Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

నృసింహ కవి విరచిత కృష్ణ శతకం




నృసింహ కవి విరచిత కృష్ణ శతకం



1. శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరి
ద్వారకానిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా

2. నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా

3. నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహ దానవ వైరి
క్షీరాబ్దిశయన యదుకుల
వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా

4. హరియను రెండుఅక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్వము
హరిహరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా

5. క్రూరాత్ము డజామీళుడు నారాయణ యనుచు నాత్మనందనుబిలువ
నేరీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పులందును కృష్ణా

6. చిలుక నొకరమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరన్
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిముదలచు జనుల కరుదా కృష్ణా

7. అకౄరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా
శక్రాది దివిజ సన్నుత
శుక్రార్చిత నన్నుకరుణ జూడుము కృష్ణా

8. నందుని ముద్దుల పట్టివి
మంధరగిరిధరుని హరిని మాధవ విష్ణున్
సుందరరూపుని మునిగణ
వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణా

9. ఓ కారుణ్య పయోనిధి నా కాధారంబగుచు నయముగ బ్రోవన్
నాకేల ఇతర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా

10. వేదంబులు గననేరని
ఆదిపరబ్రహ్మమూర్తి వనఘ మురారి
నాదిక్కు జూచి కావుము
నీదిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా

11. పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా

12. అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమున బుట్టి నా దేవకికిన్
దుష్టుని గంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా

13. అల్ల జగన్నాధుకు వ్రే
పల్లియ క్రీడార్ధమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
దల్లియునై చన్నుగుడిపె దనరగ కృష్ణా

14. అందెలు గజ్జెలు మ్రోయగ
జిందులు ద్రొక్కుచును వేడ్క చేలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు గృష్ణా

15. హరిచందనంబు మేనున
గరమొప్పెడు హస్తములను గంకణరవముల్
ఉరమున రత్నము మెరయగ
బరగింతివొ నీవు బాలప్రాయము కృష్ణా

16. పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయగ బింఛం
బాణీముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాధుడ కృష్ణా

17. మడుగుకు జని కాళీయుని
పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలతు నచ్యుత కృష్ణా

18. బృందావనమున బ్రహ్మా
నందార్బకమూర్తి వేణు నాదము నీ వా
మందార మూలమున గో
విందా పూరింతువౌర వేడుక గృష్ణా

19. వారిజ నేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
చీరలు మ్రుచ్చిలి యిచ్చితి
నేరుపుగా యదియు నీకు నీతియె కృష్ణా

20. దేవేంద్రు డలుకతోడను
వానిరిగా రాళ్ళవాన వడి గురియింపన్
గోవర్దనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా

21. అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా

22. అంసాలంబితకుండల
కంసాతక నీవు ద్వారకాపురిలోనన్
సంసారి రీతినుండి ప్ర
శంసార్హుడవైతి వహహ జగతిని గృష్ణా

23. పదియారువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక దమియింతువౌర వసుధను గృష్ణా

24. అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొసగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా

25. హా వసుదేవకుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆవనజాక్షికి నిచ్చితి
శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా
26. శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ నాహావభూమిన్
విభ్రమలగు దనుజుసుతా
గర్భంబుల పగులజేయు ఘనుడవు కృష్ణా

27. జయమును విజయునికీయ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేన వెరిగి పారగ గృష్ణా

28. దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగ దలచి నీవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జును రధచోదకుండవైతివి కృష్ణా

29. శక్రసుతు గాచుకొరకై
చక్రము చేబట్టి భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రాగ్రహ సర్వలోకనాయక కృష్ణా

30. దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముడవై
దివిజేంద్రసుతుని గాచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున గృష్ణా

31 దుర్భర బాణము రాగా
గర్భములోనుండి యభవకావుమటన్నన్
నిర్బరకృప రక్షించితి
వర్బకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా

32. గిరులందు మేరువౌదువు
సురలందున నిందుడౌదు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతివౌదు నయముగ గృష్ణా

33. చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జోక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు గృష్ణా

34. కుక్షిని నఖిలజగంబుల
నిక్షేపముజేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షత బవళించునట్టి ధన్యుడ కృష్ణా

35. విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా

36. అగణితవైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణ యో
భగవంతుడ శ్రీమంతుడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా

37. మగమీనమవై జలనిధిని
బగతుని సోమకుని జంపి పద్మభవునకున్
నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర మమ్ము గరుణ జూడుము కృష్ణా

38. అందరు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ది దరువ బౌలుపున నీ వా
నందంబుగ గూర్మమవై
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా

39. ఆదివరాహమవయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడగ
మేదిని వడి గొడుగునెత్తి మెరసితి గృష్ణా

40. కెరలి యరచేత గంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా

41. వడుగవునై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా

42. ఇరువదొకమారు నృపతుల
శిరములు ఖండించితౌర చేగొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా

43. దశకంఠుని బరిమార్చియు
గుశలముతో సీతదెచ్చికొనియు నయోధ్యన్
విశదముగ గీర్తినేలిన
దశరధరామావతార ధన్యుడ కృష్ణా

44. ఘనులగు ధేనుకముష్టిక
దనుజుల జెండాడితౌర భుజశక్తిన్
అనఘాత్మ రేవతిపతి
యనగా బలరామమూర్తి వైతివి కృష్ణా

45. త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కపటపురాజువు భళిరే
కృపగల బౌద్దావతార ఘనుడవు కృష్ణా

46. వలపుగల జేతి నెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్
కలియుగము తుదను వేడుక
కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా

47. వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై
కన నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రులెన్న జాలరు కృష్ణా

48. అపరాధ సహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గమటాత్ముడనై చేసితి
జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా

49. నరపశువ మూఢచిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడను నీ
గురుతెరుగ నెంతవాడను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా

50. పరనారీ ముఖపద్మము
గురుతుగ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నెరతిని నిను భక్తిగొల్వ నేరరు కృష్ణా
 
 
51. పంచేంద్రియమార్గంబుల
గొంచెపు బుధ్దిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరినాడ నిప్పుడె కృష్ణా

52. దుష్టుండ దురాచారుండ
దుష్టచరిత్రుడను చాల దుర్భుధ్ధిని నే
నిష్ట నిను గొల్వనేరను
కష్టుడనగు నన్ను కావు కరుణను కృష్ణా

53. కుంభీంద్రవరద కేశవ
జంభాసురవైరి దివిజ సన్నుత చరితా
అంభోజనేత్ర జలనిధి
గంభీరా నన్ను గావు కరుణను గృష్ణా

54. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణా

55. హరి నీవే దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడంగ
గరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా

56. పురుషోత్తమ లక్ష్మీపతి
సరసిజగర్భాది మౌనిసన్నుతచరితా
మురభంజన సురరంజన
వరదుడ వగు నాకు భక్తవత్సల కృష్ణా

57. క్రతువులు తీర్థాటనములు
వృతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
పతి మిము దలచినవారికి
నతులితపుణ్యములు గలుగు టరుదే కృష్ణా

58. స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్
అంభోజనేత్ర జననిధి
గంభీరుడ నన్ను గావు కరుణను గృష్ణా

59. శతకోటి భానుతేజా
యతులితసద్గుణగణాఢ్య యంబుజనాభా
రతినాధజనక లక్ష్మీ
సతిహిత నను గావు భక్తవత్సన కృష్ణా

60. మందుడ నే దురితాత్ముడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా

61. గజరాజవరద కేశవ
త్రిజగత్కళ్యాణమూర్తి దేవ మురారి
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుడ నన్నుగావు వేగమె కృష్ణా

62. గోపాల కృష్ణ మురహర
పాపాలను బారద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిటగలిగి ప్రోవు నమ్మితి గృష్ణా

63. దుర్వార చక్రధరకర
శర్వాణీ భర్తృవినుత జగదాధారా
నిర్వాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సరగున కృష్ణా

64. సుత్రామనుత జనార్ధన
సత్రాజిత్తనయనాధ సౌందర్యకళా
చిత్రావతార దేవకి
పుత్రా ననుగావు నీకు బుణ్యము కృష్ణా

65. బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ గృష్ణా

66. పరుసము సోకిన ఇనుమును
వరుసగ బంగారమైన వడువున జిహ్వన్
హరి నీ నామము సోకిన
సురవందిత నేను నటుల సులభుడ గృష్ణా

67. ఒకసారి నీదునామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలాత్ధ యజామిళుండు సాక్షియె కృష్ణా

68. హరి సర్వంబున గలడని
గరిమను దైత్యుండు పలుక గంబములోనన్
ఇరవొంది వెడలిచీల్చవె
శరణన బ్రహ్లాదుడిండు సాక్షియె కృష్ణా

69. భద్రార్చిత పదపద్మ సు
భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ
భద్రాధిప కేశవ బల
భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా

70. ఎటువలె గరిమొర వింటివి
ఎటువలె బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాడ గావుము కృష్ణా

71. తటతట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్
ఎటువలె పుణ్యుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా


72. తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరెపదవి పుట్టుట యేమో
హరి మిము దలచిన వారికి
నరుదా కైవల్యపదవి యచ్యుత కృష్ణా


73. ఓ భవబంధవిమోచన
ఓ భరతాగ్రజ మురారి యోరఘురామా
ఓ భక్తకామధేనువ
ఓ భయహర నన్నుగావుమో హరి కృష్ణా

74. ఏతండ్రి కనకకశ్యపు
ఘాతకుడై యతనిసుతుని గరుణను గాచెన్
ప్రీతి సురకోటి పొగడగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి గృష్ణా

75. ఓ పుండరీకలోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవింద
యో పురసంహర మిత్రుడ
యో పుణ్యుండ నను బ్రోవుమో హరి కృష్ణా

76. ఏవిభుడు ఘోర రణమున
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభిషణు
నా విభునే దలతు మదిని నచ్యుత కృష్ణా

77. గ్రహభయ దోషము లొందవు
బహు పీడలు చేర వెరచు బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహతహలెక్కడివి నిన్నుదలచిన గృష్ణా

78. గంగ మొదలైన నదులను
మంగళముగజేయునట్టి మజ్జనములకున్
సంతతి గలిగిన ఫలములు
రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా

79. ఆ దండకావనంబున
కోదండముదాల్చినట్టి కోమలమూర్తీ
నాదండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా

80. చూపుము నీ రూపంబును
బాపపు దుష్కృతములెల్ల బంకజనాభా
శ్రీపతి నిను నమ్మినాడ సిధ్ధము కృష్ణా

81. నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీ నామ మమృత పూర్ణము
నీ నామము నేదలంతు నిత్యము కృష్ణా

82. పరులను నడిగిన జనులకు
కురుచ సుమీ యిది యటంచు గురుతుగ నీవున్
గురుచడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని దద్దయు గృష్ణా

83. పాలను వెన్నయును మ్రుచ్చిల
రోలను మీ తల్లి కట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుడవా బ్రహ్మకన్న ప్రభుడవు గృష్ణా

84. రఘునాయక నీనామము
లఘుమతితో దలమగలనే లక్ష్మీరమణా
అలఘవముల బాపుము దయతో
రఘురాముడవైన లోక రక్షక కృష్ణా

85. అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభశాలీ
యప్పా నను గనుగొనవే
యప్పా ననుబ్రోవు వెంకటప్పా కృష్ణా

86. కొంచెపువాడని మదిలో నెంచకుమీ వాసుదేవ యిభవరద హరీ
యంచితముగ నీ కరుణకు
గొంచము నధికంబు గలదె కొంతయు గృష్ణా


87. వానిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గుసేయు గర్వాంధులకున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ గృష్ణా
  
88. అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
జయ్యన గలగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ గృష్ణా

89. కంటికి రెప్ప విధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటక మగు పాపములను గడచితి గృష్ణా

90. యమునకు నిక నే వెరువను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరగ దలచెదను వేగ ననిశము కృష్ణా.

91. దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు దండము కృష్ణా

92. నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగధర కృష్ణా


93. తిరుమణి దురితవిదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి బెట్టిన మనుజుడు
పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణా

94. శ్రీలక్ష్మీనారాయణ
వాలాయము నిన్ను దలతు వందితచరణా
ఏలుము నను నీ బంటుగ
జాలగ నిను నమ్మినాను సరసుడ కృష్ణా

95. శ్రీధర మాధవ యచ్యుత
భూధర పురుహూతవినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణా

96. శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుబతకము
సిరినాయక యమరవినుత శ్రీహరి కృష్ణా


97. అందెలు పాదములందును
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర మునిసన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా


98. కందర్పకోటి సుందర
మందరధర భానుతేజ మంజులదేహా
సుందర విగ్రహ మునిగణ
వందిత మిము దలతు భక్తవత్సల కృష్ణా


99. దుర్మతిని మిగుల దుష్టపు
గర్మంబుల జేసినట్టి కష్టుండ నన్నున్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముడ నిన్ను నమ్మినాను సతతము కృష్ణా

100. అనుదినము కృష్ణశతకమ
వినిన బఠిబచినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గోగణములు
తనయులు నభివృధ్ధి బొందు దద్దయు గృష్ణా
  శ్రీ నృసింహకవి రచించిన శ్రీకృష్ణశతకం ఇంతటితో సమాప్తం.
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి