసలవాడివి గనక నీ సంబంధం మాకు వద్దని.
మధుర: చిత్రం! చెప్పేస్తాను.
రామ:
(మధురవాణి చెవిలో) నీకు మతిపోయిందా యేమిటి? పెళ్లి తప్పించమను నువ్వే
నా ప్రాణాలు కొరికితే, యీ యెత్తు యెత్తాను. నోరుమూసుకో.
మధుర: (లుబ్దావుధాన్లు చెవిలో) యీ సంబంధం మీకు కట్టపెట్టాలని పంతులు చూస్తున్నారు. వప్పుకోకండి.
రామ:
(మధురవాణితో) యేమీ బేహద్బీ? (లుబ్దావుధాన్లుతో) స్త్రీ బుద్ధిః
ప్రళయాంతకః అన్నాడు. దాని మాటలు నమ్మకండి. కల్పనకి యింత మనిషి లేదు.
లుబ్దా: (చేతిలోని వుత్తరమును ఆడిస్తూ) యీ కుట్రంతా నీదే.
రామ: (తీక్షణంగా మధురవాణి వైపు చూసి, లుబ్దావుధాన్లుతో) కోపం కోపంలా వుండాలి గాని, యేకవచన ప్రయోగం కూడదు.
లుబ్దా: యిదంతా మీ కల్పనే. నా కొంప ముంచడానికి తలపెట్టారు.
రామ: (వుత్తరం అందుకోక కుర్చీ వెనక్కి తీసుకొని) ఆ వుత్తరం సంగతి నాకేం తెలుసును?
లుబ్దా: చేసిన వాడివి, నీకు తెలియకపోతే, యెవరికి తెలుస్తుంది?
రామ:
అదుగో మళ్లీ యేకవచన ప్రయోగం! మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు ఆనాడీ
చేస్తున్నారు? వుత్తరం గిత్తరం నేను కల్పించానని, మళ్లీ అన్నారంటే కథ చాలా
దూరం వెళుతుంది. ఆ సంగతి మట్టుకు కాని వుండండి. రామప్పంతులు తడాఖా అంటే
యేవఁనుకున్నారో?
లుబ్దా: నువ్వు -
రామ అదుగో మళ్లీ.
లుబ్దా:
మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటు నాది. మధ్య
వెధవలతో నాకేం పని. వెంటనే బయల్దేరి పోయి, ఆ అగ్నిహోత్రావధాన్లునే
అడుగుతాను.
రామ మాటలు మా జోరుగా వస్తున్నాయి. జాగ్రత్త (లుబ్దావధాన్లు వెళ్లును) నన్నే నా వెధవలు అంటున్నాడు?
మధుర: నన్ను కూడా కలుపుకోవాలని వుందా యేవిఁటండి?
రామ నన్ను మట్టుకు వెధవని కింద కట్టావూ?
మధుర: నేనుండగా వెధవలు మీరెలా అవుతారు?
రామ నన్ను సప్త వెధవని చేశావు. మరి యింకా తరువాయి యేం వుంచావు?
మధుర: అదేవిఁటి ఆ మాటలు?
రామ ఆ వుత్తరం నేను బనాయించానని, ఆ వెధవతో యెందుకు చెప్పావు?
మధుర: మీ తోడు, నేను చెప్పలేదే?
రామ మరి నేను బనాయించానని, వాడికెలా తెలిసింది?
మధుర: యెందుకీ ఆందోళన?
రామ
మరి ఆ వెధవ ఆ వుత్తరం, తీసుకెళ్లి అగ్నిహోత్రావధాన్లుకి చూపిస్తే నా
మీద వెంటనే పోర్జరీ కేసు బనాయిస్తాడే? పీక తెగిపోతుంది? యేవిఁటి సాధనం?
మధుర: యంత్రం యెదురు తిరిగిందో? ఐతే చక్రం అడ్డు వేస్తాను. (మధురవాణి తొందరగా వీధిలోకి వెళ్లును.)
రామ
యిదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేశింది. దొంగ పని చేసినప్పుడు
రెండో వారితో చెప్ప కూడదు. వెధవని చెవులు నులుముకుంటాను. పరిగెత్తి వెళ్లి
చేతులో కాగితం నులుపుకొత్తునా? - గాడిదకొడుకు కరిస్తే? పోయి మీనాక్షి
కాళ్లు పట్టుకుంటాను.
మధురవాణి వక చేతిలో వుత్తరము, వకచేతిలో లుబ్దావధాన్లు
చెయ్యి పట్టుకొని ప్రవేశించును
మధుర:
(రామప్పంతులుతో) చాలు, చాలు మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా,
తమ్ముడా, కొడుకా, కొమ్మా? మిమ్మలిని ఆప్తులని నమ్ముకుని, సలహాకి వస్తే,
ఆలోచనా సాలోచనా చెప్పక, ఏకవచనం, బహువచనం, అని కాష్ట వాదం పెట్టారు. బావా!
కుర్చీ మీద కూచోండి. (కుర్చీ మీద కూచోబెట్టి) (రామప్పంతులుతో) యీ వుత్తరం
యేవిఁటో నింపాదిగా చదివి చూసుకోండి (వుత్తరం రామప్పంతులు చేతికి యిచ్చును)
రామ:
(వుత్తరం అందుకుని తనలో) బతికాన్రా దేవుఁడా. (చూచుకుని) అరే నా
వుత్తరవేఁ కాదే యిది. నా నీడ చూసి నేనే బెదిరాను. (పైకి) మావాఁ! వొస్తూనే
తిట్లతో ఆరంభిస్తే యెంతటి వాడికైనా కొంచం కోపం వస్తుంది. నెమ్మదిగానూ,
మర్యాదగానూ, నన్నొచ్చి యేం సహాయం చెయమంటే అది చెయనూ?
లుబ్దా: మరైతే యీ పటాటోపం వద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆ ఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి.
మధుర:
(లుబ్దావధావన్లు, జుత్తు ముడి విప్పి దులిపి) సం రక్షణ చేసే వాళ్లు
లేకపోబట్టి గదా? (గూటిలో నుంచి వాసననూనె దువ్వెనా తెచ్చి తలదువ్వుచుండును)
రామ: (వుత్తరం తిప్పి కొస చూసి చదువును.) "శేవకుడు తమ్ములు గిరీశం" -- వీడా!
మధుర: పైకి చదవండి
రామ: నీ గిరీశం అనగానే పైకి చదవాలేం?
లుబ్దా: "నీ గిరీశం" అన్నారేం?
రామ: అది వేరే కథ.
లుబ్దా: పైకి చదవండి
రామ: (చదువును)
"శేవకుడు,
తమ అత్యంత ప్రియ సోదరులు గిరీశం అనేక నమస్కారములు చేసీ చాయంగల విన్నపములు.
త|| యీ నాటికి వృద్ధాప్యం లోనయినా మీరు తిరిగీ వివాహం చేసుకుని ఒక
యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్న మాట. విని యమందానంద కందళిత
హృదయారవిందుడనైతిని."
లుబ్దా: వెధవ, వృద్ధాప్యవఁంటాడూ? మొన్న గాక మొన్ననే గదా యాభైదాటాయి.
మధుర:
(దువ్వెన మొలను పెట్టి, లుబ్దావధాన్లు జుత్తు ముడి వేసి) సం రక్షణ లేక
యిలా వున్నారుగాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనే వారు?
రామ:
(చదువును) " మీకు కాబోవు భార్య, నా ప్రియ శిష్యుండగు వెంకటేశ్వర్లు
చెలియలగుటంజేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి యింటనే
వుండి పెళ్లిపనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్ర ప్రాయముగా
నాదరించుచున్నారు. బహు దొడ్డవారేగాని చంద్రునకు కళంకమున్నటుల కించిత్తు
ద్రవ్యాశా కించిత్తు ప్రధమకోపమూ గలవు"
గుంటడూ! వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ
"ష"
ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం యెదుట పడకుండా దాగుంటే యెముకలు విరగవు. ప్రాణం
బచాయిస్తుంది. మరేమీ ఫర్వా వుండదు - ద్రవ్యాశ అనగా అది వారికి గాని మీకు
గాని వుపచరించేది కాదు. మీ వూరివారెవరోగాని ఒక తుంటరి, మీరు విశేష
ధనవంతులనియు, పెళ్లి దేవదుందుభులు మ్రోయునటుల చేతురనియు, వర్తమానముచేయుటను,
యేబది బండ్లమీద యీ వూరివారి నందరిని తర్లించుకు రానై యున్నారు. ఇంతియకాక,
దివాంజీ సాహేబు వారనడిగి, ఒక కుంజరంబునూ, మూడు లొట్టియలనూ, యేను
గుఱ్ఱంబులను గూడ తేనై యున్నారు. బంగారపుటడ్డల పల్లకీ గూడ దెచ్చెదరు.
"షరా--
దాని మీద సవారీ ఐ, ఆలండౌ లత్తులతో వూరేగి, మీరు పెళ్లి చేసుకోవడం నాకు
కన్నులపండువే గాని, యిదంతా వృధా వ్యయం గదా, అని నాబోటి ఆప్తులు
విచారిస్తున్నారు. యెద్దు పుండు కాకికి రుచి. రామప్పంతులు సొమ్మేంబోయింది?"
వెధవ! నావూసెందుకోయి వీడికి ?
"యిందులో ఒక పరమరహస్యం. అది యెద్దియనిన, యీ రామప్పంతులు చిక్కులకు జాకాల్; తెలివికి, బిగ్ యాస్."
యిదేవిఁటోయి, యీ బొట్లేరు యింగిలీషు!
"అనగా"
వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయా!
" జాకాల్, అనేది, గుంటనక్క"
పింజారీ వెధవ!
" "బిగ్ యాస్, అనగా, పెద్ద--
వీడి సిగ దరగా! యేం వీడిపోయీ కాలం! వీడిమీద తక్షణం దామేజి దావా పడేస్తాను.
(మధురవాణికి నవ్వొచ్చి, ఆపుకోజాలక, విరగబడి నవ్వును.)
యెందుకలా నవ్వుతావు? నీ మొగుడు నన్ను తిడుతున్నాడనా ఆనందం?
మధుర: (నవ్వు చేత మాట తెమలక, కొంత సేపటికి) కాదు-కాదు-మీ తోడు-లొటి-
రామ: నా తోడేవిఁటి! నేను చస్తే నీకు ఆనందవేఁ!
మధుర: (ముక్కు మీద వేలువుంచి, రామప్పంతులు దగ్గరకు వెళ్లి, శిరస్సు కౌగలించుకొని, ముద్దెట్టుకొనును) యేమి దుష్టు మాటా!
రామ: మరెందుకు నవ్వుతావ్?
మధుర: లొటి-లొటి-లొటి-!
రామ: యేవిఁటా "లొటి"?
మధుర: లొటి-పిట-!
రామ: అవును, లొటిపిట, అయితే?
మధుర: (సమాళించుకొని) యెందుకో?
రామ: యెందుకో నాకేం తెలుసును?
లుబ్దా: ఉత్తరం వల్ల మీరే తెమ్మనట్టు అగుపడుతూందే?
రామ: నేనా? నేనా? నాకెందుకూ లొటిపిట?
మధుర: (ఉప్పెనగా తిరిగీ నవ్వుతూ) యెక్కడానికీ.
రామ: నేనా యెక్కడం?
లుబ్దా:
యెందుకు కూడదూ? మీరొక లొటి-పిట-బావగారొక లొటిపిట-
పో-పో-పోలిశెట్టి-పెళ్లి సప్లయిదారుడు గనక, అతడో లొటిపిట-యెక్కి
పొలాలంట-వూరేగండి-వెన్ను కుప్పెక్కి-ఆ వైభవం-కళ్లారా-చూస్తాం- (మిక్కిలిగా
నవ్వును. నవ్వును సమాళించుకొని) బావగారూ, క్షమించండి- ఆ దుష్టు వ్రాతకి
నవ్వాను- మరేంగాదు.
రామ: దుష్టంటే దుష్టా! గాడిద!
లుబ్దా: మీరొహ, పెద్దగాడిదని కూడా తెమ్మన్నారని కాబోలు, రాశాడండీ.
రామ: లేదు, లేదు, గాడిదె మాట వుత్తరంలో యక్కడా లేదు.
లుబ్దా: వుంది. నేను చదివానండీ. గాడిదెనెందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికీ?
రామ:
నీకు మతిపోతుందా యేమిటి? గాడిదె మాట లేదంటుంటేనే? (మధురవాణి తిరిగీ
నవ్వుచుండును) నీక్కూడా మతి పోయిందీ? యెందుకా నవ్వు? నన్ను చూశా?
అవధాన్లును చూశా?
మధుర: యెందుకు-ఆ-అనుమానం? - సామెత-వుంది.
రామ: యేమిటా సామెత గీమెతాను?
మధుర: గాడిద అందిట- పాటకి నేను - అందానికి-మా అప్పా-అందిట-
రామ: అంటే?
మధుర: పెళ్లికి గాడిద-లొటిపిటా మాట-యిన్నాళ్లకి-మళ్లీ విన్నాను గదా అని.
రామ: వింటే?
మధుర: నవ్వొచింది. మీరు కూడా నవ్వరాదూ? యెందుకీ దెబ్బలాట?
రామ: వీడిమీద డామేజి దావా వెంటనే పడేస్తాను.
మధుర:
(లుబ్దావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులు గరి మీద అన్యాయంగా అనుమానం
పడతారు. ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. గిరీశంగారు
పంతులు మీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలసిన సంగతి కాదు
గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు చెప్పక తీరదు. మీ
గిరీశంగారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు నన్ను
వుంచుకున్నారు. మా పంతులు గారు ఆయన దగ్గిర నుంచి నన్ను తీసుకు వెళ్లిపోయి
వచ్చినారనే దుఃఖం చేత లేనిపోని మాటలు కల్పించి "నక్కాగిక్కా" అని వ్రాశారు
గాని, ఆ బొల్లి మాటలు నమ్మకండి.
రామ: "నక్కా గిక్కా" వట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజి దావా పడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది.
మధుర: బావా, మరొక మాట ఆలోచించండీ. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, గాడిదలూ. (నవ్వును)
రామ: మనిషివి కావా యేమిటి? గాడిదె మాట లేదంటూంటేనే?
మధుర:
పోనియ్యండి-మీకెందుకు కోపం! గాడిదలు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ
మీ యింటిమీదపడి తింటే మాపంతులుగారికి యేం లాభం? చెప్పండీ. ఒక వేళ రాతబు
బేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును.
లుబ్దా: బాగాచెప్పావు- పోలిశెట్టి చేసిన పనే!
రామ: చవగ్గా చేస్తాడని ఖర్చువెచ్చం కోవఁటాడిమీద పెట్టావు. అనుభవించు.
మధుర:
ఇప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పదిరూపాయల ఖర్చుతో
యిక్కడ ముడిపెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీరు మీ మావఁగారి పేర వుత్తరం
వ్రాయండి
లుబ్దా: మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. మావఁగారూ, మధురం మా బుద్ధిమంతురాలు.
రామ: అదుగో! "మధురం గిధురం" అని మీరు అనకూడదు "మధురవాణి" అనాలి.
లుబ్దా: పొరపాటు--గాని తీరామోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కర్తెనీ పంపించేస్తే?
మధుర: మరేం? మీ తీపు దిగదీసిందీ? పెళ్లి చేసుకోండి?
లుబ్దా: నా ప్రాణంపోతే ఈ సంబంధం చేసుకోను. ఆ వుత్తరం కొసాకూ చదివితే అభావ చేష్టలు మీకే బోధపడతాయి.
మధుర: చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు?
రామ: గిరీశం గాడిమీద పరువు నష్టానికి డామేజీ దావా తేక మాన్ను- వాడి మొహం లాగే వుంది వుత్తరం. చదివేదేవిఁటీ.
లుబ్దా: మా వెధవ నా పరువు మాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండీ.
రామ: (చదువును)
తాజా
కలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచం పెయ్యనాకుడు మాత్రం కద్దు.
అద్దానిని మన వారు వైధవ్య హేతువ అండ్రు. యిది వట్టి
సూప-సూపర్-స్టి-షన్-అనగా, తెలివితక్కువ నమ్మకం. మన వంటి ప్రాజ్ఞులు
లెక్కించవలసినది కాదు. షరా-దీనికి వక బైరాగీ చిటికీ వున్నది. చిమ్మిటతో
పెయ్యనాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌడరు-అనగా గుండ కద్దు; ఆ గుండ ప్రామినచో
మరల పెయ్యనాకుడు పుట్ట నేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే సంప్రాప్తించినచో,
పదే పదే క్షౌరంబౌను గావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ నెంబరు షరా-
ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మా వదెనగారు జుత్తు పెంచుకునే యడల మీరేం
జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?
మధుర: చాల్చాలు; యీ పాటి చాలించండి. గిరీశం గారు యేం తుంటరి?
రామ: యిప్పుడైనా వాడి నైజం నీకు బోధపడ్డదా? (చదువును)
మూడవ
షరా- యీ రోజుల్లో స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగానున్నది. తమకు విశదమే.
మీరు స్వర్గంబునకుంబోయి ఇంద్రభోగం బనుభవించుచుండ నామెకు పునర్వివాహము
చేసికొన బుద్ధి పొడమ వచ్చును. అదిమాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా
తెలియునది. ఏలననిన? వద్దని మందలించుటకు ఎదట పడితిమో, "మీయన్న స్వర్గంబున
రంభతో పరమానందంబునొందుచు నున్నారుకదా; నా గతేమి" యని యడిగినచో నేమి యుత్తర
మీయువాడ?
మధుర: మరి చాలించండి.
రామ: నీ యిష్టం వచ్చినప్పుడు చదివి, నీయిష్టం వచ్చినప్పుడు మానేస్తా ననుకున్నావా? (చదువును)
నాల్గవ
షరా- కొదువ అన్ని హం శములూ బహుబాగా వున్నవి. తప్పకుండా యీ సంబంధం మీరు
చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతి వంటివారు. మనలో మన మాట,
ఆమెకు యీ సంబంధం యెంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తెకట్టే సమయమందు, మీ యింటి
నూతిలోపడి ప్రాణత్యాగం చేసుకుంటానని, యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని
ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ, కాళ్లూ చేతులూ కట్టేదాం. మూడు ముళ్లూ
పడ్డతరవాత నూతులో పడితే పడనియ్యండి. మన సొమ్మేం బోయింది? పోలీసువాళ్ల
చిక్కు లేకుండా మాత్రం, వాళ్లకేమైనా పడేసి వాళ్లని కట్టుకోవలసి వస్తుంది.
యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరచి
పోయినాను, పిల్ల జాతకం అత్యుత్కృష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ-"
మధుర: రామ?
రామ: అది ఆడవాళ్లు వినవలసిన మాట కాదు.
లుబ్దా: అది కూడా మీరే బనాయించారంటా డేవిటండీ?
రామ: వాడి నోటికి సుద్దీ, బద్ధం వుందీ? డామేజీ పడితే గాని కట్టదు.
లుబ్దా:
కొంచం అయినా నిజం వుండక పోతుందా, అని నా భయం. అత్తగారికి యిష్టం లేదని
పోలిశెట్టి కూడా చెప్పాడు. యీ సంబంధానికి వెయివేల దణ్ణాలు; నాకొద్దు బాబూ.
మధుర: బాగా అన్నారు. మీ సంబంధం మాకు యెంత మాత్రం వద్దని, మీ మావఁగారి పేర వ్రాయండి. కాకితం కలం తేనా?
లుబ్దా:
మావాఁ! మరి ముందూ వెనకా ఆలోచించక వెంటనే వుత్తరం వ్రాసి పెట్టండీ.
(నిలబడి మధురవాణి చెవిలో రహస్యము మాట్లాడును; మధురవాణి లుబ్దావుధాన్లు
చెవిలో మాట్లాడును.)
రామ: మొహం మీద మొహం పెట్టి, యేవిఁటా గుసగుసలు?
పైనుంచి పోస్టు జవాను - "లుబ్దావుధాన్లు గారున్నారండీ. వుత్తరం వచ్చింది"
( మధురవాణి పైకి వెళ్లి వుత్తరము తెచ్చి లుబ్దావుధాన్లు చేతికి యిచ్చును.
లుబ్ధావుధాన్లు రామప్పంతులు చేతికి యిచ్చును.)
లుబ్దా: సులోచనాలు తేలేదు. మీరే చదవండీ.
రామ: (తనలో చదువుతూ) మరేవీఁ! చిక్కే వదిలిపోయింది. మీ మావఁగారి దగ్గర్నించి.
లుబ్దా: యేవఁని? యేనుగులూ, లొటిపిటలూ తానంటాడా యేవిటండి?
రామ: మీ సంబంధవేఁ అక్కర్లేదట.
లుబ్దా: యేవిఁటీ? యెంచాతనూ? వాడికా అక్కర్లేదు? నాకా అక్కర్లేదు? తన పరువుకి నేం తగాను కానూ?
మధుర: నిమిషం కిందట పెళ్లి వద్దన్నారే? యిప్పుడు పెళ్లి తప్పి పోయిందని కోపవాఁ
లుబ్దా: యింకా యేం కూస్తాడో చ్చెప్పండీ.
రామ: మీరు పీసిరిగొట్లని యెవరో చెప్పారట
లుబ్దా:
నేనా పీసిరిగొట్టుని? వక్కపాటున పద్దెనిమిది వందలు యే పీసిరి గొట్టు
పోస్తాడు? యింత సొమ్ము యెన్నడైనా, ఒక్కసారి అగ్నిహోత్రావుధాన్లు కళ్లతో
చూశాడూ? సంసారం ఫొక్తుగా చేసుకుంటే పీసిరిగొట్టా? వాడి సొమ్ము వాడి నెత్తిన
కొట్టిన తరవాత, నేనెలాంటి వాణ్ణి అయితే వాడికేం కావాలి?
మధుర: యెలాంటి వాళ్లేం? బంగారంలా వున్నారు?
రామ: మీరు ముసలివాళ్లనీ, మీకు క్షయరోగం వుందనీ కూడా, యెవరో చెప్పారట.
లుబ్దా:
నేను ముసలివాణ్ణా వీడి సిగ తరగా! యాభైయేళ్లకే ముసలిటండీ? కొంచం దగ్గు
వుండడవేఁ కాగట్టండి (దగ్గును) నిలివెడు ధనంపోసి పిల్లని కొనుక్కున్న తరవాత,
మరిదాని ఘోషా, నా ఘోషా వాడికెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తరవాత చచ్చిన
శవానికైనా కట్టకతీరదు. మాటాడ్రేం?
రామ: అవును; నిజవేఁ. మీరు ముసలివాళ్లైతే మాత్రం?
లుబ్దా: అదుగో. 'ఐతే మాత్రం' అంటారేవిఁటి? నువ్వే పెట్టావు కాబోలు యీ పెంటంతాను.
రామ: అన్ని పెంటలు పెట్టడానికీ నీ తమ్ముడు గిరీశం అక్కడే వున్నాడు కదూ?
లుబ్దా: వీడు అక్కడెలా పోగయినాడయ్యా నాకు శనిలాగ?
మధుర:
ఏమి! యీ మగవారి చిత్రం! యింతసేపూ పెళ్లి వద్దని వగిస్తిరి; యిప్పుడు
తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్లాడాలని వుందండీ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి